
చంద్రబాబు బాకీ..అక్షరాలా వేల కోట్లు: జగన్
ప్రతి మహిళకు నెలకు రూ. 1500 ఇస్తామని బాండ్లు ఇచ్చి మరీ చంద్రబాబు మోసం చేశారని జగన్ మండిపడ్డారు.
అబద్ధానికి రెక్కలు కడితే చంద్రబాబు.. మోసానికి ప్యాంటు, షర్టు వేస్తే చంద్రబాబు అంటూ వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. గురువారం తాడేపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను లెక్కల వారీగా చీల్చి చెండాడారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇవ్వాల్సిన బాకీలు అక్షరాలా వేల కోట్లలో ఉన్నాయని, ఈ బడ్జెట్ ఒక మోసాల పుట్ట అని జగన్ ధ్వజమెత్తారు. జగన్ మాట్లాడుతూ..
మహిళలకు అక్షరాలా 97,200 కోట్ల బాకీ
ఎన్నికల ముందు ప్రతి మహిళకు నెలకు రూ. 1500 ఇస్తామని బాండ్లు ఇచ్చి మరీ చంద్రబాబు మోసం చేశారని జగన్ మండిపడ్డారు. రాష్ట్రంలో 18 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న కోటి 80 లక్షల మంది మహిళలకు ఈ పథకం వర్తింపజేయాల్సి ఉందన్నారు. గత 18 నెలల కాలానికి గాను ప్రభుత్వం మహిళలకు రూ. 97,200 కోట్లు బకాయి పడిందని లెక్కలు తేల్చారు. అంటే, ఈ రోజుకు చంద్రబాబు ప్రతి మహిళకు అక్షరాలా రూ. 54,000 బాకీ ఉన్నారని, ఆ డబ్బు ఎగ్గొట్టడానికే బడ్జెట్‌లో ఆ ఊసే ఎత్తలేదని జగన్ నిలదీశారు.
నిరుద్యోగుల నోరు కొట్టి.. 21,600 కోట్లు ఎగ్గొట్టి
యువగళం అంటూ ఊదరగొట్టిన లోకేష్, బాబులు నిరుద్యోగ భృతి విషయంలో పచ్చి మోసం చేశారని జగన్ ధ్వజమెత్తారు. నెలకు రూ. 3,000 చొప్పున నిరుద్యోగులకు ఏడాదికి రూ. 36,000 ఇస్తామని చెప్పి, మూడు బడ్జెట్‌లు గడిచినా ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగులందరికీ కలిపి కూటమి ప్రభుత్వం రూ. 21,600 కోట్లు బకాయి పడిందని, మేనిఫెస్టోను చిత్తుకాగితం చేసి చెత్తబుట్టలో వేశారని మండిపడ్డారు.
అప్పుల్లో ఆల్‌టైమ్ రికార్డు.. ఆ డబ్బు ఎక్కడికి పోయింది?
సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు, అప్పులు చేయడంలో తన పాత రికార్డులను తానే బద్దలు కొడుతున్నారని జగన్ ఆరోపించారు. బాబు గతంలో దిగిపోయే నాటికి అప్పు రూ. 3.90 లక్షల కోట్లు ఉంటే, ఈ 18 నెలల కూటమి పాలనలో చేసిన అప్పులు అక్షరాలా రూ. 3,17,448 కోట్లకు చేరాయని గణాంకాలతో వివరించారు. ఇంత భారీగా అప్పులు తెస్తున్నా, ప్రజలకు సంక్షేమ పథకాలు ఎందుకు అందడం లేదని, ఆ డబ్బు అంతా ఎవరి జేబుల్లోకి వెళ్తోందని దోచుకో.. దాచుకో.. పంచుకో అంటూ ఎద్దేవా చేశారు.
ఆరోగ్యశ్రీ నుంచి ఉద్యోగుల వరకు.. అంతా బకాయిలే
కేవలం పథకాలే కాదు, ప్రభుత్వ వ్యవస్థలను కూడా చంద్రబాబు బకాయిల ఊబిలోకి నెట్టారని జగన్ విమర్శించారు. ఆరోగ్యశ్రీకి గత రెండేళ్లలో రూ. 3,141 కోట్లు బకాయి పడ్డారని, దీనివల్ల పేదలకు వైద్యం అందకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణంగా ఉందని, పీఆర్సీ ఇవ్వకుండా, 4 డీఏలు పెండింగ్‌లో పెట్టి సుమారు రూ. 35,000 కోట్లు వారికి బాకీ పడ్డారని వెల్లడించారు. నాడు-నేడును గాలికి వదిలేయడం వల్లే పాఠశాలల్లో కలుషిత నీరు తాగి 900 మంది పిల్లలు ఆసుపత్రుల పాలయ్యారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాకీలు వేల కోట్లలో ఉన్నాయని, చంద్రబాబు అబద్ధాలను గోబెల్స్ ప్రచారంతో కప్పిపుచ్చలేరని జగన్ హెచ్చరించారు. ఈ లెక్కల చిట్టాను ప్రజల ముందుకు తీసుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు.

