పార్లమెంటులో చర్చ- వైఎస్ జగన్ ఊసరవెల్లి: సీఎం రమేశ్
x
అమరావతి రాజధాని ప్రాంతం మ్యాప్

పార్లమెంటులో చర్చ- వైఎస్ జగన్ ఊసరవెల్లి: సీఎం రమేశ్

రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును లోక్‌సభ చర్చిస్తోంది..


ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే ‘ఏపీ పునర్విభజన (సవరణ) బిల్లు-2026’ కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో నేడు లోక్‌సభ ముందుకు వచ్చింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును ప్రవేశపెట్టగా, సభలో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది.
జగన్ ఒక ‘ఊసరవెల్లి’: సీఎం రమేశ్ విమర్శల పర్వం
బీజేపీ ఎంపీ (అనకాపల్లి) సీఎం రమేశ్ చర్చలో పాల్గొంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై నిప్పులు చెరిగారు. జగన్‌ను 'మాజీ ముఖ్యమంత్రి' అని పిలవడానికి కూడా నిరాకరించిన ఆయన, 'పులివెందుల ఎమ్మెల్యే' అంటూ సంబోధించారు. "రాజధాని విషయంలో రంగులు మార్చే ఊసరవెల్లి జగన్ ఆటలు కట్టడి చేయడానికే అసెంబ్లీలో ఈ తీర్మానం చేశాం. ఆయన మార్చలేనంత పటిష్టంగా అమరావతికి కేంద్రం చట్టబద్ధత కల్పించాలి" అని డిమాండ్ చేశారు.
సభలో గందరగోళం: జగన్ పేరును ప్రస్తావించగానే వైసీపీ ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్పీకర్ పోడియం వద్దకు వెళ్లడంతో సభలో కాసేపు గందరగోళం నెలకొంది.
బిల్లుకు కాంగ్రెస్ మద్దతు - హోదా డిమాండ్
అనూహ్యంగా ఈ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది. కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాకూర్ చర్చలో పాల్గొంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి కేవలం ఒక నగరం కాదు, కోట్లాది మంది ఆంధ్రుల ఆకాంక్ష అని ఆయన అభివర్ణించారు. రాజధానికి మద్దతు ఇస్తూనే, విభజన చట్టంలోని ప్రత్యేక హోదా వంటి ఇతర హామీలను కూడా కేంద్రం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అమరావతి నిర్మాణానికి కేంద్రం పూర్తి ఆర్థిక సహకారం అందించాలని కోరారు.
చారిత్రక సవరణ - సెక్షన్ 5(2)
స్పీకర్ ఓం బిర్లా అనుమతితో ప్రారంభమైన ఈ చర్చలో, విభజన చట్టంలోని సెక్షన్ 5(2) సవరణ ద్వారా అమరావతికి శాశ్వత హోదా కల్పించే అంశంపై సభ్యులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ బిల్లు ఆమోదం పొందితే, భవిష్యత్తులో రాజధాని మార్పు అనేది ఏ ప్రభుత్వానికైనా అసాధ్యంగా మారుతుంది.
Read More
Next Story