కాలువలోకి దూసుకెళ్లిన కారు..దంపతుల మృతి
x

కాలువలోకి దూసుకెళ్లిన కారు..దంపతుల మృతి

తూర్పుగోదావరిలో ఈ విషాదం చోటు చేసుకుంది.


తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, నలుగురు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. కాకినాడ నుంచి వెలగతోడు వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది.

నీటిలో మునిగి భార్యాభర్తల దుర్మరణం
మండపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తాపేశ్వరం శివారు పేకేటిపాకలు వద్ద ఈ ప్రమాదం సంభవించింది. కారు నడుపుతున్న బోగిల్లి వీర వెంకట సతీష్ (40), ఆయన భార్య బోగిల్లి కిరణ్మయి (36) కారుతో పాటు కాలువలో పడిపోయారు. కారు ముందు సీట్లలో ఉన్న వీరు, నీటిలో మునిగి ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందారు. వీరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
నలుగురిని కాపాడిన గ్రామస్తులు
కారు కాలువలోకి దూసుకెళ్లిన వెంటనే స్థానిక గ్రామస్తులు అప్రమత్తమయ్యారు. ప్రాణాలకు తెగించి కాలువలోకి దిగి రక్షణ చర్యలు చేపట్టారు. కారు వెనుక సీట్లో ఉన్న వృద్ధ దంపతులతో పాటు ఇద్దరు చిన్నపిల్లలను చాకచక్యంగా బయటకు తీసి ప్రాణాలతో కాపాడారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, క్రేన్ సహాయంతో కాలువలో మునిగిపోయిన కారును బయటకు తీయించారు.
కేసు నమోదు.. దర్యాప్తు
ఈ ఘటనపై మండపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అతి వేగమా లేక డ్రైవర్ నిద్రమత్తులోకి జారడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. క్షేమంగా బయటపడిన వృద్ధులు, పిల్లలు ప్రస్తుతం కోలుకుంటున్నారు.
Read More
Next Story