
దేశవ్యాప్తంగా వాణిజ్య సిలిండర్ల కొరత..
హోటళ్లు, రెస్టారెంట్లపై తీవ్ర ప్రభావం
ఇరాన్, ఇజ్రాయిల్-అమెరికా మధ్య జరుగుతోన్న యుద్ధం వంట గ్యాస్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో చెన్నై, బెంగళూరు, ముంబై, కోల్‌కతా వంటి ప్రధాన నగరాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు తమ కార్యకలాపాలను తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేశవ్యాప్తంగా 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ల కొరత తీవ్రమవుతోంది.
చెన్నైలో మెనూల కోత..
గ్యాస్ కొరత కారణంగా చెన్నైలో అనేక హోటళ్లలో వంటకాల సంఖ్య తగ్గించారు. ఒకప్పుడు చాలా రకాల వంటకాలతో తయారుచేసే హోటళ్లు ఇప్పుడు పరిమిత సంఖ్యలో తయారుచేస్తున్నాయి. ఉదయం 6 గంటలకు తెరుచుకునే హోటళ్లు ఇప్పుడు 7 గంటలకు ప్రారంభమవుతున్నాయి. ఇడ్లీ, పూరికి మూడు రకాల కుర్మాలు, రెండు రకాల సాంబార్‌లు ఇచ్చే హోటళ్లు ఇప్పుడు ఒక రకంతోనే సరిపెడుతున్నాయి. కోయంబత్తూరులోని 50 ఏళ్ల చరిత్ర కలిగిన అన్నపూర్ణ హోటల్ మెనూను తగ్గిస్తున్నట్లు ప్రకటిచింది.
బెంగళూరులో మూసివేత దిశగా హోటళ్లు..
కర్ణాటకలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. బెంగళూరులో వాణిజ్య సిలిండర్ల సరఫరా అకస్మాత్తుగా నిలిచిపోవడంతో ఇక హోటళ్లను మూసివేయాల్సి వస్తుందని బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. గ్యాస్ సరఫరా నిలిపివేతకు హోటల్ పరిశ్రమకు భారీ దెబ్బగా పడుతుందని అసోసియేషన్ పేర్కొంది. తక్షణం కేంద్రం జోక్యం చేసుకుని సరఫరాను పునరుద్ధరించాలని కోరింది.
ముంబై, ఇతర నగరాల్లో కూడా ప్రభావం..
ముంబై, పూణే, ఔరంగాబాద్, నాగ్‌పూర్ లాంటి నగరాల్లో కూడా వాణిజ్య సిలిండర్ల కొరత పెరుగుతోందని హోటల్ రంగ ప్రతినిధులు తెలిపారు. పరిస్థితి మరో రెండు రోజులు ఇలాగే కొనసాగితే ముంబైలో సగం హోటళ్లు తాత్కాలికంగా మూసివేయాల్సి రావచ్చని హెచ్చరిస్తున్నారు.
కోల్‌కతాలో తినుబండారాలపై ప్రభావం..
కోల్‌కతాలో నిర్వహించిన సర్వేలో, దాదాపు 40 శాతం తినుబండారాల తయారీదారులు తయారీని తగ్గించినట్లు వెల్లడైంది. మరో 30–40 శాతం రెస్టారెంట్ల వద్ద కొద్దిరోజుల గ్యాస్ నిల్వ మాత్రమే మిగిలి ఉందని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది.
తెలంగాణలో సాధారణంగా సరఫరా..
ఇదిలా ఉండగా తెలంగాణలో మాత్రం గృహ, వాణిజ్య LPG సరఫరా సాధారణంగానే కొనసాగుతోందని అధికారులు తెలిపారు. రోజుకు సుమారు 2.3 లక్షల సిలిండర్లు సరఫరా చేస్తున్నామని, ప్రజలు భయపడవద్దని హెచ్చరించారు.
తమిళనాడులో అత్యవసర సమావేశం..
ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి M. K. Stalin అత్యవసర సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో గ్యాస్ కొరత ప్రభావాన్ని సమీక్షించి, కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక గృహ వినియోగ సిలిండర్ల సరఫరాకు ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. విద్యార్థుల హాస్టళ్లలో భోజన సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగనీయబోమని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
వీలైనంత త్వరగా గ్యాస్ సరఫరాకు సాధారణ స్థితికి తీసుకురాకపోతే దేశవ్యాప్తంగా హోటల్ పరిశ్రమకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

