
’చంద్రబాబు గడ్డి పోచ కూడా కదపలేదు‘
భోగాపురం విమానాశ్రయం పనులు తాము చేస్తే, సీఎం చంద్రబాబు మాత్రం 'క్రెడిట్ చోరీ'కి పాల్పడుతున్నారని జగన్ ధ్వజమెత్తారు.
"ప్రభుత్వాలు మారినా పనుల వెనుక ఉన్న చెమటను మార్చలేరు.. మేం పునాదులు వేసి, కోర్టు అడ్డంకులు తొలగించి, నిధులు కుమ్మరించి నిర్మించిన భోగాపురం ఎయిర్‌పోర్ట్‌పై ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు 'క్రెడిట్ స్టిక్కర్లు' వేసుకోవాలని చూడటం హాస్యాస్పదం" అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. గురువారం తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భోగాపురం ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి తమ ప్రభుత్వం ఎదుర్కొన్న 130 కోర్టు కేసులు, వెచ్చించిన రూ. 960 కోట్ల భూసేకరణ నిధుల చిట్టాను వివరిస్తూ కూటమి సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధించారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. భూసేకరణ నుంచి అనుమతుల వరకు గడ్డి పోచ కూడా కదపని వ్యక్తి, ఇప్పుడు మొదటి విమానం దిగుతుంటే తన ఖాతాలో వేసుకోవాలని చూడటం హాస్యాస్పదం అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు.
ఇంకా ఆయన ఏమన్నారంటే..
130 కోర్టు కేసులను అధిగమించామని, భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు వ్యతిరేకంగా ఉన్న 130 కోర్టు కేసులను తమ ప్రభుత్వం విజయవంతంగా పరిష్కరించిందని జగన్ గుర్తు చేశారు. చంద్రబాబు హయాంలో భూసేకరణ పేరిట వేల ఎకరాల దోపిడీకి ప్రయత్నించారని, కానీ తాము బాధితులకు న్యాయం చేస్తూ పనులు ముందుకు తీసుకెళ్లామని చెప్పారు. ఎయిర్‌పోర్ట్ భూసేకరణ కోసం తమ ప్రభుత్వం రూ. 960 కోట్లు ఖర్చు చేసిందని, నిర్వాసితులకు అత్యాధునిక వసతులతో కాలనీలు కట్టించి ఇచ్చామని తెలిపారు. అశోక్ గజపతిరాజు నాడు కేంద్ర పౌర విమానయాన మంత్రిగా ఉన్నా ఎయిర్‌పోర్ట్‌కు అనుమతులు తేలేకపోయారని, తాము అధికారంలోకి వచ్చాకే అన్ని రకాల క్లియరెన్స్‌లు తెచ్చామని స్పష్టం చేశారు. కరోనా కష్టకాలంలోనూ ప్రాజెక్టు పనులు ఆగకుండా చూశామని, భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు తానే శంకుస్థాపన చేశానని జగన్ గర్వంగా ప్రకటించారు. 2026లో భోగాపురంలో మొదటి విమానం ల్యాండ్ అవుతుందని ఆనాడే చెప్పాను. నేను చెప్పినట్లే ఇప్పుడు జరుగుతోంది. కానీ దీని వెనుక ఉన్న ఐదేళ్ల మా కష్టాన్ని చంద్రబాబు తనదిగా చెప్పుకోవడం సిగ్గుచేటు అని విమర్శించారు.

