ఇరాన్ యుద్ధ సెగ తగలకుండా ’చంద్రన్న‘ ప్లాన్
x

ఇరాన్ యుద్ధ సెగ తగలకుండా ’చంద్రన్న‘ ప్లాన్

ఎల్పీజీ నిల్వలు, నిత్యావసర సరుకులపై సీఎం సమీక్ష.


అంతర్జాతీయంగా ఇరాన్ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న నేపథ్యంలో, రాష్ట్రంలో నిత్యావసరాలు, ముఖ్యంగా ఎల్పీజీ (LPG) సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్రమత్తమయ్యారు. గురువారం కొనసాగుతున్న రెండో రోజు 6వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో గ్యాస్ నిల్వలు, ధరలు, మార్కెట్ పరిస్థితులపై అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు.

యుద్ధ ప్రభావం పడొద్దు.. మంత్రుల కమిటీ రంగంలోకి

యుద్ధం కారణంగా ఎల్పీజీ , ఇతర ఉద్యాన ఉత్పత్తుల మార్కెట్‌లో తలెత్తే ఒడిదుడుకులను ఎప్పటికప్పుడు అంచనా వేయడానికి ముగ్గురు మంత్రులతో కూడిన హైపవర్ కమిటీని సీఎం నియమించారు. మంత్రులు నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్ ఈ కమిటీలో బాధ్యతలు నిర్వహిస్తారు. ఆర్టీజీఎస్ (RTGS) కేంద్రం ద్వారా గ్యాస్ సరఫరాను ప్రతి నిమిషం మానిటర్ చేయాలని, ఏ చిన్న ఇబ్బంది తలెత్తినా వెంటనే నివేదించాలని అధికారులను ఆదేశించారు.

పాఠశాలలు, ఆస్పత్రులకు గ్యాస్ కష్టాలు రావొద్దు

సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తూ.. పాఠశాలలు (మధ్యాహ్న భోజనం), ఆస్పత్రులకు ఎల్పీజీ సరఫరాలో ఒక్క రోజు కూడా అంతరాయం కలగకూడదు. ప్రస్తుతం రాష్ట్రంలో నిల్వలు సరిపడా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపి, అదనపు కోటా కోసం ప్రయత్నించాలి అని సూచించారు. ముఖ్యంగా, కొరత పేరుతో సిలిండర్లు బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా నిఘా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని సీఎం గట్టిగా ఆదేశించారు.

సీమ అరటి, కోడిగుడ్లకు ప్రత్యామ్నాయ మార్కెట్

యుద్ధ ప్రభావంతో ఎగుమతులకు ఆటంకం కలిగితే.. రాష్ట్రంలోని ఉద్యాన రైతులు నష్టపోకూడదని సీఎం పేర్కొన్నారు. గుడ్లు, అరటి వంటి ఉత్పత్తులకు ఇతర రాష్ట్రాల్లో లేదా స్థానికంగా ప్రత్యామ్నాయ మార్కెట్లను వెతకాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. ధరల పతనాన్ని అరికట్టి రైతులకు అండగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రస్తుత గ్యాస్ నిల్వలపై పౌరసరఫరాల శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ వివరణ ఇస్తూ.. రాష్ట్రంలో ఎక్కడా కొరత లేదని భరోసా ఇచ్చారు.

మొత్తం కనెక్షన్లు: 1.61 కోట్ల డొమెస్టిక్, 10 లక్షల కమర్షియల్ కనెక్షన్లు.

రోజువారీ డిమాండ్: 4 వేల మెట్రిక్ టన్నులు.

ప్రస్తుత నిల్వలు: హెచ్‌పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్ కంపెనీల వద్ద 21,505 మెట్రిక్ టన్నుల గ్యాస్ సిద్ధంగా ఉందని సీఎంకు వివరించారు.

Read More
Next Story