
కేరళలో కాంగ్రెస్ vs వామపక్షం: రూ.25 లక్షల ఆరోగ్య బీమాపై రాజకీయ వివాదం
అలాగయిలే ప్రభుత్వ నిధులు ప్రైవేటు ఆసుపత్రులకు, బీమా కంపెనీలకే సరిపోతాయంటున్న LDF నేతలు
కేరళలో తర్వలో అసెంబ్లీ ఎన్నికల జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీలు గెలుపు వ్యూహాలు రచిస్తూనే.. మరోవైపు హామీలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదేకోవలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రకటించిన ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా హామీపై రాష్ట్రంలో పెద్ద చర్చకు దారితీసింది. ఇది ప్రజలకు పెద్ద సంక్షేమ కార్యక్రమమని కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) ప్రచారం చేస్తుండగా, అధికార వామపక్ష ప్రజాస్వామ్య ఫ్రంట్ (LDF) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
పథకానికి ఒమెన్ చాందీ పేరు..
రాహుల్ గాంధీ ప్రకటించిన ఆరోగ్య బీమా పథకానికి మాజీ ముఖ్యమంత్రి ఒమెన్ చాందీ పేరు పెట్టాలని కూడా పార్టీ నిర్ణయించింది. ఈ పథకం వల్ల కేరళలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక భారంలేకుండా నాణ్యమైన వైద్యం అందుతుందని కాంగ్రెస్ నేత రమేష్ చెన్నిత్యాలా పేర్కొన్నారు. వైద్య ఖర్చులకు ఎవరూ కూడా అప్పుల పాలు కాకూడదనే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఈ పథకం కింద ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ చికిత్స పొందవచ్చని చెబుతోంది.
వామపక్షాల తీవ్ర విమర్శలు..
కాంగ్రెస్ ప్రతిపాదనపై సీపీఐ(ఎం) సీనియర్ నాయకుడు, మాజీ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్ స్పందించారు. ఈ పథకం కేరళలో ఉన్న బలమైన ప్రజా ఆరోగ్య వ్యవస్థను బలహీనపరుస్తుందన్నారు. కేరళలో ఎక్కువ చికిత్సలు చాలా తక్కువ ఖర్చుతో ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరుగుతున్నాయని పేర్కొన్నారు. గుండె శస్త్రచికిత్సకు సాధారణంగా రూ.1.5 లక్షల నుంచి రూ.3.5 లక్షల వరకు ఖర్చవుతుంది. క్యాన్సర్ చికిత్సకు రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఖర్చవుతుంది. కార్పొరేట్, లగ్జరీ ఆసుపత్రులను మినహాయిస్తే రాష్ట్రంలో దాదాపు 99 శాతం చికిత్సలు రూ.5 లక్షల లోపే పూర్తవుతాయని ఆయన పేర్కొన్నారు. అందువల్ల రూ.25 లక్షల బీమా కవరేజ్ అనవసర ఖర్చు అని ఆయన అభిప్రాయపడ్డారు. కేవలం ఒక శాతం కేసులకు మాత్రమే అంత పెద్ద కవరేజ్ అవసరమవుతుందని పేర్కొన్నారు.
ప్రభుత్వ నిధులు ప్రైవేటు ఆసుపత్రులకు, బీమా కంపెనీలకే..
ఈ పథకం అమలయితే ప్రభుత్వం భారీ బీమా ప్రీమియం చెల్లించాల్సి వస్తుందని వామపక్షాలు హెచ్చరిస్తున్నాయి. ఫలితంగా ప్రభుత్వ నిధులు ప్రైవేట్ ఆసుపత్రులు, బీమా కంపెనీలకు మళ్లే ప్రమాదం ఉందని వారు అంటున్నారు. కేరళ ఆరోగ్య వ్యవస్థ ఇప్పటివరకు ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలపై ఆధారపడే నమూనాగా నిలిచింది. ఈ నమూనా యునైటెడ్ కింగ్‌డమ్‌లోని నేషనల్ హెల్త్ సర్వీసు విధానంతో పోల్చదగినదిగా నిపుణులు చెబుతుంటారు.
కాంగ్రెస్ ఆరోగ్య కమిషన్ నివేదిక..
కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ఆరోగ్య కమిషన్ ఇటీవల ఒక నివేదికను సమర్పించింది. ఆ నివేదిక ప్రకారం కేరళలో ప్రస్తుతం ఉన్న బీమా వ్యవస్థలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ప్రైవేట్ ఆసుపత్రులు ప్రభుత్వ బీమా పథకాల కింద చికిత్స ఇవ్వడంలో ఆసక్తి చూపడం తగ్గిందని నివేదిక చెబుతోంది.
చికిత్స ఖర్చులకు తక్కువ రీయింబర్స్‌మెంట్, చెల్లింపుల్లో ఆలస్యం, పెరుగుతున్న బకాయిలు.. ఈ పరిస్థితి వల్ల కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు బీమా పథకాల లబ్ధిదారులను తీసుకోవడం కూడా నిలిపివేశాయని కమిషన్ పేర్కొంది.
ప్రస్తుత కేరళ ఆరోగ్య పథకం..
ప్రస్తుతం కేరళలో “కారుణ్య ఆరోగ్య సురక్ష పథతి” అమలులో ఉంది. ఈ పథకం ద్వారా పేద కుటుంబాలకు రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స అందుతుంది. ఇందులో ప్రభుత్వ ఆసుపత్రులు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.
వామపక్ష ప్రభుత్వం ప్రకారం ఇదే సరైన సమతుల్య నమూనా. అంటే ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేస్తూ, అవసరమైనప్పుడు మాత్రమే బీమా సహాయం అందించే విధానం.
నిధులపై ప్రశ్నలు..
రూ.25 లక్షల బీమా కవరేజ్ అమలు చేస్తే ప్రతి సంవత్సరం రూ.10వేల కోట్ల ఖర్చవుతాయని థామస్ ఐజాక్ అంచనా వేస్తున్నారు. ఆ డబ్బును ఎలా సమకూర్చుతారని కూడా ఆయన ప్రశ్నించారు. మొత్తం మీద రాహుల్ గాంధీ ప్రతిపాదనతో కాంగ్రెస్, వామపక్షాల మధ్య ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది.

