K.Narayana
x
సీపీఐ కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ కె.నారాయణ

విమానాలు లేకుండా భారీ నిధులు ఎవరి కోసమో చెప్పమ్మా!

కేంద్ర బడ్జెట్‌లో కార్పొరేట్‌లకే పెద్దపీట: సీపీఐ నారాయణ విమర్శ


కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్‌లో కార్పొరేట్ రంగానికి ప్రాధాన్యత పెరిగిందని, కానీ దేశంలోని సాధారణ ప్రజల జీవన పరిస్థితులపై తగిన దృష్టి కనిపించడం లేదని సీపీఐ కంట్రోల్ కమిషన్ ఛైర్మెన్ డాక్టర్ కె. నారాయణ విమర్శించారు.
బడ్జెట్ మొత్తాన్ని గత ఏడాదితో పోలిస్తే సుమారు 2 లక్షల కోట్ల మేర పెంచి రూ.50.65 లక్షల కోట్లుగా చూపించినప్పటికీ, ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకుంటే వాస్తవంగా పెంపు లేదన్న భావన కలుగుతోందని ఆయన పేర్కొన్నారు.
మొత్తం బడ్జెట్‌లో అప్పుల చెల్లింపులకు 12.76 శాతం, రక్షణ రంగానికి 6.81 శాతం కేటాయింపులు జరగడం ద్వారా ప్రజా సంక్షేమ రంగాలకు తక్కువ నిధులు మిగిలాయని ఆయన అన్నారు.
గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ.86 వేల కోట్లు మాత్రమే కేటాయించడం ద్వారా గత స్థాయిలోనే పరిమితం చేసినట్టు కనిపిస్తోందని చెప్పారు. అలాగే విద్యకు 2.5 శాతం, ఆరోగ్యానికి సుమారు 2 శాతం (రూ.99,800 కోట్లు) మాత్రమే కేటాయించడం ఆందోళన కలిగించే అంశమని వ్యాఖ్యానించారు.
వివిధ కమిషన్లు విద్యకు కనీసం 10 శాతం బడ్జెట్ కేటాయించాలని సూచించినప్పటికీ, ఆ దిశగా ఆలోచన లేకపోవడం వల్ల విద్య, ఆరోగ్య రంగాలు ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల ఆధీనంలోకి వెళ్లే పరిస్థితి ఏర్పడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.
భారతదేశం వ్యవసాయంపై ఆధారపడిన దేశమని, పెద్ద సంఖ్యలో ప్రజల జీవనాధారం వ్యవసాయ రంగమేనని గుర్తు చేశారు. అయితే ఈ బడ్జెట్ రూపకల్పనలో సామాజిక స్పృహ, గ్రామీణ ప్రజల అవసరాలపై తగిన దృష్టి కనిపించలేదని విమర్శించారు.
ఇదే సమయంలో రక్షణ రంగ వ్యయం పెరగడం ఎన్నికల రాజకీయ అవసరాలకు ఉపయోగపడేలా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అప్పులు చేసి, వాటి వడ్డీలు చెల్లించడానికే పెద్ద భాగం ఖర్చవుతుండటం వల్ల ప్రజా సంక్షేమానికి బడ్జెట్ పరిమితం అవుతోందని తెలిపారు.
ప్రభుత్వం విమానాశ్రయాల నిర్మాణానికి భారీగా ఖర్చు చేస్తుండగా, ప్రభుత్వ రంగంలో విమాన సేవలు లేకపోవడం వల్ల ప్రజాధనంతో మౌలిక సదుపాయాలు కల్పించి కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చినట్టుగా మారుతోందని ఆయన అన్నారు. విమాన ప్రయాణికులపై అధిక ఛార్జీల భారం తగ్గించడంలో ప్రభుత్వం సమర్థంగా వ్యవహరించడం లేదని విమర్శించారు.
దేశ భవిష్యత్తుకు స్పష్టమైన దిశను చూపని ఈ బడ్జెట్ ప్రజలకు ప్రయోజనం కలిగించేలా లేదని నారాయణ పేర్కొన్నారు.
Read More
Next Story