
జనసేన కార్యకర్తలు తనను కొట్టారంటూ ఫిర్యాదు చేసిన మహిళా ఉద్యోగిని
రోడ్డెక్కిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్, 'ఆమె'ను ఉరికించి కొట్టిన అనుచరులు !
ఎమ్మెల్యే ముందే జనసేన నేత వీరంగం.. మహిళా ఉద్యోగినీ, ఆమె అనుచరుణ్ణి ఉరికించి కొట్టిన ఎమ్మెల్యే అనుచరులు
జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై లైంగిక ఆరోపణలు చేసిన ప్రభుత్వ మహిళా ఉద్యోగినిపై ఎమ్మెల్యే అనుచరులు దాడికి దిగారు. అమరావతి రాజధాని బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందిన వేళ.. రైల్వేకోడూరులో బీభత్సం జరిగినట్టు తెలుస్తోంది. శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసుల ముందే, వారి చేతిలోని లాఠీలను లాక్కొని మరీ జనసేన నాయకులు దౌర్జన్యం చేసినట్టు ఇప్పుడు సోషల్ మీడియాలో హోరెత్తుతోంది. ఒక మహిళపై, ఆమెతో ఉన్న వ్యక్తిపై నడిరోడ్డుపై జరిగిన ఈ దాడి.. రేపు మరెన్ని మలుపులు తిరుగుతుందోనన్న ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
గురువారం రాత్రి అమరావతి బిల్లు ఆమోదంపై కూటమి నేతలు సంబరాలు జరుపుకుంటున్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్, జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర తమ కార్యకర్తలతో కలిసి ప్రధాన రహదారిపైకి వచ్చారు. అదే సమయంలో, గతంలో ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన ఓ మహిళ, తన న్యాయవాది సోదరుడు గోపితో కలిసి టోల్‌గేట్ సమీపంలోని పూల దుకాణం వద్ద కనిపించడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది.
పోలీసుల చేతిలో లాఠీ లాక్కొని మరీ దాడి
ఆమెను చూడగానే నిగ్రహం కోల్పోయిన జనసేన కార్యకర్తలు, నాయకులు ఆమెపైకి దూసుకెళ్లారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులు అడ్డుకుంటున్నప్పటికీ, ఏమాత్రం లెక్కచేయకుండా తాతంశెట్టి నాగేంద్ర ఏకంగా ఒక కానిస్టేబుల్ చేతిలోని లాఠీని బలవంతంగా లాక్కోవడం గమనార్హం. ఆ లాఠీతో ఎమ్మెల్యేతో అక్రమ సంబంధం ఉందని చెప్పిన మహిళపైన, ఆమెతో ఉన్న గోపిపై విచక్షణారహితంగా దాడి చేశారు. "ఊరు వదిలి వెళ్ళిపోవాలి" అంటూ గోపిని రోడ్డుపై పరిగెత్తించి మరీ కొట్టినట్టు సమాచారం.
కారులోనే ఉండి చూస్తున్న ఎమ్మెల్యే..
ఈ దౌర్జన్యం అంతా జరుగుతున్నంత సేపూ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తన కారులోనే ఉండి మౌనంగా చూస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అటుగా వెళ్తున్న వారు, బాధితులు ప్రాధేయపడుతున్నా ఆయన స్పందించకపోవడం చర్చనీయాంశమైంది. మరోవైపు, ఈ దారుణాన్ని చిత్రీకరిస్తున్న ఒక విలేకరిపై కూడా నేతలు ప్రతాపం చూపారు. అతడిని కొట్టి, మొబైల్‌లోని వీడియో ఫుటేజీని బలవంతంగా డిలీట్ చేయించడం గమనార్హం.
మున్ముందు ఏ మలుపు తిరగనుంది?
తమ కళ్ల ముందే లాఠీ లాక్కొని దాడి చేస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేపై ఉన్న లైంగిక ఆరోపణల కేసు కోర్టులో ఉండగా, ఇప్పుడు బాధితురాలిపై బహిరంగంగా దాడి జరగడం ఈ కేసును మరింత జటిలం చేసే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, పోలీసులు కేసు నమోదు చేసే ప్రక్రియను వేగవంతం చేశారు. అధికార పార్టీ అండతోనే ఇటువంటి అరాచకాలు జరుగుతున్నాయని స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు.
నేపథ్యం ఇదీ...
జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మీద ప్రభుత్వ ఉద్యోగిని అయిన ఓ వివాహిత సంచలన ఆరోపణలు చేశారు. ఫేస్‌బుక్ సాయంతో కలిగిన పరిచయాన్ని అరవ శ్రీధర్ ఆసరాగా చేసుకుని.. తనను వాడుకుని మోసం చేశారని ఆరోపించారు. తన కోరిక తీర్చకుంటే తన కొడుకును చంపేస్తానని బెదరించారని.. కారులో తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపించారు. తాను గర్భం దాల్చితే అబార్షన్ చేయించుకోమని బెదిరించారని.. అంగీకరించకపోయేసరికి పెళ్లి చేసుకుంటానని నమ్మించారని అన్నారు. తన భర్తకు కూడా ఫోన్ చేసి విడాకులు ఇవ్వాలని బెదిరించారని.. ఏడాదిన్నర కాలంలో ఐదుసార్లు అబార్షన్ చేయించారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
Next Story

