రాజకీయ దురుద్దేశంతోనే మహనీయుల విగ్రహాల మార్పు?
x

రాజకీయ దురుద్దేశంతోనే మహనీయుల విగ్రహాల మార్పు?

పార్లమెంట్ ప్రాంగణంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, మహాత్మా గాంధీ విగ్రహాలను బీజేపీ రాజకీయ ఎజెండాతోనే తొలగిస్తోందా? లేదా మరేదైనా..


విగ్రహాలు నాయకుల భౌతిక చిత్రం మాత్రమే కాదు - అవి వారి ఆదర్శాలకు చిహ్నాలు. ఈ ఆదర్శాల నుంచి ప్రేరణ పొందిన వారు వారిని గౌరవిస్తారు, వారిచే మనస్తాపం చెందిన వారు మహనీయుల విగ్రహాలపై దాడి చేస్తారు. డాక్టర్ అంబేద్కర్ విషయంలోనూ ఇదే జరిగింది.

దేశంలోని ప్రతి మూలలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలను చూడవచ్చు. అవి లక్షలాది మంది అణగారిన వర్గాలకు ఆదర్శం.. అవే విగ్రహాలు ద్వేషాన్ని పెంచేవారికి లక్ష్యాలు కూడా. ఉత్తరాది రాష్ట్రాలైన ఉత్తర ప్రదేశ్, హర్యానా వంటి రాష్ట్రాల్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలు తరుచూ దాడులకు గురవుతూ ఉంటాయి. అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసినప్పుడల్లా ప్రజలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తుంటారు. అయితే ప్రభుత్వమే ఈ మహనీయుల విగ్రహాలు ధ్వంసం చేసినప్పుడు వారు ఎవరికి ఫిర్యాదు చేయాలి?
స్థానం మార్పు
పార్లమెంటు ప్రాంగణంలో గాంధీజీ, అంబేద్కర్, ఇతర జాతీయ నాయకుల విగ్రహాలు చాలాకాలంగా క్రితమే స్థాపించారు. ఇటీవల, బిజెపి ప్రభుత్వం ఈ విగ్రహాలను ప్రస్తుతం ఉన్న స్థలం నుంచి తొలగించి ప్రేరణ స్థల్ లోని ఏకాంత ప్రదేశంలో వాటిని తిరిగి ప్రతిష్టించడానికి ప్రయత్నాలు చేస్తోంది.
ఇప్పుడు పార్లమెంట్ ప్రాంగణంలో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఏప్రిల్ 2, 1967 న అప్పటి రాష్ట్రపతి డాక్టర్ ఎస్ రాధా కృష్ణన్ చేత ప్రతిష్టించబడింది. ప్రముఖ శిల్పి వివి బాగ్ రూపొందించిన ఈ 3.66 మీటర్ల పొడవైన కాంస్య విగ్రహాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్మారక కమిటీ విరాళంగా ఇచ్చింది. ప్రఖ్యాత కళాకారుడు రామ్ వి సుతార్ చేత చెక్కబడిన 4.9 మీటర్ల పొడవైన మహాత్మా గాంధీ కాంస్య విగ్రహం 1993లో ప్రారంభించారు.
సింబాలిక్ ప్రాముఖ్యత
ఈ విగ్రహాలు ఈ నాయకులకు ప్రాతినిధ్యం వహించడమే కాకుండా వారి ఆదర్శాలకు చిహ్నాలు. పార్లమెంటులో ప్రజాస్వామ్యం కోసం నిరసనలు తెలపడానికి రాజకీయ పార్టీలు తరచూ ఈ విగ్రహాల ముందు ఆందోళన చేస్తాయి.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి, స్మారక రోజులలో, పార్లమెంట్ కాంప్లెక్స్ లోపల ఉన్న ఆయన విగ్రహానికి వేలాది మంది నివాళులర్పించేవారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల సమయంలో, నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఆపద్ధర్మ ప్రభుత్వం పార్లమెంటు సముదాయానికి సుందరీకరణ చేస్తున్నామనే నెపంతో అక్కడ ఉన్న గాంధీ, అంబేడ్కర్ విగ్రహాలను హడావుడిగా తొలగించింది. సార్వత్రిక ఎన్నికల అనంతరం కొత్త సభ్యులు పార్లమెంట్ ప్రాంగణంలోని వెళ్లినప్పుడు ఈ విషయం బయటపడింది.
చరిత్రను చెరిపివేస్తోంది
కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనంలోకి రాష్టప్రతి, ప్రధానమంత్రి ప్రవేశించేందుకు ప్రత్యేక ద్వారం ఏర్పాటు చేయబడింది. అందుకోసం ఈ విగ్రహాల చుట్టూ ఉన్న మార్గాన్ని మార్చవలసి ఉంటుంది.
బిజెపి రాజకీయ ఎజెండాకు ఈ మహనీయులు వల్లించిన సూత్రాల వల్ల కలిగే అసౌకర్యమే ఈ తొలగింపుకు అసలు కారణం. ఈ విగ్రహాల చారిత్రక ప్రాధాన్యతను చెరిపేయడమే బీజేపీ లక్ష్యం. తొలగింపుపై నిరసనలు వెల్లువెత్తడంతో పార్లమెంట్ సెక్రటేరియట్ వివరణ ఇచ్చింది. విగ్రహాలు పార్లమెంట్ లోని వివిధ ప్రదేశాల్లో ఉండటం వల్ల సందర్శకులు వాటిని చూడటం కష్టంగా ఉందని, అందుకే అన్ని విగ్రహాలను ఒకే దగ్గరకు చేరుస్తున్నామని వెల్లడించారు. లోక్ సభ స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఏకపక్ష తొలగింపు
పార్లమెంట్‌ కాంప్లెక్స్‌ నిర్వహణ స్పీకర్‌ ఆధీనంలో ఉంటుంది. అయితే ఈ విగ్రహాల తొలగింపు ఆమోదయోగ్యం కాదు. ఎన్నికల సమయంలో రహస్యంగా, హడావుడిగా వాటిని తొలగించడం అనుమానాస్పద ఉద్దేశాలను వెల్లడిస్తోంది.
కొత్త స్పీకర్‌ను ఎన్నుకునే ముందు అటువంటి నిర్ణయం తీసుకునే అధికారం మునుపటి స్పీకర్ ఓం బిర్లాకు ఉందా అనేది చర్చనీయాంశమైంది. ఎన్నికల్లో మెజారిటీ కోల్పోయినప్పటికీ, బీజేపీ అనుసరిస్తున్న అప్రజాస్వామిక చర్యలకు ఈ ఘటన అద్దం పడుతోంది.
మహాత్మాగాంధీ, డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ వంటి జాతీయ నాయకులను అగౌరవపరిచే ఈ చర్యపై చంద్రబాబు నాయుడు, నితీష్‌ కుమార్‌లు తమ వైఖరిని స్పష్టం చేయాలి.
కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాకముందే నిరంకుశ శక్తులు జాతీయ నాయకుల విగ్రహాలను ధ్వంసం చేసే పనిలో నిమగ్నమై ఉన్నాయి. ప్రజాస్వామ్యానికి ఇది మంచి సంకేతం కాదు.

(ఫెడరల్ అన్ని వైపుల నుంచి అభిప్రాయాలను అందించడానికి ప్రయత్నిస్తుంది. వ్యాసంలోని సమాచారం, ఆలోచనలు లేదా అభిప్రాయాలు రచయితకు చెందినవి. ఫెడరల్ అభిప్రాయాలను ప్రతిబింబించవు.)



Read More
Next Story