వంటింట్లో మంట పెట్టిన ట్రంప్: గ్యాస్ ధర పెంపు
x

వంటింట్లో 'మంట' పెట్టిన ట్రంప్: గ్యాస్ ధర పెంపు

అమెరికా తెచ్చిన యుద్ధం భారతీయుల ఇళ్లల్లో మంట పెట్టింది.రాత్రికి రాత్రి చమురు కంపెనీలు గ్యాస్ సిలిండర్ల ధరలు పెంచేశాయి.


ఇరాన్ పై అమెరికా ప్రకటించిన యుద్ధం భారతీయుల ఇళ్లల్లో మంటలు పుట్టించింది. యుద్ధ మేఘాలతో గల్ఫ్ దేశాలు అల్లాడుతుంటే ధరలు పెరిగి భారతీయులు లబోదిబో మంటున్నారు. అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న పోరు ప్రభావం అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌పై పడింది. దీంతో దేశీయ చమురు సంస్థలు గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా పెంచాయి. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా, గుట్టుచప్పుడు కాకుండా అర్ధరాత్రి నుంచి ఈ పెంచిన ధరలను అమలులోకి తీసుకురావడంపై సామాన్య ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ఎంత పెరిగింది?

చమురు సంస్థల తాజా నిర్ణయం ప్రకారం గృహ వినియోగ సిలిండర్ (14.2 కేజీ) ఒక్కో దానిపై రూ. 60 భారం పడింది. హోటళ్లు, రెస్టారెంట్లలో వాడే వాణిజ్య సిలిండర్ (19 కేజీ)పై ఏకంగా రూ.115 పెరిగింది.
విజయవాడలో కూడా గ్యాస్ ధరల పెంపు ప్రభావం గణనీయంగా ఉంది. తాజా సమాచారం ప్రకారం విజయవాడలో పెరిగిన ధరల వివరాలు:
గృహ వినియోగ సిలిండర్ (14.2 కేజీ): రూ. 60 పెరిగింది.
నిన్నటి వరకు విజయవాడలో దీని ధర సుమారు రూ. 877.50 గా ఉండేది.
నేటి నుంచి ఇది రూ. 937.50 కి చేరుకుంది.
వాణిజ్య సిలిండర్ (19 కేజీ): రూ. 115 పెరిగింది.
నిన్నటి వరకు సుమారు రూ. 1,898.50 గా ఉన్న కమర్షియల్ సిలిండర్ ధర, నేటి పెంపుతో రూ. 2,013.50 కి చేరింది.
స్థానిక పన్నులు (Local Taxes), రవాణా ఖర్చుల ఆధారంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు. ఉజ్వల పథకం లబ్ధిదారులకు మాత్రం ఈ ధరల పెంపు వర్తించదు. వారు పాత ధరలకే సిలిండర్ పొందవచ్చు.
ఇక, హైదరాబాద్ లో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర రూ. 965కు చేరుకుంది. ఇప్పటికే నిత్యావసరాల ధరలతో సతమతమవుతున్న సామాన్యుడికి ఈ వంట గ్యాస్ వడ్డన 'గోరుచుట్టుపై రోకలి పోటు'లా మారింది.
యుద్ధమే కారణమా?
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో హార్మూజ్ జలసంధి గుండా జరుగుతున్న చమురు రవాణాకు తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి. ప్రపంచ చమురు సరఫరాలో ఇది కీలక మార్గం కావడంతో, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా ఎగిశాయి. దీనివల్ల దిగుమతి వ్యయం పెరిగిందని, అందుకే ధరలు సవరించక తప్పలేదని చమురు సంస్థలు వాదిస్తున్నాయి.
ప్రభుత్వ భరోసా.. కానీ ఆందోళన!
ధరలు పెరిగిన నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి స్పందిస్తూ.. దేశంలో ఇంధన కొరత లేదని, పౌరులకు గ్యాస్ అందేలా చూడటమే తమ ప్రథమ ప్రాధాన్యతని పేర్కొన్నారు. అయితే, ధరల నియంత్రణపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు, యుద్ధం ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read More
Next Story