
ఇచ్చాపురం- నెల్లూరు మధ్య రాబోయే కాలంలో నడవనున్న స్పీడ్ రైళ్ల ఊహా చిత్రం
ఇచ్చాపురం-నెల్లూరు రైల్వే ప్రాజెక్ట్ వస్తే ఉత్తరాంధ్ర పంట పండినట్టే..
ఈ 4 వే రైల్వే లైను ఎట్నుంచి నుంచి ఎటువైపు వెళ్లుందంటే..
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బాటలు వేసే మరో ప్రాజెక్టు దూసుకొస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఏపీ రవాణా భవిష్యత్తును సరి కొత్త దిశగా నడిపించే మరో ప్రణాళిక ఇది. ఇచ్చాపురం నుంచి నెల్లూరు వరకూ నాలుగు లైన్ల (ఫోర్ లైన్) రైల్వే మార్గం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై ప్రభుత్వం ఆశావహంతో ముందుకెళ్తోంది. ఈ మార్గంలో స్పీడ్ ట్రైన్ ప్రాజెక్టు కూడా భవిష్యత్తులో సాకారం కానుందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీస్తున్నాయి.
అసలేమిటీ ఫోర్ లైన్ రైల్వే?
రోడ్ల మాదిరిగా రైల్వేల్లో ‘ఫోర్ లేన్’ అన్న పదం అధికారికంగా ఉపయోగంలో లేకపోయినా, దీని అర్థం నాలుగు రైల్వే ట్రాక్‌ల ఏర్పాటు (Quadrupling of tracks). సాధారణంగా రెండు ట్రాక్‌లున్న మార్గంలో రైళ్ల రద్దీ పెరిగినప్పుడు, ప్యాసింజర్, గూడ్స్ రవాణాను వేరు చేయడానికి అదనపు ట్రాక్‌లు వేస్తారు. దీంతో వేగం పెరగడమే కాకుండా, ఆలస్యాలు తగ్గుతాయి.
ఇచ్చాపురం–నెల్లూరు మార్గం హౌరా–చెన్నై ప్రధాన రైల్వే కారిడార్‌లో భాగం. దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే ఈ మార్గంలో ప్రస్తుతం డబుల్ లైన్, కొన్ని ప్రాంతాల్లో ట్రిపుల్ లైన్ స్థాయిలోనే రవాణా సాగుతోంది. రానున్న దశలో నాలుగు ట్రాక్‌లతో ఈ కారిడార్‌ను అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా చెబుతున్నారు.
స్పీడ్ ట్రైన్ అంటే ఏమిటి?
ఇక్కడ ప్రస్తావిస్తున్న స్పీడ్ ట్రైన్ అనేది బుల్లెట్ ట్రైన్ కాదు. 160 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో నడిచే సెమీ హైస్పీడ్ రైళ్లకు అనుకూలంగా మార్గాన్ని అభివృద్ధి చేయడం అనే అర్థంలో ఈ పదాన్ని వాడుతున్నారు. ఇప్పటికే వందే భారత్ వంటి రైళ్లు ఈ వేగానికి దగ్గరగా నడుస్తున్నాయి. ట్రాక్ సామర్థ్యం పెరిగితే, ఇలాంటి రైళ్లు మరింత వేగంగా, సురక్షితంగా నడిచే అవకాశం ఉంటుంది.
ఏపీకి ఇది ఎందుకు కీలకం?
-ఇచ్చాపురం నుంచి నెల్లూరు వరకు రైల్వే మార్గం బలోపేతం కావడం అంటే కేవలం ప్రయాణ సౌకర్యమే కాదు.
-విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం వంటి పోర్టుల నుంచి సరుకు రవాణా వేగవంతం అవుతుంది.
-లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గుతాయి.
-రైల్వే కారిడార్ వెంట పరిశ్రమలు, గిడ్డంగులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పడతాయి. దీంతో “దారి మధ్యలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం”- “రవాణా–లాజిస్టిక్స్ హబ్”గా మారతాయని పాలక వర్గాలు భావిస్తున్నాయి.
పనులు ఎప్పుడెప్పుడు?
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రతిపాదించిన 2026-27 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌లో రైల్వే కీలక ప్రాజెక్టుల కోసం రూ.10,134 కోట్లు కేటాయించినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. అందులో ఈ ప్రాజెక్ట్ కూడా ఉంది. ప్రత్యేకంగా చెన్నై-హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ పై సమగ్ర నివేదికలు త్వరలో ప్రకటిస్తామని Railway Minister పేర్కొన్నారు.
ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు ప్రతిపాదిత దశలోనే ఉంది. పూర్తి స్థాయి ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్), కేంద్ర క్యాబినెట్ ఆమోదం, బడ్జెట్ కేటాయింపులు ఇంకా రావాల్సి ఉంది. అంటే ఇది తక్షణం మొదలయ్యేది కాదు. కానీ కేంద్రంతో చర్చల్లో ఉన్న దీర్ఘకాలిక మౌలిక వసతుల ప్రణాళికగా దీనిని చూడాల్సి ఉంటుంది. సాధారణంగా ఇలాంటి పెద్ద రైల్వే ప్రాజెక్టులు సర్వే నుంచి పూర్తి కావడానికి 3 నుంచి 5 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ సమయం పడుతుంది.
రాజకీయ కోణం ఏమిటీ..
ఈ ప్రకటనను రాజకీయంగా చూస్తే, ఆంధ్రప్రదేశ్‌కు అవసరమైన మౌలిక వసతులపై కేంద్రం దృష్టిని ఆకర్షించే ప్రయత్నంగా విశ్లేషకులు భావిస్తున్నారు. అమరావతి, పోర్టులు, రహదారులు, రైల్వేలు అన్నింటినీ కలిపి రాష్ట్ర అభివృద్ధికి ఒక విజన్ చూపించడమే లక్ష్యంగా ఈ ప్రకటనలున్నాయని చెబుతున్నారు.
ఇచ్చాపురం నుంచి నెల్లూరు వరకూ నాలుగు లైన్ల రైల్వే మార్గం అనేది ఇప్పటికైతే ప్రణాళిక దశలో ఉన్నా, ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు కీలక సంకేతంగా చెప్పవచ్చు. ఈ మార్గం సాకారమైతే ఉత్తరాంధ్ర ముఖచిత్రం మారడమే కాకుండా రాష్ట్ర రవాణా ఆర్థిక కార్యకలాపాలకు కూడా కొత్త ఊపొస్తుందని అంచనా వేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
Next Story

