పోలీసుల చేతిలో సీజే రాయ్ డైరీ..
x

పోలీసుల చేతిలో సీజే రాయ్ డైరీ..

వెలుగులోకి సెలబ్రిటీలు, రాజకీయ నేతల పేర్లు..


Click the Play button to hear this message in audio format

కర్ణాటకలో కాన్ఫిడెంట్ గ్రూప్ చైర్మన్ సీజే రాయ్ మరణంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆయన వ్యక్తిగత డైరీతో పాటు కొన్ని కీలక పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డైరీలో పలువురు ప్రముఖులు, సినీ నటులు, మోడల్స్ , రాజకీయ నేతల పేర్లు ఉన్నట్లు సమాచారం. వ్యాపార కార్యకలాపాల్లో భాగంగా వీరిని ఆహ్వానించి ఉంచారని తెలుస్తోంది. అయితే ఈ పేర్లు ఎందుకు రాశారన్న దానిపై స్పష్టత రాలేదు. ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఈ కేసును విచారిస్తోంది.

శనివారం కాన్ఫిడెంట్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ టి.ఎ. జోసెఫ్ బెంగళూరులోని అశోకనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేశారు. ఆదాయపు పన్ను (ఐటీ) దాడుల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని, అయితే అధికారులపై ప్రత్యక్ష ఆరోపణలు లేవని పోలీసులు తెలిపారు.


ఆ రోజు ఏం జరిగింది?

ఘటన జరిగిన రోజున సీజే రాయ్ తన కార్యాలయానికి వచ్చి ఐటీ అధికారులకు వివరాలు ఇచ్చినట్లు సమాచారం. కొంతసేపు వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పినట్లు తెలుస్తుంది. తరువాత ఆయన తన గదిలోకి వెళ్లి కొంత సమయం ఎవరినీ లోపలికి అనుమతించవద్దని భద్రతా సిబ్బందికి సూచించినట్లు తెలిసింది. తరువాత స్పందన లేకపోవడంతో సిబ్బంది తలుపు తెరిచి చూశారు. అపాస్మారక స్థితిలో కనిపించడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు అప్పటికే చనిపోయాడని నిర్ధారించారు.

కాగా ఐటీ అధికారుల ఒత్తిడి ఆయన మృతికి కారణమై ఉంటుందని రాయ్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోస్ట్‌మార్టం నివేదిక, కార్యాలయ సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది. డైరీలో పేర్లున్న వ్యక్తుల వివరాలు కూడా పోలీసులు సేకరిస్తున్నారు.


మంత్రితో పోలీస్ కమిషనర్ సమావేశం..

ఈ ఘటనపై బెంగళూరు పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్.. కర్ణాటక మంత్రి జి. పరమేశ్వరను కలిశారు. సీజే రాయ్ సోదరుడు బాబు జోసెఫ్ మాట్లాడుతూ.. తన అన్నకు వ్యాపార సమస్యలు లేవని, ఘటనకు ఒక ఐటీ అధికారి కారణమని ఆరోపించారు. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

Read More
Next Story