
పోలవరం డ్యామ్ సరే, నిర్వాసితుల ఇక్కట్లూ చూడండి సీఎం సార్!
1.25 లక్షల కుటుంబాల్లో ఇప్పటివరకు 21 శాతం మందికే పరిహారం అందిందన్న సీపీఎం
పోలవరం ప్రాజెక్టు సందర్శనకే పరిమితం కాకుండా మునక ప్రాంతాల్లోని నిర్వాసితుల పరిస్థితినీ ప్రత్యక్షంగా చూడాలని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం పోలవరం ప్రాజెక్ట్ ను సందర్శించారు. ఈ సందర్భగా వి.శ్రీనివాస రావు బహిరంగ లేఖ రాశారు.
ఇంజినీర్ల లెక్కల ప్రకారం డ్యామ్ పనులు 72 శాతం పూర్తయ్యాయని చెబుతున్నప్పటికీ, మునక ప్రాంతాల్లోని సుమారు 1.25 లక్షల కుటుంబాల్లో ఇప్పటివరకు 21 శాతం మందికే పరిహారం అందిందని ఆయన తెలిపారు. అధికారిక లెక్కల ప్రకారం సమగ్ర పునరావాసం పూర్తైన వారు కేవలం 12 శాతం మాత్రమేనని పేర్కొన్నారు.
డయాఫ్రమ్ వాల్‌పై ప్రేమ.. నిర్వాసితులపై నిర్లక్ష్యం!
ప్రభుత్వం డయాఫ్రమ్ వాల్ మరమ్మతులకు అదనంగా 900 కోట్లు కేటాయించి కాంట్రాక్టర్లను ఆదుకుంది. నాసిరకం పనుల వల్ల అది దెబ్బతిందని విదేశీ నిపుణులు తేల్చినా, ఆ నివేదికను ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారు? తప్పు చేసిన కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోకుండా, ప్రజల సొమ్మును అదనంగా ఎందుకు దోచిపెడుతున్నారు? ప్రాజెక్టు భద్రతపై విదేశీ నిపుణుల సిఫార్సులను బహిరంగపరచకుండా ప్రభుత్వం చేస్తున్న దోబూచులాట వెనుక మర్మమేంటని వి.శ్రీనివాసరావు ప్రశ్నిస్తున్నారు.
1986, 2022 వరదల్లో పోలవరం మునక ప్రాంతాల భీభత్సాన్ని కళ్లకు కట్టాయి. కానీ ప్రభుత్వం జరిపిన కాంటూరు, లైడార్ సర్వేలు క్షేత్రస్థాయి వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయి. మొత్తం 1.20 లక్షల కుటుంబాలు ఉంటే, కేవలం 38,000 కుటుంబాలకే మొదటి దశలో పునరావాసం అనడం వివక్ష కాదా? 2017 పాత అంచనాల ప్రకారం పరిహారం ఇవ్వడం దారుణం. 2024 ఎన్నికల ముందు జగన్ ప్రకటించిన 10 లక్షల ప్యాకేజీ అటకెక్కింది, మీ ప్రభుత్వం అయినా ప్రస్తుత ధరల ప్రకారం సవరించాలి. పునరావాస ప్యాకేజీలో మహిళలను చిన్నచూపు చూడటం ఏంటి? 18 ఏళ్లు నిండిన యువతులకు, పురుషులతో సమానంగా ప్యాకేజీ ఇవ్వాలి అని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
డ్యామ్ సందర్శన కాదు.. కాలనీలనూ సందర్శించండి!
కేవలం అధికారులతో కలిసి డ్యామ్ పనుల ఫోటోలకు ఫోజులు ఇవ్వడం వల్ల సమస్య పరిష్కారం కాదు. వర్షం వస్తే కారుతున్న ఆర్ అండ్ ఆర్ కాలనీలను సందర్శించండని, ముఖ్యమంత్రి స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లాలని సీపీఎం డిమాండ్ చేసింది.
Next Story

