ఆర్భీఐకు కొత్త గవర్నర్ ను నియమించిన కేంద్రం
రేపటితో ముగియనున్న ప్రస్తుత గవర్నర్ శక్తికాంత దాస్ పదవీకాలం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తదుపరి గవర్నర్‌గా రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రాను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత గవర్నర్ గా ఉన్న శక్తికాంత దాస్ పదవీ కాలం రేపటితో ముగియనున్న నేపథ్యంలో ప్రభుత్వం మల్హోత్రాను నియమించింది. ఈ నియామకానికి కేబినెట్ నియామకాల కమిటీ సోమవారం ఆమోదం తెలిపింది. శక్తికాంత దాస్ ఇంతకుముందు రెండు సార్లు ఆర్బీఐ గవర్నర్ గా విధులు నిర్వహించారు.
మల్హోత్రా 1990 బ్యాచ్ రాజస్థాన్ కేడర్‌కు చెందిన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్. ఆయన కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) నుంచి కంప్యూటర్ సైన్స్‌లో పట్టభద్రుడు. USAలోని ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయం నుంచి పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ చేశారు.
మల్హోత్రా పవర్, ఫైనాన్స్, టాక్సేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గనులు మొదలైన వివిధ రంగాలలో పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఆర్థిక మంత్రిత్వ శాఖలో కార్యదర్శి (రెవెన్యూ)గా ఉన్నారు. ఇంతకుముందు భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ కింద ఆర్థిక సేవల విభాగంలో కార్యదర్శి గా పనిచేశారు.
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలలో ఆర్థిక మరియు పన్నుల విషయంలో ఆయనకు విస్తృత అనుభవం ఉంది. అలాగే ప్రత్యక్ష, పరోక్ష పన్నుల కోసం పన్ను కొత్త విధానాన్ని రూపొందించడంలో అతను కీలక పాత్ర పోషిస్తున్నాడు.
Next Story