తక్షణమే సిరియాను వీడండి.. భారతీయులకు కేంద్రం ఆదేశాలు
x

తక్షణమే సిరియాను వీడండి.. భారతీయులకు కేంద్రం ఆదేశాలు

అంతర్యుద్దంలో చిక్కుకున్న సిరియాలో ఉన్న భారతీయుల తక్షణమే ఆ దేశం వీడాలని భారత విదేశాంగ శాఖ ఆదేశాలు జారీ చేసింది. టర్కీ మద్ధతు ఉన్న తిరుగుబాటుదారులు..


అంతర్యుద్ధంతో అల్లకల్లోలంగా మారిన సిరియాలో ఉన్న భారతీయులు తక్షణమే ఆ దేశం వీడి సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. తమ తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ తిరిగి సిరియా చేరుకోవద్దని అర్థరాత్రి పలు సూచనలు చేసింది. అలాగే ఆ దేశం వెళ్లాలని భావిస్తున్న ప్రయాణికులు కూడా ప్రస్తుతం వాయిదా వేసుకోవాలని కోరింది.

ప్రస్తుతం సిరియాలో ఉన్న భారతీయులు డమాస్కస్‌లోని భారత రాయబార కార్యాలయంతో టచ్‌లో ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్, ఇమెయిల్ IDని అందజేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది.
సిరియా నుంచి నిష్క్రమించగలిగే వారు కమర్షియల్ ఫ్లైట్‌ల ద్వారా వీలైనంత త్వరగా వెళ్లాలని గట్టిగా సిఫార్సు చేసింది. నిష్క్రమించలేని వారికి, గరిష్టంగా జాగ్రత్త తీసుకోవాలని, బయటి ప్రదేశంలో కదలికలను తగ్గించాలని, వ్యక్తిగత భద్రతకు ప్రాధాన్యతనివ్వాలని సూచించింది. ఈ మేరకు హెల్ప్ లైన్ నంబర్ +963 993385973 ను విడుదల చేసింది. దీనికి వాట్సాప్ కూడా అందుబాటులో ఉందని పేర్కొంది. అత్యవసర ఇమెయిల్ ID: hoc.damascus@mea.gov.in పేర్కొంది.
పరిస్థితి ఆందోళనకరంగా ఉంది
టర్కీ మద్దతు ఉన్న సున్నీ తిరుగుబాటు గ్రూపులు, మిలీషియాల నుంచి రష్యా, ఇరాన్-మద్దతుతో ప్రభుత్వం నడుపుతున్న అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్ పాలనను సవాల్ చేస్తున్నాయి. సిరియా నిజానికి సున్నీ మెజారిటీ ఉన్న దేశం.. కానీ పాలకుడు అసద్ షియా వర్గానికి చెందిన వారు. కొన్ని ప్రాంతాల్లో షియాలదే ఆధిపత్యం.
2011 లో సంభవించిన అరబ్ జాస్మిన్ విప్లవం తరువాత దేశంలో ఐసిస్ ఉద్భవించడానికి కారణమైంది. తరువాత ఇరాన్, రష్యా సాయంతో సమర్థవంతంగా ఈ భయానక ఉగ్రవాద సంస్థను తుదముట్టించిన అసద్ తరువాత పాలనలో సున్నీ గ్రూపులు లేకుండా తగు చర్యలు తీసుకున్నారు. ఇది తరువాత సున్నీ గ్రూపులలో తీవ్ర అసహనానికి దారి తీసింది.
ఈ గ్రూపులను టర్కీ చేరదీసి ఆయుధ సాయం అందించింది. ప్రస్తుతం రాయిటర్స్ నివేదిక ప్రకారం, తిరుగుబాటు శక్తులు అలెప్పో, హమా వంటి కీలక నగరాలను స్వాధీనం చేసుకుని, హోంస్ వైపు దూసుకుపోతున్నాయి, తద్వారా దేశంలోని మధ్య ప్రాంతాలపై అసద్ నియంత్రణ లేకుండా పోయింది. ఇవి ఇలాగే వేగంగా దాడులు చేస్తే మరో 20 రోజుల్లో రాజధాని డమాస్కస్ ను చేరుకుంటాయని అంచనాలు ఉన్నాయి. తిరుగుబాటుదారులతో పోరాడలేక ప్రభుత్వం బలగాలు పారిపోతున్నాయి.
అప్పట్లో రష్యా, ఇరాన్
ఐసిస్ ఇలాగే విజృంభించినప్పుడు ఇరాన్, రష్యాలు అసద్ కు సాయం అందించాయి. రష్యా భారీ ఎత్తున ఆయుధాలు, కొంత సైన్యాన్ని పంపింది. అలాగే ఇరాన్ కూడా షియా మిలిషియాను రంగంలోకి దింపింది. ఐసిస్ దాడులను నిలువరించడమే కాదు ఏకంగా తుదముట్టించడంలో అవి సాయం చేశాయి.
కానీ ప్రస్తుతం పరిస్థితి అలా లేదు. కొన్ని రోజుల క్రితం సిరియా అధ్యక్షుడు అసద్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తమకు సైనిక సాయం చేయాలని తదనుగుణంగా తమ దేశంలో హమాస్, హిజ్బుల్లా శక్తులు అణచివేస్తామని, ఇరాన్ గ్రూపు నుంచి బయటకు వస్తామని కూడా హంగరీ ద్వారా సమాచారం ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. కానీ దీనిపై టెల్ అవీవ్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
ఐక్యరాజ్యసమితి ప్రకారం, భయానక దాడుల వల్ల నవంబర్ 27 నుంచి దాదాపు 2,80,000 సురక్షిత ప్రాంతాలకు పారిపోయారు.



Read More
Next Story