సీఎం కాన్వాయ్ డ్రైవర్‌కు ’ఉత్తమ సేవా పతకం‘
x

సీఎం కాన్వాయ్ డ్రైవర్‌కు ’ఉత్తమ సేవా పతకం‘

ఏపీ పోలీసులకు అవార్డుల పంట. రాష్ట్రవ్యాప్తంగా 960 మందికి కేంద్ర పతకాలు


ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వాహన శ్రేణిలో (కాన్వాయ్) డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న ఏఆర్‌ ఎస్సై ఏవీఎస్‌ గిరిబాబుకు రాష్ట్ర ప్రభుత్వం ’ఉత్తమ సేవా పతకం‘ ప్రకటించింది. 1990లో ఏఆర్‌ కానిస్టేబుల్‌గా ప్రస్థానాన్ని ప్రారంభించిన గిరిబాబు, గత 15 ఏళ్లుగా ముఖ్యమంత్రి వాహన శ్రేణిలోనే అత్యంత అప్రమత్తంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. విధి నిర్వహణలో ఆయన చూపిన అంకితభావానికి గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది.

సీఎం సీఎస్‌వోకు మహోన్నత సేవా పతకం
ముఖ్యమంత్రికి నీడలా ఉంటూ రక్షణ కల్పించే భద్రతా విభాగం అధికారులకు కూడా ఈసారి ప్రత్యేక గుర్తింపు లభించింది. సీఎం ముఖ్య భద్రతాధికారి (CSO), స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ డిప్యూటీ డైరెక్టర్ అయిన డీఎస్పీ కె.మధుసూదన్‌కు ’మహోన్నత సేవా పతకం‘ లభించింది. 1996లో ఎస్సైగా చేరిన ఆయన, 2019 నుంచి చంద్రబాబు గారి వద్ద సీఎస్‌వోగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 960 మందికి కేంద్ర పతకాలు
కేంద్ర హోంశాఖ ప్రకటించిన సేవా పతకాల జాబితాలో ఏపీ పోలీసులు సత్తా చాటారు. ఐపీఎస్ అధికారుల నుంచి కానిస్టేబుల్ స్థాయి వరకు మొత్తం 353 మందికి ’అతి ఉత్కృష్ట సేవా పతకాలు‘, 607 మందికి ’ఉత్కృష్ట సేవా పతకాలు‘ లభించాయి. డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా ఈ పతకాల జాబితాను విడుదల చేశారు. ఐపీఎస్ అధికారుల్లో మహేష్‌ చంద్ర లడ్డా, జీవీజీ అశోక్‌కుమార్‌ సహా ఆరుగురికి అతి ఉత్కృష్ట పతకాలు, ఆకే రవికృష్ణ, ఆర్‌.జయలక్ష్మి సహా పది మందికి ఉత్కృష్ట సేవా పతకాలు దక్కాయి.
ఉగాది కానుకగా రాష్ట్ర ప్రభుత్వ పతకాలు
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ వివిధ విభాగాల్లోని అధికారులకు రాష్ట్ర ప్రభుత్వ పతకాలను ప్రకటించారు. పోలీసు విభాగం నుంచి 38 మందికి సీఎం శౌర్యపతకాలు, 72 మందికి ఉత్తమ సేవా పతకాలు. అగ్నిమాపక, విజిలెన్స్ విభాగం నుంచి అగ్నిమాపక శాఖలో 56 మందికి, విజిలెన్స్‌లో 27 మందికి, ఎస్‌పీఎఫ్‌ విభాగంలో 32 మందికి పతకాలు లభించాయి.
Read More
Next Story