
కాంగ్రెస్ పార్టీ సంబరాలు
తెలంగాణ మున్సిపాలిటీలపై ఎగిరిన కాంగ్రెస్ జెండా
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. బీఆర్ఎస్ బాగా వెనకబడిపోయింది. సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ శుక్రవారం సాయంత్రం వరకు కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటుతోంది. మొత్తం 116 మున్సిపాలిటీల్లో ప్రధాన పోరు అధికార కాంగ్రెస్.. ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీల మధ్య నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది.
పురపాలక ఎన్నికల్లో ఇప్పటి వరకు 90కు పైగా మున్సిపాలిటీలు, 4 కార్పొరేషన్లు, 1300కు పైగా వార్డులు, 154కు పైగా డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచినట్టు టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.
బీఆర్ఎస్ 8 మున్సిపాలిటీలను గెలుచుకుంది. ఫార్వార్డ్ బ్లాక్ ఒక మున్సిపాలిటీ గెలిచింది. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ లో సీపీఐ తన సత్తా చాటినట్టు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చెప్పారు.
ఈ గెలుపుపై కాంగ్రెస్ వర్గాలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. గాంధీ భవన్ లో సంబరాలు జరిగాయి.
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజాపాలన ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పారదర్శక పాలన అందిస్తున్న నేపథ్యంలో ప్రజలు విశ్వాసంతో కాంగ్రెస్‌కు ఓటు వేశారని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. సామాన్యుల సంక్షేమం, మహిళా సాధికారత, రైతు సంక్షేమం, యువతకు ఉపాధి అవకాశాల కల్పన వంటి అంశాల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాయని చెప్పారు.
రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో దూసుకుపోయేలా ‘తెలంగాణ రైజింగ్ 2047’ లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందని, ఈ లక్ష్య సాధనకు ప్రజలు మరోసారి ఆశీర్వాదం అందించారని తెలిపారు. ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసినప్పటికీ, ప్రజలు వాటిని నమ్మకుండా అభివృద్ధి, సంక్షేమానికి ఓటు వేశారని అన్నారు.
ఆ మున్సిపాలిటీల్లో ‘హంగ్’!
ఓ పది,11 మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి మెజారిటీ రాని పరిస్థితి నెలకొన్నట్టు తెలుస్తోంది.
Next Story

