అమరావతి తీర్మానాన్ని ప్రవేశపెట్టిన చంద్రబాబు
x

అమరావతి తీర్మానాన్ని ప్రవేశపెట్టిన చంద్రబాబు

విపక్షాల గైర్హాజరీపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు విమర్శలు గుప్పించారు.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు అత్యంత కీలకమైన రాజధాని అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం శాసనసభలో చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అమరావతిని కేవలం రాష్ట్ర రాజధానిగానే కాకుండా, దానికి కేంద్ర చట్టబద్ధత కల్పించాలనేది ఈ తీర్మానం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 5(2)కు తగిన సవరణలు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనే పదాన్ని శాశ్వతంగా చేర్చాలని ఈ తీర్మానం ద్వారా కేంద్రాన్ని కోరారు. రాజధాని విషయంలో గతంలో ఎదురైన అడ్డంకులు, అనిశ్చితి మళ్లీ పునరావృతం కాకుండా శిలాక్షరాలతో లిఖించాల్సిన అవసరం ఉందని సీఎం స్పష్టం చేశారు.

విపక్షాల గైర్హాజరీపై అయ్యన్నపాత్రుడు విమర్శ
ఈ తీర్మానంపై చర్చకు ముందు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఉద్వేగభరితంగా ప్రసంగించారు. ఐదున్నర కోట్ల ఆంధ్రుల ఆకాంక్షకు ఈ సభ ప్రతిరూపమని, రాష్ట్ర ప్రగతికి ఎదురయ్యే సవాళ్లను తొలగించే పవిత్ర యజ్ఞంలో భాగస్వాములవ్వడం తన అదృష్టమని ఆయన పేర్కొన్నారు. అయితే, ఇంతటి కీలకమైన సమయంలో సభకు హాజరు కాని 11 మంది వైసీపీ సభ్యుల తీరును ఆయన తీవ్రంగా ఎండగట్టారు. గత ఐదేళ్లలో జరిగిన తప్పులపై పశ్చాత్తాపం చెందుతారని ఆశించానని, కానీ చేసిన తప్పులను ఒప్పుకునే కనీస నిజాయితీ కూడా వారికి లేదని స్పీకర్ విమర్శించారు.
విధ్వంసం నుంచి పునర్నిర్మాణం వైపు..
ముఖ్యమంత్రి తన తీర్మానంలో గత ప్రభుత్వ వైఫల్యాలను, ప్రస్తుత ప్రభుత్వ దృఢ సంకల్పాన్ని వివరించారు. 2014-19 మధ్య ఎంతో ముందుచూపుతో, ప్రపంచ స్థాయి నగరంగా అమరావతికి పునాదులు వేస్తే, 2019-24 పాలకులు రాష్ట్ర విధ్వంసానికి కంకణం కట్టుకున్నారని మండిపడ్డారు. పరిపాలన అనేది నిరంతర ప్రక్రియ అని, కానీ గత ప్రభుత్వం చేతికి కొబ్బరికాయ దొరికినట్లు వ్యవహరించి రాష్ట్రాన్ని 50 ఏళ్లు వెనక్కి నెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులను వీధిన పడేసి, అవమానించారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
అజరామరంగా అమరావతి: మంత్రి నారాయణ
తీర్మానాన్ని బలపరుస్తూ పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ అమరావతి నిర్మాణ ప్రస్థానాన్ని వివరించారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదిక, ప్రజాభిప్రాయ సేకరణ ఆధారంగానే అమరావతిని ఎంపిక చేశామని, కేవలం 58 రోజుల్లో 29,966 మంది రైతులు 34,400 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇవ్వడం ఒక ప్రపంచ రికార్డు అని కొనియాడారు. ప్రస్తుతం రూ. 59 వేల కోట్లతో 91 ప్రాజెక్టుల పనులు శరవేగంగా జరుగుతున్నాయని, అమరావతిని సెల్ఫ్ సస్టెయిన్డ్ ప్రాజెక్టుగా తీర్చిదిద్దుతున్నామని ఆయన వెల్లడించారు. రాజకీయ కుట్రలను ఛేదించి అమరావతిని అజరామరంగా ఉంచుతామని ఆయన వెల్లడించారు.
Read More
Next Story