సెల్లార్ల ఆక్రమణలకు ఆపరేషన్ లంగ్స్‌ 3.0తో చెక్‌!?
x
ఆపరేషన్‌ లంగ్స్‌ 3.0లో సెల్లార్‌ ఆక్రమణను తొలగిస్తున్న టౌన్‌ప్లానింగ్‌ సిబ్బంది

సెల్లార్ల ఆక్రమణలకు ఆపరేషన్ లంగ్స్‌ 3.0తో చెక్‌!?

విశాఖలో ఏళ్ల తరబడి సెల్లార్లను ఆక్రమించి వ్యాపారాలు సాగిస్తున్న వారికి జీవీఎంసీ చెక్‌ పెట్టింది. తొలగింపునకు శ్రీకారం చుట్టింది. ట్రఫిక్ సమస్యకు చెక్ పడింది.

జీవీఎంసీ అధికారులు విశాఖ నగరవాసులు మెచ్చే ఓ మంచి పనికి నడుం బిగించారు. నగరంలో ట్రాఫిక్‌ పద్మవ్యూహం నుంచి ఒకింత ఉపశమనం కల్పించే చర్యకు ఎట్టకేలకు శ్రీకారం చుట్టారు. ప్రధానంగా వాణిజ్య సముదాయాల సెల్లార్లలో ఆక్రమణలను తొలగిస్తున్నారు. దాని పేరే ఆపరేషన్‌ లంగ్స్‌ 3.0.

ఫుట్‌ఫాత్‌లు, రోడ్ల పక్కనే పార్కింగ్‌..

విశాఖ నగరంలో ట్రాఫిక్‌ రద్దీ రోజురోజుకూ పెరిగిపోతోంది. ప్రధాన రోడ్లపైనే కాదు.. సందుల్లోనూ వాహనాల రాకపోకలకు ఇబ్బంది తలెత్తుతోంది. నగరంలోని నివాస ప్రాంతాల్లో కొన్ని చోట్ల మినహా వాణిజ్య, వ్యాపార సముదాయాలు, జంక్షన్లలోని అపార్ట్‌మెంట్ల సెల్లార్లు పార్కింగ్‌లకు కాకుండా సొంత అవసరాలకు వినియోగించుకుంటున్న వారే అధికంగా ఉన్నారు. దీంతో సెల్లార్‌ పార్కింగ్‌ల్లో చోటు లేక ద్విచక్ర వాహనాలు, కార్లు, ఇతర వాహనాలను రోడ్ల పక్కన, ఫుట్‌పాత్‌లపైన నిలుపుతున్నారు. ఫలితంగా వాహన చోదకులు ట్రాఫిక్‌ సమస్యతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. దశాబ్దాల తరబడి విశాఖ సిటీలో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అయినప్పటికీ సెల్లార్లలో ఆక్రమణల తొలగింపునకు జీవీఎంసీ అధికార్లు ఇన్నాళ్లూ చర్యలు చేపట్టలేదు. గతంలో నామమాత్రంగా ఒకట్రెండు సార్లు తొలగించే ప్రయత్నాలు చేశారు. ఆ తర్వాత మళ్లీ మిన్నకుండిపోయారు. మరోపక్క నగరంలో జనాభాతో పాటు వాహనాల సంఖ్య పెరిగిపోతూ ట్రాఫిక్‌ ర ద్దీ తీవ్ర రూపం దాలుస్తోంది. దీనిపై జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌కు ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో కమిషనర్‌ సెల్లార్‌ పార్కింగ్‌లకు ఆక్రమణలను తొలగించాలని టౌన్‌ ప్లానింగ్‌ అధికారులను ఆదేశించారు.

గాజువాకలో సెల్లార్‌ ఆక్రమణల తొలగింపు..

ఆపరేషన్‌ లంగ్స్‌ 3.0 పేరుతో..

విశాఖ నగరంలో రానురాను జనాభాతో పాటు వాహనాల సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రస్తుతం విశాఖ పరిధిలో మొత్తం 10 లక్షల వాహనాల్లో రెండు లక్షల కార్లు, ఎనిమిది లక్షల వరకు ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. నగరంలో ఒక చోట నుంచి మరో చోటకు వెళ్లాలన్నా, షాపింగ్, సరకుల కొనుగోలుకు వెళ్లాలన్నా పార్కింగే పెద్ద సమస్యగా మారింది. వాహనాల పార్కింగ్‌ చేయాల్సిన చోట యజమానులు/నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా తమ సొంత అవసరాలకు వినియోగించుకుంటున్నారు. బిల్డింగ్‌ బైలాస్‌ ప్రకారం సెల్లార్, బేస్‌మెంట్‌ ఫ్లోర్లను పార్కింగ్‌లకే తప్ప వాణిజ్యం, నివాసం సహా మరే ఇతర అవసరాలకు వినియోగించకూడదు. పూర్తి స్థాయిలో వాహనాల పార్కింగ్‌కే కేటాయించాలి. నగరంలో దాదాపు 300 నిర్మాణాల్లోని సెల్లార్లు ఆక్రమణలకు గురైనట్టు జీవీఎంసీ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు గుర్తించారు. వీటిలో వాణిజ్య సముదాయాలు, విద్యా సంస్థలు, ఫంక్షన్‌ హాళ్లు ఉన్నాయి.

ప్రధాన జంక్షన్లలో ట్రాఫిక్‌ ఇక్కట్లు..

నగరంలో ప్రధాన జంక్షన్లు, వాణిజ్య కూడళ్లు అయిన డాబాగార్డెన్స్, జగదాంబ జంక్షన్, ద్వారకానగర్, సిరిపురం, జిల్లా పరిషత్‌ జంక్షన్, మద్దిలపాలెం, పూర్ణామార్కెట్, గోపాలపట్నం, గాజువాక ప్రాంతాల్లో ట్రాఫిక్‌ సమస్య అధికంగా ఉంది. ఆయా చోట్ల సెల్లార్‌ పార్కింగ్‌ల్లో వాహనాలను పార్క్‌ చేసే పరిస్థితి లేదు. దీంతో వాహనాలను రోడ్ల పక్కన, ఫుట్‌పాత్‌లపైన పార్క్‌ చేస్తున్నారు. ఇది ఇతర వాహన చోదకులకు ఇబ్బందికరంగా తయారవుతోంది. ఈ ట్రాఫిక్‌ సమస్యను సరి చేయడానికి పోలీసులకు తల ప్రాణం తోకకు వస్తోంది. ఈ సమస్యకు ఆపరేషన్‌ లంగ్స్‌ 3.0తో పరిష్కరించాలని జీవీఎంసీ కమిషనర్‌ నిర్ణయించారు.

ఆపరేషన్‌ లంగ్స్‌ 2.0లో దుకాణాలను తొలగిస్తున్న జీవీఎంసీ సిబ్బంది

రెండ్రోజుల్లో 12 సెల్లార్‌ ఆక్రమణల తొలగింపు..

ఆపరేషన్‌ లంగ్స్‌ 3.0ను సోమవారం నుంచి శ్రీకారం చుట్టారు. తొలిరోజు సౌత్‌ జోన్‌ డాబాగార్డెన్స్‌లో ఒక కమర్షియల్‌ కాంప్లెక్స్, ఈస్ట్‌ జోన్‌ ఎంవీపీ కాలనీలో ఒక వాణిజ్య దుకాణం, వెస్ట్‌ జోన్‌ గవర వీధిలో రెండు కూరగాయల షాపులు, 91వ వార్డు బుచ్చిరాజుపాలెం మెయిన్‌రోడ్డులో క్లోజ్డ్‌ గ్రిల్స్‌ను, 66వ వార్డు గాజువాక మెయిన్‌రోడ్డులో రెండు వెరసి ఏడు ఆక్రమణలను తొలగించారు. రెండోరోజు మంగళవారం 8వ వార్డు ఎండాడలో ఒకటి, అనకాపల్లి జోన్‌ 83వ వార్డులో రెండు, గాజువాక జోన్‌ 67వ వార్డులో రెండు చోట్ల కలిపి ఐదు చోట్ల సెల్లార్‌ ఆక్రమణలను తొలగించినట్టు చీఫ్‌ సిటీ ప్లానర్‌ ప్రభాకరరావు తెలిపారు.

కొనసాగనున్న ఆపరేషన్‌ లంగ్స్‌ 3.0

విశాఖ నగరంలో ఆపరేషన్‌ లంగ్స్‌ 3.0 కొనసాగుతుందని జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌ స్పష్టం చేశారు. ఇప్పటికే పార్కింగ్‌ కోసం కాకుండా వ్యాపారాలకు వినియోగిస్తున్న సెల్లార్‌/స్టిల్ట్‌ ఫోర్లలో స్వచ్ఛందంగా తొలగించుకోవాలని కోరారు. లేనిపక్షంలో వాటిని టౌన్‌ప్లానింగ్‌ సిబ్బంది తొలగిస్తారని తెలిపారు. ఆపరేషన్‌ లంగ్స్‌ 3.0 పూర్తయితే నగరంలో చాలావరకు ట్రాఫిక్‌ సమస్యకు ఊపశమనం కలిగినట్టవుతుందన్న ఆనందం విశాఖ వాసుల్లో వ్యక్తమవుతోంది.

ఆపరేషన్‌ లంగ్స్‌లో 3,500 ఆక్రమణల తొలగింపు

మరోవైపు విశాఖను క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ సిటీగాను, అంతర్జాతీయ ప్రమాణాలకనుగుణంగాను తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పిస్తోంది. ఈ నేపథ్యంలో విశాఖలో జరిగే సీఐఐ పార్టనర్‌షిప్‌ సమ్మిట్, ఐఎఫ్‌ఆర్, మిలాన్‌ వంటి జాతీయ, అంతర్జాతీయ ఈవెంట్లను దృష్టిలో ఉంచుకుని గత సెప్టెంబర్‌లో ఆపరేషన్‌ లంగ్స్‌ పేరిట రోడ్ల పక్కన, ఫుట్‌పాత్‌లపై ఆక్రమణల తొలగింపును చేపట్టారు. ఇలా సెప్టెం» ర్‌ నుంచి డిసెంబర్‌ వర కు రెండు దశల్లో జీవీఎంసీ పరిధిలోని 3,500కు పైగా ఆక్రమణలను తొలగించారు. వీరికి ప్రత్యామ్నాయంగా హాకర్‌ జోన్లను ఏర్పాటు చేస్తున్నారు.
Read More
Next Story