రైసినా డైలాగ్‌లో అదరగొట్టిన చంద్రబాబు
x

రైసినా డైలాగ్‌లో అదరగొట్టిన చంద్రబాబు

భారతీయులు అత్యుత్తమ డిప్లమాట్లుగా, నిపుణులుగా రాణిస్తున్నారని సీఎం చంద్రబాబు వెల్లడించారు.


అంతర్జాతీయ వ్యూహాత్మక సదస్సు ‘రైసినా డైలాగ్ 2026’లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రసంగం చేశారు. 2016లో ప్రారంభమైన ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు ఆహ్వానం అందుకున్న తొలి భారతీయ ముఖ్యమంత్రిగా ఆయన రికార్డు సృష్టించారు. 110 దేశాల నుంచి వచ్చిన 2700 మంది ప్రతినిధులు, మేధావుల సమక్షంలో భారత్ , ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలను ఆయన ఆవిష్కరించారు.

క్వాంటం వ్యాలీగా అమరావతి
సాంకేతిక విప్లవంలో భారత్ ప్రపంచానికే దిక్సూచిగా మారిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఐటీ రంగంలో మూడు దశాబ్దాల క్రితం తాము ప్రారంభించిన సంస్కరణలు నేడు తెలుగు నిపుణులను ప్రపంచ స్థాయికి చేర్చాయని గుర్తు చేశారు. ఇదే బాటలో అమరావతిని ‘క్వాంటం వ్యాలీ’గా తీర్చిదిద్దుతున్నామని, త్వరలోనే క్వాంటం కంప్యూటింగ్ పరికరాలను తయారు చేసి ప్రపంచానికి అందిస్తామని వెల్లడించారు. విశాఖపట్నంలో గూగుల్ సంస్థ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు రావడం గర్వకారణమని ఆయన తెలిపారు.
ఏఐ - నాలెడ్జ్ ఎకానమీ
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) భవిష్యత్తులో ‘గేమ్ ఛేంజర్’గా మారబోతోందని చంద్రబాబు విశ్లేషించారు. నాలెడ్జ్ ఎకానమీలో భారత్ అగ్రగామిగా ఉందని, ప్రపంచంలోని 60 శాతం గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (GCCs) ఇక్కడే ఏర్పాటు కావడం దీనికి నిదర్శనమన్నారు. డిజిటల్ కరెన్సీ , యూపీఐ పేమెంట్ వ్యవస్థలు భారత ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేశాయని కొనియాడారు. గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ ద్వారా భవిష్యత్ నాయకులను అమరావతిలో తయారు చేస్తామని స్పష్టం చేశారు.
అమరావతి: బ్లూ గ్రీన్ - స్పేస్ సిటీ
అమరావతిని కాలుష్య రహిత బ్లూ గ్రీన్ నగరంగా నిర్మిస్తున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు. ఈ నగరంలో మొత్తం 9 రకాల ప్రత్యేక క్లస్టర్లను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ప్రైవేటు శాటిలైట్లను తయారు చేసి లాంచ్ చేసేలా ప్రత్యేక నగరం. డ్రోన్ టెక్నాలజీ పరిశోధనలు మరియు డ్రోన్ అంబులెన్స్ సేవలకు కేంద్రం. సృజనాత్మక రంగానికి ప్రాధాన్యత. వీటితో పాటు ఎలక్ట్రానిక్స్, ఏరో స్పేస్ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షిస్తున్నట్లు వెల్లడించారు.
జనాభా నిర్వహణ - కొత్త పాలసీ
దేశం భవిష్యత్తులో ఎదుర్కోబోయే ఏజింగ్ (వృద్ధాప్య జనాభా) సమస్యపై చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో జనాభా నియంత్రణ గురించి మాట్లాడిన తాను, మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు జనాభా నిర్వహణ (Population Management) గురించి మాట్లాడుతున్నానన్నారు. రాష్ట్రంలో ఫెర్టిలిటీ రేటును 1.5 నుంచి 2.1కు పెంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మూడో బిడ్డ పుడితే రూ. 25 వేల రూపాయల ఆర్థిక సాయం, నెలకు వెయ్యి రూపాయల ప్రోత్సాహకం అందించనున్నట్లు ప్రకటించారు. మైక్రో ఫ్యామిలీల నుంచి మళ్ళీ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు.
గ్రీన్ ఎనర్జీ.. గ్లోబల్ సర్వీస్
భారత్ త్వరలోనే విద్యుత్ ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంటుందని, ఏపీలో గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తిపై దృష్టి పెట్టామని చంద్రబాబు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా భారతీయులు అత్యుత్తమ డిప్లమాట్లుగా, నిపుణులుగా రాణిస్తున్నారని.. త్వరలోనే మేధో వలసలు ఆగిపోయి రివర్స్ మైగ్రేషన్ ప్రారంభమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య సహకార ఫెడరలిజం స్ఫూర్తితో ప్రజా జీవన ప్రమాణాలను పెంపొందిస్తామని ప్రసంగాన్ని ముగించారు.
Read More
Next Story