కుల మతాల మధ్య చిచ్చు? జోగి రమేష్‌పై బిగిస్తున్న ఉచ్చు
x

కుల మతాల మధ్య చిచ్చు? జోగి రమేష్‌పై బిగిస్తున్న ఉచ్చు

మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత జోగి రమేష్‌పై ఇబ్రహీంపట్నం పోలీసులు అత్యంత కఠినమైన సెక్షన్లతో కేసు నమోదు చేశారు.


ఏపీ రాజకీయాల్లో మాటల యుద్ధం కాస్తా పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత జోగి రమేష్‌పై ఇబ్రహీంపట్నం పోలీసులు అత్యంత కఠినమైన సెక్షన్లతో కేసు నమోదు చేశారు. కేవలం రాజకీయ విమర్శలే కాకుండా, సమాజంలో కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టేలా ప్రసంగించారనే తీవ్ర ఆరోపణలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

అసలు ఏమిటా చిచ్చు.. ఏమా కథ?

మంత్రి నారా లోకేశ్‌ను లక్ష్యంగా చేసుకుని జోగి రమేష్ చేసిన ఘాటు వ్యాఖ్యలు కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాలేదని, అవి సమాజంలోని వివిధ వర్గాల మధ్య విద్వేషాన్ని రగిల్చేలా ఉన్నాయని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మంత్రిపై వ్యక్తిగత దూషణలకు దిగడంతో పాటు, ఉద్దేశపూర్వకంగా కుల మత ప్రస్తావనలు తీసుకువస్తూ ప్రజలను రెచ్చగొట్టారనేది ఆయనపై ఉన్న ప్రధాన అభియోగం. ఈ నేపథ్యంలోనే ఆయనపై Cr.No.64/2026 కింద అత్యంత పదునైన Section 196 BNS (మత, జాతి, కుల ప్రాతిపదికన వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచడం) ను ప్రయోగించారు. దీనికి తోడు ప్రభుత్వ అధికారి విధులకు ఆటంకం కలిగించడం వంటి అభియోగాలతో కూడిన 353 r/w 3(5) BNS (గతంలో ఇవి 153A, 505 IPC) సెక్షన్లను కూడా జోడించడంతో జోగి రమేష్ చుట్టూ న్యాయపరమైన ఉచ్చు గట్టిగానే బిగుస్తోంది.

హెడ్ కానిస్టేబుల్ ఫిర్యాదుతో మరో అనూహ్య ట్విస్ట్

ఇబ్రహీంపట్నం ఘర్షణల పర్వంలో పోలీసుల ఎంట్రీతో కథ సరికొత్త మలుపు తిరిగింది. జోగి రమేష్ నివాసంపై దాడి జరిగిన వెంటనే అక్కడకు చేరుకున్న వైసీపీ శ్రేణులు, అదుపు తప్పి పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఇబ్రహీంపట్నం హెడ్ కానిస్టేబుల్ స్వయంగా ఫిర్యాదు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ ఫిర్యాదు ఆధారంగా ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాశ్, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, మాజీ ఏఎంసీ ఛైర్మన్ మస్తాన్ వంటి కీలక నేతలపై Cr.No.67/2026 కింద పోలీసులు కేసు ఫైల్ చేశారు. విధుల్లో ఉన్న ప్రభుత్వ సిబ్బందిని అడ్డుకోవడమే కాకుండా, ఉద్రిక్త పరిస్థితుల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించారనే ప్రధాన అభియోగంతో ఈ నేతలను ఎఫ్ఐఆర్‌లో చేర్చడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

దాడి చేసిన వారిపై సుమోటో కేసు

మరోవైపు.. ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి నివాసాన్ని రణరంగంగా మార్చిన వారిని కూడా పోలీసులు వదిలిపెట్టలేదు. జోగి రమేష్ నివాసంపై జరిగిన దాడి, దహనకాండను తీవ్రంగా పరిగణించిన ఇబ్రహీంపట్నం ఎస్ఐ సత్యవతి, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తిస్తూ స్వయంగా సుమోటోగా కేసు (Cr.No.66/2026) నమోదు చేశారు. ఈ విధ్వంసకాండలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు భావిస్తున్న టీడీపీ కార్యకర్తలు కాకి నాగరాజు, గణపతి, మేసిపాము బాబూరావులతో పాటు మరికొందరిపై పోలీసులు కేసుల పంజా విసిరారు. ప్రైవేట్ ఆస్తుల్లోకి అక్రమంగా చొరబడటం (Trespassing), భారీ ఎత్తున ఆస్తులను ధ్వంసం చేయడం వంటి తీవ్రమైన అభియోగాలతో కూడిన సెక్షన్ల కింద వీరిని ఎఫ్ఐఆర్‌లో చేర్చడం గమనార్హం. సీసీటీవీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా విచారణను వేగవంతం చేసిన పోలీసులు, త్వరలోనే మరిన్ని అరెస్టులు ఉండే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చారు. జోగి రమేష్‌పై నమోదైన 196 BNS సెక్షన్ అత్యంత కఠినమైనదని, ఇది నిరూపితమైతే రాజకీయంగా ఆయనకు తీవ్ర ఇబ్బందులు తప్పవనే చర్చ జోగి రమేష్ అనుచరుల్లో వినిపిస్తోంది. ఒకవైపు ఆయన ఇంటిపై దాడి జరిగినా, మరోవైపు ఆయన చేసిన వ్యాఖ్యలే ఈ మొత్తం అల్లర్లకు మూలమని పోలీసులు కేసుల్లో పేర్కొనడం గమనార్హం.

Read More
Next Story