టోల్ గేట్ల వద్ద నగదు చెల్లింపులు బంద్
x

టోల్ గేట్ల వద్ద నగదు చెల్లింపులు బంద్

ఎప్పటి నుంచి అంటే.. ఫాస్ట్ ట్యాగ్ రీచార్జ్ చేయించుకోకపోతే అవస్థలే..


దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు అలర్ట్. టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపుల (Cash Payments) విధానానికి స్వస్తి పలుకుతూ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నాలుగు రోజుల్లో, అంటే ఏప్రిల్ 10 నుండి అన్ని టోల్ ప్లాజాలు 100% డిజిటల్ చెల్లింపుల మోడ్‌లోకి మారనున్నాయి.
ముఖ్యమైన మార్పులు ఇవే..
టోల్ బూత్‌ల వద్ద నగదు తీసుకునే కౌంటర్లు పూర్తిగా మూతపడతాయి. ప్రతి వాహనానికి ఫాస్ట్‌ట్యాగ్ (FASTag) ఉండటం ఇప్పుడు అనివార్యం.

ఫాస్ట్‌ట్యాగ్ లేని వారు యూపీఐ ద్వారా చెల్లించవచ్చు, కానీ వారు 25 శాతం అదనపు బాదుడు (సర్ఛార్జ్)కి సిద్ధపడాలి.
ఏమిటీ దీనివల్ల లాభం..
టోల్ ప్లాజాల వద్ద చిల్లర కోసం వేచి చూడాల్సిన అవసరం ఉండదు. వాహనాలు ఆగకుండా స్కాన్ అయి వెళ్లిపోవడం వల్ల ప్రయాణ సమయం తగ్గుతుంది. ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర ఉండే ట్రాఫిక్ జామ్‌లకు చెక్ పడుతుంది. తద్వారా ఇంధనం (Fuel) కూడా ఆదా అవుతుంది. డిజిటల్ చెల్లింపుల వల్ల ప్రతి పైసా లెక్క ఆన్‌లైన్‌లో ఉంటుంది. టోల్ వసూళ్లలో అవకతవకలకు తావుండదు.
వాహనాలు ఎక్కువ సేపు ఇంజిన్ ఆన్ చేసి నిలబడాల్సిన అవసరం లేకపోవడంతో కాలుష్యం తగ్గుతుంది. కాగితపు రశీదుల వాడకం కూడా తప్పుతుంది.
ఏమేమి ఇబ్బందులు ఉండవచ్చు..
ఫాస్ట్‌ట్యాగ్ లేని వారు లేదా ట్యాగ్‌లో బ్యాలెన్స్ లేని వారు యూపీఐ వాడితే 25% ఎక్కువ చెల్లించాల్సి రావడం సామాన్యులకు భారమే. కొన్నిసార్లు స్కానర్లు పని చేయకపోవడం లేదా నెట్‌వర్క్ సమస్యల వల్ల ఫాస్ట్‌ట్యాగ్ స్కాన్ కాకపోతే వాహనదారులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. స్మార్ట్‌ఫోన్ వాడకం లేదా ఆన్‌లైన్ రీఛార్జ్‌లపై అవగాహన లేని గ్రామీణ ప్రాంత డ్రైవర్లకు ఈ కొత్త నిబంధన కాస్త ఇబ్బందికరంగా మారవచ్చు.
రీఛార్జ్ మర్చిపోతే చిక్కులే...
హైవే ఎక్కాక ఫాస్ట్‌ట్యాగ్ బ్యాలెన్స్ అయిపోయిందని తెలిస్తే, అప్పటికప్పుడు రీఛార్జ్ అవ్వడానికి సమయం పడితే వెనుక ఉన్న వాహనదారుల నుండి ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుంది.
రవాణా వ్యవస్థను ఆధునీకరించే క్రమంలో NHAI తీసుకున్న ఈ నిర్ణయం దీర్ఘకాలంలో ప్రయాణికులకు మేలు చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. అయితే, సాంకేతిక లోపాలు తలెత్తకుండా ప్లాజాల వద్ద పటిష్టమైన నెట్‌వర్క్ సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.
Read More
Next Story