
వైసీపీ 'క్రెడిట్ వార్'కు చెక్ పెట్టండి..మంత్రులకు బాబు మాస్టర్ ప్లాన్
రూ. 19,391 కోట్ల పెట్టుబడులకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
పాలనలో వేగం పెంచడమే కాదు.. ప్రత్యర్థుల విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పడంలోనూ పదును పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కేబినెట్ సహచరులకు స్పష్టమైన సంకేతాలిచ్చారు. గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వ నిర్ణయాల కంటే రాజకీయ వ్యూహాలే హైలైట్‌గా నిలిచాయి. 'వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాలను కేవలం ఖండించడమే కాదు.. వాస్తవాలతో వారి నోళ్లు మూయించాలి' అని సీఎం మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా భోగాపురం ఎయిర్‌పోర్ట్, పోలవరం వంటి కీలక ప్రాజెక్టుల విషయంలో జరుగుతున్న క్రెడిట్ వార్‌పై మంత్రులు అగ్రెసివ్‌గా స్పందించాలని, ప్రభుత్వ విజయాలను ప్రతి గడపకూ చేరవేయాలని ఆయన పిలుపునిచ్చారు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. దాదాపు 35కు పైగా అంశాలపై చర్చించిన కేబినెట్, ప్రజలకు ఆర్థిక ఊరటనిచ్చేలా విద్యుత్ చార్జీల విషయంలో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన రూ. 4,490 కోట్ల విద్యుత్ ట్రూ-అప్ చార్జీల భారాన్ని సామాన్య ప్రజలపై వేయకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని కేబినెట్ స్పష్టం చేసింది. అంతేకాకుండా, యూనిట్ విద్యుత్ ధరను రూ. 5.19 నుంచి రూ. 4.90కి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మరియు 'తల్లికి వందనం' పథకాల అమలు తీరుపై కేబినెట్ సంతృప్తి వ్యక్తం చేసింది. సంక్రాంతి కానుకగా పేదలకు ప్రత్యేక రేషన్ కిట్‌లను పంపిణీ చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమల స్థాపనకు 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'లో భాగంగా సింగిల్ విండో విధానాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. విశాఖపట్నంలో త్వరలో జరగబోయే గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ (GIS) ఏర్పాట్లపై చర్చించారు. రాష్ట్రంలో విద్వేషపూరిత పోస్టులు, సోషల్ మీడియా వేధింపుల అదుపునకు సైబర్ క్రైమ్ విభాగంలో అదనపు సిబ్బంది నియామకానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో జల రవాణా బలోపేతానికి 'ఏపీ లాజిస్టిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్' ఏర్పాటుకు, MSME క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ద్వారా 7,500 మందికి ఉపాధి కల్పనకు, ఎక్సైజ్ ట్యాక్స్ సవరణలు, మైక్రో బ్రూవరీల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేసింది.

