క్యాస్ట్ సర్టిఫికెట్ ఇంత ఖరీదా? లంచం అడిగితే ఏం చేయాలి?
x

క్యాస్ట్ సర్టిఫికెట్ ఇంత ఖరీదా? లంచం అడిగితే ఏం చేయాలి?

సర్కారు వారి "ఆన్‌లైన్" పద్ధతి ఉన్నా 'లంచాల' దారి వేరే ఉంది.


ఈయన పేరు రామయ్య, ఊరు ప్రకాశం జిల్లాలో ఓ మారుమూల గ్రామం.. వాళ్లబ్బాయి ఉద్యోగం కోసం కుల ధృవీకరణ పత్రం కావాల్సి వచ్చింది. ఆయన ఆన్ లైన్ లో దరఖాస్తు చేశారు. వారం గడిచినా అతీగతీ లేదు.. ప్రభుత్వం చెబుతున్న "ఆన్‌లైన్" పద్ధతి ఉన్నా 'లంచాల' దారి వేరే ఉంది.
దరఖాస్తు చేసిన వారం తర్వాత సచివాలయానికి వెళ్తే, "సర్వర్ పని చేయడం లేదు" అని ఒకరు, "విచారణ అధికారి (VRO) ఊరిలో లేరు" అని మరొకరు.. "మరీ గట్టిగా నిలదీస్తే మీ దరఖాస్తులో ఏదో తప్పుందని చెప్పి రిజెక్ట్ చేస్తారు" అని వాపోయాడాయన.

ఇదేదో ఒక్క రామయ్య కథే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో మంది రామయ్యలదీ ఇదే పరిస్థితి. ఆస్తుల బదలాయింపు కోసం ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కావాలన్నా ఇదే పరిస్థితి. విజయవాడలో ఇటీవల ఒక అధికారి కుటుంబ ధృవీకరణ పత్రం కోసం ఏకంగా రూ. 45,000 లంచం డిమాండ్ చేస్తూ ఏసీబీకి దొరికిపోవడమే దీనికి నిదర్శనం.
ఇంతకీ కుల ధృవీకరణ పత్రం పొందడం ఎలా?
SC, ST, BC, OC వర్గాలకు విద్యా, ఉద్యోగ అవసరాల కోసం దీనిని జారీ చేస్తారు. ఇందులో కులం, నివాసం, పుట్టిన తేదీ వివరాలు ఉంటాయి.
కావలసిన పత్రాలు:
దరఖాస్తు ఫారమ్: మీసేవ లేదా సచివాలయంలో లభిస్తుంది.
కుటుంబ సభ్యుల కుల ధృవీకరణ పత్రం: తండ్రి లేదా తోబుట్టువుల పత్రం.
విద్యా ధృవీకరణ పత్రాలు: SSC మార్కుల జాబితా, టీసీ (TC) లేదా 1 నుండి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు.
గుర్తింపు కార్డులు: ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ లేదా ఓటర్ ఐడి.
షెడ్యూల్ I నుండి IV: నిర్ణీత ఫార్మాట్‌లో వివరాలు.
ఇది కేటగిరీ-బి సర్వీస్ కిందకు వస్తుంది. దరఖాస్తు చేసుకున్న తర్వాత దీనిని కేటగిరీ-ఎ కిందకు మార్చి, గ్రామ/వార్డు సచివాలయం ద్వారా పొందవచ్చు.
కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రం..
కుటుంబ యజమాని మరణించిన తర్వాత, వారసులను ధృవీకరించడానికి తహసీల్దార్ కార్యాలయం లేదా మీసేవ ద్వారా దీనిని జారీ చేస్తారు.
అవసరమైన పత్రాలు:
యజమాని మరణ ధృవీకరణ పత్రం (Death Certificate).
కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డులు.
అఫిడవిట్: ₹10/- స్టాంపు పేపర్‌పై నోటరీ చేయించిన పత్రం.
రేషన్ కార్డ్, పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు.
దరఖాస్తు చేసుకున్న తర్వాత VRO (గ్రామ రెవెన్యూ అధికారి), RI (రెవెన్యూ ఇన్‌స్పెక్టర్) క్షేత్రస్థాయిలో విచారణ జరుపుతారు. పొరుగువారిని అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులందరినీ సంప్రదించి నివేదిక ఇస్తారు. దీని ఆధారంగానే సర్టిఫికెట్ జారీ అవుతుంది.

అవినీతిని ఎదుర్కోవడం ఎలా?

అన్నీ సక్రమంగా ఉన్నా అధికారులు కాలయాపన చేస్తూ లంచం అడిగితే తలొగ్గకండి. ఇటీవల ₹45,000 లంచం తీసుకుంటూ దొరికిపోయిన వార్డు రెవెన్యూ సెక్రటరీ ఉదంతం మనకు ధైర్యాన్ని ఇవ్వాలి.
లంచం అడిగితే ఏసీబీ (ACB) టోల్ ఫ్రీ నంబర్: 1064, విజయవాడ రేంజ్ డీఎస్పీ: 94404 46164 కి ఫిర్యాదు చేయండి.
అన్ని పత్రాలుంటే దరఖాస్తును ఎవ్వరూ అడ్డుకోలేరు. ప్రతి సర్టిఫికెట్‌కు ప్రభుత్వం నిర్ణయించిన కాలపరిమితి ఉంటుంది. ఆ గడువు దాటినా రాకపోతే, ఎందుకు లేట్ అవుతుందో రాతపూర్వకంగా అడగండి.
ముఖ్యమంత్రి కార్యాలయానికి నేరుగా ఫిర్యాదు చేసేందుకు '1902' నంబర్‌కు కాల్ చేయండి లేదా సచివాలయంలోని 'స్పందన'లో ఫిర్యాదు చేయండి.
Read More
Next Story