Chandra babu
x
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో చంద్రబాబు భేటీ (ఫైల్)

నిర్మలమ్మ బడ్జెట్ లో ఆంధ్రాకి నికరంగా దక్కేది ఇవే!

మూడు సార్లు పేరు వచ్చిందని మురిసిపోతే సరా.. నిధులేవీ..


కేంద్ర బడ్జెట్ 2026-27లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కేటాయించిన నిధులు నామమాత్రంగానే ఉన్నాయి. రాష్ట్రానికి చెందిన పలు ప్రాజెక్టుల ప్రస్తావన ఇందులో కనిపించలేదు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరానికి కూడా కంటితుడుపుగానే నిధులు ఉన్నాయని వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

పోలవరం ప్రాజెక్టు కేటాయింపులు

బడ్జెట్ నిధులు: 2026-27 ఆర్థిక సంవత్సరానికి పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం రూ.3,320.39 కోట్లు కేటాయించింది. ఈ ప్రాజెక్టు అథారిటీ (PPA) నిర్వహణ కోసం రూ.20 కోట్లు కేటాయించారు.
నిర్మాణ వ్యయం: 41.15 మీటర్ల ఎత్తు వరకు ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సవరించిన అంచనా వ్యయం రూ.30,436.95 కోట్లుగా కేంద్ర కేబినెట్ గతంలోనే ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా కేంద్రం రూ.12,157.53 కోట్లు ఇచ్చేందుకు తీర్మానించింది.
గత నిధుల విడుదల: 2024-25లో రీయింబర్స్‌మెంట్ కింద రూ.459.69 కోట్లు, అడ్వాన్సుగా రూ.5,052.71 కోట్లను కేంద్రం రాష్ట్రానికి విడుదల చేసింది.
రైల్వే ప్రాజెక్టులు
హైస్పీడ్ రైల్వే కారిడార్లు: దేశవ్యాప్తంగా ఆమోదించిన 7 కొత్త హైస్పీడ్ రైల్వే కారిడార్లలో ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళ్లే కారిడార్లు ఉన్నాయి.
హైదరాబాద్ – చెన్నై కారిడార్.
హైదరాబాద్ – బెంగళూరు కారిడార్.
చెన్నై – బెంగళూరు కారిడార్ (ఇది చిత్తూరు జిల్లాలోని పలమనేరు ప్రాంతం మీదుగా వెళ్తుంది).
పర్యాటక రంగం...
అరకు వ్యాలీ అభివృద్ధి: ఈ బడ్జెట్‌లో టూరిజం రంగానికి ప్రాధాన్యతనిస్తూ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకు వ్యాలీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చేయూతనివ్వనుంది.

రాజధాని అమరావతికి...

రాజధాని అభివృద్ధి పనుల కోసం గతంలో ప్రకటించిన విధంగా రూ.15,000 కోట్ల రుణ సహాయం అందుబాటులో ఉంది.
బడ్జెట్ అనంతరం వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ దేశంలో మిగతా రాష్ట్రాల నుంచి రైల్వే కారిడార్లు ఏర్పాటు చేసిన కేంద్రం.. కొత్తగా ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్‌కు హైస్పీడ్‌ రైల్వే కారిడార్‌ ఏర్పాటు చేయలేదని విమర్శించారు.

విశాఖ–చెన్నై, విశాఖ–బెంగళూరుకు రైల్వే కారిడార్లు ఏర్పాటు చేసుకుంటే ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండేదన్నారు. ఈ విషయాల్లో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. ఈ రెండు అంశాలపై తాము కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. బడ్జెట్‌లో టూరిజానికి పెద్దపీట వేయడం, ఇందులో అరకు వ్యాలీ అభివృద్ధికి కేంద్రం చేయూతనివ్వడం అభినందనీయమని పేర్కొన్నారు.
ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి మాట్లాడుతూ బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌ను కేంద్రం పూర్తిగా నిరాశపరిచిందని చెప్పారు. పోలవరం, జలజీవన్, పీఎంజేఎస్‌వై పథకాలకు పూర్తిగా నిధులు తగ్గించారని మండిపడ్డారు. జీరాంజీ పథకానికి రూ.58 వేల కోట్లు కోత వేశారని చెప్పారు. ఈ స్కీంను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కంకణం కట్టుకుందని విమర్శించారు. రాష్ట్రాలు 40 శాతం భరించే పరిస్థితులు లేవని, కేంద్రం వాటా కుదిస్తే ఇది నిర్వీర్యం అవుతుందని ఆ రోజు బిల్లు పాస్‌ చేసినప్పుడు పార్లమెంట్‌లో వైఎస్సార్‌సీపీ తరఫున తాను చెప్పినట్లు గుర్తు చేశారు.
ఏపీ పునరి్వభజన చట్టంలో... పోలవరాన్ని తాము నిర్మిస్తామని, ఇందుకు రూ.57 వేలకోట్లు గ్రాంటు ఇస్తున్నామని కేంద్రం పొందుపరిచిందని చెప్పారు. గత బడ్జెట్‌లో ఎత్తు తగ్గించి, నిధులు తగ్గించారన్నారు. దాదాపు రూ.27 వేల కోట్లు తగ్గించినా, ఎత్తు తగ్గించినా చంద్రబాబు ప్రభుత్వం నోరు మెదపడం లేదని విమర్శించారు. పోలవరానికి ఏటా ఇలా నిధులు తగ్గించుకుంటూపోతే ఆ స్వప్నం ఎప్పుడు సాకారమవుతుందని ప్రశ్నించారు. రూ.30 వేల కోట్లలో రూ.3,320 కోట్లే కేటాయించారన్నారు.
కేంద్రం చంద్రబాబుకు అప్పులు చేసుకునే స్వేచ్ఛను ఇవ్వబట్టే.. పోలవరం విషయంలో తలొగ్గుతున్నారని దుయ్యబట్టారు. అమరావతి పేరుతో రూ.15 వేల కోట్లు అప్పు చేయడమేగాక.. మళ్లీ కొత్త అప్పులు తెచ్చారని తెలిపారు. చంద్రబాబు 21 నెలల్లో రూ.3.5 లక్షల కోట్ల అప్పు చేశారని విమర్శించారు. గత పాలనలో వైఎస్‌ జగన్‌ ఐదేళ్లలో రూ.3.32 లక్షల కోట్ల అప్పుచేస్తే రాష్ట్రం శ్రీలంక, సోమాలియా అవుతుందని వ్యాఖ్యలు చేసిన వారంతా ఇప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నించారు.

పోలవరం పూర్తికి మరో పదేళ్లు?

ఎంపీ పిల్లి సుభాష్చంద్రబోస్‌ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు శ్రద్ధలేదని ఈ బడ్జెట్‌ ద్వారా మరోసారి తేటతెల్లమైందని విమర్శించారు. ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు మాటలు వింటుంటే అక్కడ నీరు ఏరులై పారుతున్నట్లు అనిపిస్తోందని ఎద్దేవా చేశారు. పోలవరం ఎత్తు తగ్గింపులో కూడా చంద్రబాబు, ఆయన టీం నోరు మెదపలేదని విమర్శించారు.
Read More
Next Story