బెంగళూరులో మెట్రో ఛార్జీల పెంపు నిలిపివేత..
x

బెంగళూరులో మెట్రో ఛార్జీల పెంపు నిలిపివేత..

కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య మాట్లాడిన తర్వాత నిర్ణయం


Click the Play button to hear this message in audio format

బెంగళూరు(Bengaluru)లో మెట్రో(Metro) ఛార్జీల పెంపును కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య మాట్లాడిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దీంతో నగర ప్రయాణికులకు ఉపశమనం లభించింది. సోమవారం నుంచి అమల్లోకి రావాల్సిన నమ్మ మెట్రో కొత్త ఛార్జీలను నిలిపివేస్తున్నట్టు తేజస్వి సూర్య శనివారం సోషల్ మీడియా వేదిక Xలో వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ పెంపు సాధారణ ప్రజలపై భారం పెడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

తేజస్వి సూర్య మాట్లాడుతూ.. బెంగళూరులో ఇప్పటికే దేశంలోనే అత్యధిక మెట్రో ఛార్జీలు ఉన్నాయని, మరింత పెంపు వల్ల మధ్యతరగతి, సాధారణ ప్రజలకు ప్రజా రవాణా అందుబాటులో ఉండదని తెలిపారు. అందుకే కేంద్ర మంత్రి ఖట్టర్ జోక్యం చేసుకోవాలని కోరినట్లు చెప్పారు.

ఈ విషయంపై స్పందించిన ఖట్టర్.. ప్రతిపాదిత పెంపును తాత్కాలికంగా నిలిపివేయాలని అధికారులకు సూచనలు ఇచ్చినట్లు తెలిపారు. సోమవారం నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి రాకుండా చూస్తామని హామీ ఇచ్చినట్లు సూర్య పేర్కొన్నారు. అలాగే ఛార్జీల నిర్ణయ కమిటీ (FFC) పనితీరును సమీక్షించి, అవసరమైతే కొత్త కమిటీ ఏర్పాటు విషయాన్ని పరిశీలిస్తామని మంత్రి చెప్పినట్లు తెలిపారు.

ఇక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (CM Siddaramaiah) తక్షణం చర్యలు తీసుకుని ఛార్జీలను సరైన స్థాయిలో నిర్ణయించాలని తేజస్వి సూర్య(Tejasvi Surya) డిమాండ్ చేశారు. ప్రజల ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని కోరారు.

అయితే మెట్రో ఛార్జీల నిర్ణయంలో రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా అధికారం లేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇప్పటికే స్పష్టం చేశారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్రంపై నెట్టడం సరైనది కాదని వారు అభిప్రాయపడ్డారు.

ఒక సంవత్సరం క్రితం మెట్రో ఛార్జీలు సుమారు 70 శాతం పెరగడంతో ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఛార్జీల నిర్ణయ కమిటీ నిబంధనల ప్రకారం ప్రతి ఏడాది సుమారు 5 శాతం వరకు సవరణకు అవకాశం ఉంది. తాజా ప్రతిపాదనలో కనీస ఛార్జీ రూ.10 నుంచి రూ.11కు, గరిష్ట ఛార్జీ రూ.90 నుంచి రూ.95కు పెంచాలని భావించారు. మొత్తం 10 స్లాబ్‌లలో రూ.1 నుంచి రూ.5 మధ్య పెంపు ఉండేలా ప్రతిపాదించారు.

Read More
Next Story