
వైద్యం కోసం వచ్చి..డాక్టర్‌ని హత్య చేసి
కళ్లముందే భర్తను కిరాతకంగా చంపడాన్ని చూసిన కోటిరెడ్డి భార్య తీవ్ర దిగ్భ్రాంతికి గురై స్పృహ కోల్పోయారు.
రోగుల ప్రాణాలు కాపాడాల్సిన వైద్యుడినే.. వైద్యం కావాలంటూ వచ్చిన కిరాతకులు బలితీసుకున్న దారుణ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. అద్దంకి మండలం ధర్మవరంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ హత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కిరాతకుల చేతిలో ఎం. కోటిరెడ్డి (47) అనే ఆర్‌ఎంపీ వైద్యుడు దుర్మరణం చెందారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అద్దంకి మండలం ధర్మవరం గ్రామానికి చెందిన కోటిరెడ్డి గత కొంతకాలంగా స్థానికంగా ఆర్‌ఎంపీ వైద్యుడిగా సేవలందిస్తున్నారు. ఎప్పటిలాగే శనివారం విధులు ముగించుకుని రాత్రి ఇంటికి వెళ్లిన ఆయన, కుటుంబ సభ్యులతో కలిసి నిద్రపోయారు. అయితే, ఆదివారం వేకువజామున గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు కోటిరెడ్డి ఇంటి తలుపు తట్టారు. తమకు వైద్యం కావాలని, అత్యవసరమని నమ్మబలికారు.
వైద్య వృత్తిలో ఉన్న కోటిరెడ్డి, రోగికి ఆపదలో ఉన్నారన్న ఉద్దేశంతో ఏమాత్రం ఆలోచించకుండా తలుపు తీశారు. అయితే, తలుపు తీసిన వెంటనే మాస్కులు ధరించిన ఆ ముగ్గురు దుండగులు కోటిరెడ్డిపై విచక్షణ రహితంగా దాడికి దిగారు. తమ వెంట తెచ్చుకున్న కర్రలతో తల, ఒంటిపై బలంగా బాదారు. ఈ ఆకస్మిక దాడితో కోటిరెడ్డి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. తీవ్ర గాయాలైన ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.
కళ్లముందే భర్తను కిరాతకంగా చంపడాన్ని చూసిన కోటిరెడ్డి భార్య తీవ్ర దిగ్భ్రాంతికి గురై స్పృహ కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పాత కక్షల కారణంగానే ఈ హత్య జరిగిందా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. దర్శి డీఎస్పీ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

