
చెన్నై ట్రిపుల్ మర్డర్: డీఎంకే ప్రభుత్వంపై అన్నాడీఎంకే ఫైర్..
కుటుంబం హత్యతో చెన్నైని "మర్డర్ సిటీ"గా అభివర్ణించిదెవరు?
బీహార్(Bihar)కు చెందిన యువ జంటతో పాటు వారి రెండేళ్ల కొడుకును చెన్నై(Chennai)లో అతి దారుణంగా హత్య(Murder) చేశారు. సోమవారం (జనవరి 26) అడయార్‌లోని ఇందిరా నగర్ 1వ అవెన్యూలోని ద్విచక్ర వాహన షోరూమ్ సమీపంలో గోనెసంచిలో కట్టి పడేసిన ఓ మృతదేహాన్ని స్థానికులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఘటన స్థలానికి చేరుకుని శవాన్ని పరిశీలించారు. మృతుడికి 24 ఏళ్ల వయసు ఉండవచ్చని భావిస్తున్నారు. మోటార్ సైకిల్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆ గోనెసంచిని పడవేస్తున్నట్లు CCTV ఫుటేజ్ ద్వారా తెలుసుకున్నారు. వారికోసం గాలించి చివరకు ఐదుగురుని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో నలుగురిని బీహార్‌కు చెందిన సికందర్, నరేంద్రకుమార్, రవీంద్రనాథ్ ఠాకూర్, వికాస్‌గా గుర్తించారు. ప్రస్తుతం రహస్య ప్రదేశంలో వారిని విచారిస్తున్నారు.
నిందితులు చెప్పిన వివరాల ఆధారంగా మృతుడి భార్య, వారి కొడుకు కోసం అన్వేషిస్తున్నారు. మృతుడు ఒక ప్రైవేట్ సంస్థలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నట్లు సమాచారం. ఇటీవల పొట్టకూటి కోసం చెన్నైకి వచ్చినట్లు తెలుస్తోంది. మహిళపై హత్యకు ముందు లైంగిక దాడి జరిగిందా? అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది. ఆమె మృతదేహం కోసం అడయార్ నది ఒడ్డున, తారామణి డంపింగ్ యార్డ్ ప్రాంతాలలో గాలిస్తున్నారు. చివరకు కొడుకు మృతదేహాన్ని మంగళవారం మధ్యాహ్నం సెంట్రల్ కైలాష్ ప్రాంతంలోని కాలువలో కనుగొన్నారు.
‘‘మర్డర్ సిటీ చెన్నై’’
ఈ హత్యలపై అధికార డీఎంకే(DMK) ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ(BJP) ముఖ్య ప్రతినిధి నారాయణన్ తిరుపతి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చెన్నై పోలీసులు నేరాలను అరికట్టలేకపోతున్నారని ఆరోపించారు. రానురాను చెన్నై "మర్డర్ సిటీ"గా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. "తమిళనాడును 'శాంతివనం' అని గొప్పలు చెప్పుకునే రోజులు పోయాయి. ప్రస్తుతం హింసాత్మక అడవిగా మారుతోంది. ఇది సిగ్గుచేటు" అని తిరుపతి అన్నారు.
‘భద్రతేది’..
ఈ హత్యలు"క్రూరత్వానికిపరాకాష్ట" అని పేర్కొన్నారు అన్నాడీఎంకే(AIADMK) ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి. "మద్యం తాగి వచ్చిన ముఠా భార్యపై అత్యాచారం చేసి, హత్య చేశారు. భార్యను రక్షించేందుకు వచ్చిన భర్తను కడతేర్చారు. ఆపై వారి రెండేళ్ల బిడ్డను నేలకేసి కొట్టి చంపారు. ఇది చాలా దారుణం’’ అని పళనిస్వామి ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు.
తిరుత్తణిలో మహారాష్ట్ర యువకుడిపై దారుణంగా దాడి చేసిన కొన్ని రోజులకే, ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన యువకుడి కుటుంబం మొత్తం తమిళనాడులో తుడిచిపెట్టుకుపోయింది. "తమిళనాడు 'సందర్శకులను స్వాగతించి, పోషిస్తుంది' అని డీఎంకే చెప్పుకుంటుంది. కాని రాష్ట్రంలో కొరవడిన శాంతిభద్రతలు వాటి మాటలు అపహాస్యం చేస్తున్నాయి’ అని పేర్కొన్నారు.

