
‘న్యాయవ్యవస్థలో మార్పు, నేర్చుకోవడం ముఖ్యం’
సీజేఐ సూర్యకాంత్
న్యాయవ్యవస్థలో వినయం అవసరమని భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ పేర్కొన్నారు. న్యాయమూర్తులు తాము పరిపూర్ణులమనే భావనను ప్రదర్శించడం వ్యవస్థకు హానికరమన్నారు. కామన్వెల్త్ జ్యుడీషియల్ ఎడ్యుకేటర్స్ (CJE) 11వ ద్వైవార్షిక సమావేశ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. న్యాయమూర్తుల పాత్ర పూర్వనిర్ణయాలపై పట్టు మాత్రమే కాకుండా, సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా చట్టాన్ని అర్థం చేసుకునే చురుకుదనం కూడా అవసరమని సీజేఐ స్పష్టం చేశారు. న్యాయ నాయకత్వాన్ని ప్రజలు ఎలా గ్రహిస్తారన్న దానిలో మార్పు రావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
“వినయం వ్యక్తిగత గుణం మాత్రమే కాదు; అది వృత్తిపరమైన రక్షణ కూడా. ప్రతి న్యాయాధికారికి ఇది తప్పనిసరిగా బోధించాల్సిన సాధనం” అని సూర్యకాంత్ అన్నారు.
కామన్వెల్త్ దేశాల్లో న్యాయ విద్య, బార్, బెంచ్‌లను అనుసంధానించే “కామన్వెల్త్ అపెక్స్ బాడీ” అవసరమని ఆయన సూచించారు. చట్టం సజీవ వ్యవస్థగా మారుతూ ఉంటుందని, సమాజ మార్పులకు అనుగుణంగా న్యాయమూర్తుల అవగాహనను పెంచుకోవాలని సీజేఐ సూచించారు.

