ఐదుగురు ఎమ్మెల్యేలపై చర్యలకు సిద్ధమైన కాంగ్రెస్
x

ఐదుగురు ఎమ్మెల్యేలపై చర్యలకు సిద్ధమైన కాంగ్రెస్

రాజ్యసభ ఎన్నికలలో బీజేపీ బలపరిచిన స్వతంత్య్ర అభ్యర్థికి ఓటు వేసినట్లు ఆరోపణలు


రాజ్యసభ ఎన్నికలలో కాంగ్రెస్ తరఫున ఎన్నికైన ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి ఓటు వేశారనే ఆరోపణలపై హర్యానా కాంగ్రెస్ చర్యలకు సిద్ధమైంది. క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన వారిపై కాంగ్రెస్ క్రమశిక్షణా చర్యల కమిటీ (డీఏసీ) ఒక నివేదికను సిద్ధం చేసి, తన నిర్ణయాన్ని పార్టీ హైకమాండ్‌కు తెలియజేయనుంది. పార్టీ నాయకుడు ధరంపాల్ మాలిక్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీ, శుక్రవారం సాయంత్రం ఇక్కడి హర్యానా కాంగ్రెస్ కార్యాలయంలో సమావేశమైంది.

బీజేపీ మద్దతు ఉన్న స్వతంత్ర అభ్యర్థి సతీష్ నందల్‌కు అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేశారన్న ఆరోపణలపై ఆ ఐదుగురు ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ షో-కాజ్ నోటీసు జారీ చేసింది.
"కాంగ్రెస్ అధికారిక అభ్యర్థికి అనుకూలంగా ఉద్దేశపూర్వకంగా ఓటు వేయకుండా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు" ఈ నోటీసు జారీ చేశారు. హర్యానాలోని రెండు రాజ్యసభ స్థానాలకు మార్చి 16న పోలింగ్ జరిగింది.
బీజేపీకి చెందిన సంజయ్ భాటియా ఒక స్థానాన్ని గెలుచుకోగా, స్వతంత్ర అభ్యర్థి సతీష్ నందల్‌ రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. కాంగ్రెస్ నిలబెట్టిన కరమ్ వీర్ సింగ్ భౌద్ ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ ఒక సీటును సునాయాసయంగా గెలిచే అవకాశం ఉన్నప్పటికీ క్రాస్ ఓటింగ్ తో వారికి ఓటమి తప్పలేదు.
ఓట్ల లెక్కింపు సమయంలో మరో నాలుగు ఓట్లు కూడా చెల్లకుండా పోయాయి. పార్టీ ఆదేశాలను ధిక్కరించినందుకు నారైన్‌గఢ్ ఎమ్మెల్యే షల్లి చౌదరి, సధౌరా ఎమ్మెల్యే రేణు బాల, పున్హానా ఎమ్మెల్యే మహమ్మద్ ఇలియాస్, హథిన్ ఎమ్మెల్యే మహమ్మద్ ఇస్రాయిల్, రతియా శాసనసభ్యుడు జర్నైల్ సింగ్ లకు పార్టీ నోటీస్ లు పంపింది.
అయితే తాము పార్టీ సూచించిన అభ్యర్థులకే ఓటు వేశామని చౌదరి, బాల సింగ్ ఆ తర్వాత ఆ ఆరోపణలను ఖండించారు. షోకాజ్ నోటీసుకు చౌదరి, బాల, జర్నైల్ సింగ్ మాత్రమే స్పందించారని సమావేశం అనంతరం డీఏసీ ఛైర్మన్ మాలిక్ మీడియాతో అన్నారు. శుక్రవారం తమకు వ్యక్తిగత విచారణ అవకాశం ఇవ్వాలని చౌదరి, బాల డీఏసీని కోరారని ఆయన చెప్పారు.
"వారు వచ్చారు, వారు చెప్పేది మేము విన్నాము," అని ఆయన అన్నారు. "డీఏసీ తన నివేదికను ఖరారు చేసి, ఆ నిర్ణయాన్ని పార్టీ హైకమాండ్‌కు తెలియజేస్తుంది. వారు తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తారు," అని ఆయన తెలిపారు.
నోటీసుకు సమాధానం ఇవ్వని మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేల గురించి మాలిక్ మాట్లాడుతూ, "అంటే వారు తమపై ఉన్న ఆరోపణలను అంగీకరించినట్లే," అని అన్నారు.
ఇటీవల, హర్యానా రాజ్యసభ ఎన్నికలలో క్రాస్-ఓటింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు పార్టీ శాసనసభ్యులు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకుడు భూపిందర్ సింగ్ హూడా అన్నారు. ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ కంటే ఎక్కువగా, తమను ఎన్నుకున్న ప్రజలకు ద్రోహం చేశారని మాజీ ముఖ్యమంత్రి అన్నారు.
Read More
Next Story