
ఆ నివేదిక వచ్చిన వెంటనే రంగంలోకి దిగండి: చంద్రబాబు ఆదేశం
మరోవైపు, తిరుపతి, విశాఖపట్నం శిల్పారామాల ప్రాజెక్టుల్లో పాత ఒప్పందాలను రద్దు చేసి, కొత్తగా టెండర్లు (EOI) ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం, తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో నెయ్యి కల్తీ వ్యవహారం బుధవారం నాటి కేబినెట్ భేటీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారింది. సిట్ (SIT) సిద్ధం చేసిన నివేదికపై మంత్రివర్గంలో అత్యంత కీలకమైన చర్చ జరిగింది. ఈ సున్నితమైన అంశంపై విపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని కేవలం మాటలతో కాకుండా, పక్కా ఆధారాలతోనే తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే సీబీఐ పర్యవేక్షణలోని సిట్ ఛార్జిషీట్ దాఖలు చేసిన తరుణంలో, అధికారిక నివేదిక పూర్తిస్థాయిలో చేతికి వచ్చాక మంత్రులు తమ విశ్వరూపం ప్రదర్శించాలని నిర్ణయించింది. ప్రజల సెంటిమెంట్లు, భక్తుల నమ్మకాలతో ముడిపడి ఉన్న వ్యవహారం కావడంతో, ఆచితూచి అడుగులు వేస్తూనే.. సిట్ నివేదిక వచ్చిన తర్వతా స్పందించాలని, ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని తిప్పి కొట్టాలని సీఎం చంద్రబాబు మంత్రులకు నిర్థేశం చేశారు.
అమరావతి రైతులకు ఊరట.. పేదలకు పింఛన్ల ఆసరా
రాజధాని అమరావతి అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం మానవీయ కోణంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. గతంలో వీధిపోటు భూములు పొందిన రైతులకు నష్టం కలగకుండా ప్రత్యామ్నాయ ప్లాట్లు ఇచ్చేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటితో పాటు, అమరావతి పరిధిలో భూమి లేని పేదలకు, అనాథ పిల్లలకు పింఛన్లు మంజూరు చేయాలని నిర్ణయించడం గమనార్హం. అలాగే, ఏపీ టిడ్కో (TIDCO) గృహ నిర్మాణాల కోసం హడ్కో నుంచి రూ. 4,451 కోట్ల ప్రభుత్వ రుణ గ్యారెంటీకి మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.
అర్జున అవార్డు గ్రహీత జ్యోతికి గ్రూప్-1 ఉద్యోగం
రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన క్రీడాకారులను గౌరవించే క్రమంలో అర్జున అవార్డు గ్రహీత, ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖకు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆమెకు విశాఖపట్నంలో 500 చదరపు గజాల నివాస స్థలంతో పాటు, ఆమె డిగ్రీ పూర్తి చేసిన తర్వాత నేరుగా గ్రూప్-1 ఉద్యోగం ఇచ్చే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇది రాష్ట్రంలోని క్రీడాకారులకు గొప్ప ప్రోత్సాహకరమైన నిర్ణయంగా భావిస్తున్నారు.
పర్యాటక రంగంలో ఫైవ్ స్టార్ దూకుడు.. శిల్పారామాల పునరుద్ధరణ
రాష్ట్రంలో పర్యాటక రంగానికి జవసత్వాలు నింపేలా అల్లూరి జిల్లా నందకోటలో ఫైవ్ స్టార్ రిసార్ట్, కన్వెన్షన్ సెంటర్, థీమ్ పార్కు ఏర్పాటుకు భూకేటాయింపులు జరిగాయి. మరోవైపు, తిరుపతి, విశాఖపట్నం శిల్పారామాల ప్రాజెక్టుల్లో పాత ఒప్పందాలను రద్దు చేసి, కొత్తగా టెండర్లు (EOI) ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గుంటూరు శిల్పారామంలో సాంస్కృతిక కేంద్రం, వినోద జోన్ అభివృద్ధికి పీపీపీ (PPP) పద్ధతిలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పిడుగురాళ్ల మెడికల్ కాలేజీని కూడా పీపీపీ విధానంలోనే అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.

