
డిప్యూటీ సీఎం లేకుండానే మంత్రివర్గ భేటీ
కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసే పనిలో పవన్ కళ్యాణ్ ఢిల్లీలో బిజీ బిజీగా ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై బుధవారం ఒక అరుదైన, ఆసక్తికర దృశ్యం ఆవిష్కృతమైంది. రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అత్యంత కీలకమైన మంత్రివర్గ సమావేశం (Cabinet Meeting) జరుగుతుండగా.. కూటమి ప్రభుత్వంలో పవర్ ఫుల్ భాగస్వామి, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాత్రం ఆ భేటీకి దూరంగా ఉన్నారు. రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఈ భేటీకి ఆయన గైర్హాజరు కావడం ఒకెత్తయితే, అదే సమయంలో ఆయన దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌లతో వరుస భేటీలు జరుపుతుండటం మరో ఎత్తు. ఏపీలో బడ్జెట్ ముహూర్తాలు ఖరారవుతున్న వేళ, ఢిల్లీ గడపపై పవన్ కల్యాణ్ కేంద్ర ప్రభుత్వ పెద్దలతో భేటీ అనేది ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఢిల్లీలో పవన్ కళ్యాణ్ బిజీ బిజీ..
అమరావతిలో మంత్రివర్గ సహచరులు బడ్జెట్ లెక్కల్లో మునిగిపోతే.. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాత్రం దేశ రాజధాని ఢిల్లీ వీధుల్లో బిజీ బిజీగా గడిపేస్తున్నారు. కీలకమైన మంత్రి వర్గ సమావేశంలో పాల్గొనకుండా ఢిల్లీ పర్యటన చేయడమేంటనే చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. అయితే కేవలం ఒక కేబినెట్ భేటీకి పరిమితం కాకుండా, కేంద్రంతో ముడిపడి ఉన్న చిక్కుముడులను విప్పడమే లక్ష్యంగా ఆయన తన హస్తిన పర్యటనలో ఉన్నారని, అందులో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయి రాష్ట్ర భద్రత, విభజన హామీలపై చర్చించడంతో పాటు, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వద్ద పెండింగ్‌లో ఉన్న కీలక ప్రాజెక్టులకు క్లియరెన్స్ తీసుకురావడమే పవన్ ప్రధాన ఎజెండా గా ఢిల్లీ పర్యటనల పవన్ కల్యాణ్ ఉన్నట్లు జనసేన శ్రేణులు చర్చించుకుంటున్నారు. ఇక్కడ కేబినెట్ భేటీ కంటే, అక్కడ కేంద్ర పెద్దల మనసు గెలవడమే ఏపీ అభివృద్ధికి అసలైన మార్గమని పవన్ భావించినట్లు ఆయన పార్టీ నేతల్లో చర్చ వినిపిస్తోంది. పవన్ కల్యాణ్ చేస్తున్న ఈ ఢిల్లీ రాయబారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
అమరావతి కేబినెట్ అజెండా ఇదే
బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. అయితే ఈసారి కేబినెట్ అజెండా కేవలం చర్చలకే పరిమితం కాలేదు, రాష్ట్ర భవిష్యత్తును మార్చే పక్కా వ్యూహాలతో సిద్ధమైంది. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారు చేయడం నుంచి, కొత్త పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూ కేటాయింపుల వరకు కీలక ఫైళ్లపై సంతకాలు పడనున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వంపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టేలా కౌంటర్ అటాక్ వ్యూహాలపై మంత్రులకు సీఎం పదునైన దిశానిర్దేశం చేస్తున్నారు. కేవలం ప్రస్తుత సమస్యలే కాకుండా, విజన్ 2047 లక్ష్యంగా పాలనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి అత్యాధునిక సాంకేతికతను ఎలా వాడాలనే దానిపై ఈ భేటీలో ఒక రోడ్ మ్యాప్ సిద్ధం కానుంది. ఒకవైపు పవన్ ఢిల్లీలో చక్రం తిప్పుతుంటే, మరోవైపు చంద్రబాబు అమరావతిలో కేబినెట్ సమావేశం నిర్వహించడం రాష్ట రాజకీయాల్లో హాట్ టాపిక్ గానే మారింది.
గ్యాప్ లేదు..
కేబినెట్ భేటీలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీటు ఖాళీగా కనిపించగానే రాజకీయ వర్గాల్లో రకరకాల చర్చలు మొదలయ్యాయి. గతంలో కొన్నిసార్లు ఆరోగ్య కారణాల రీత్యా ఆయన హాజరు కాలేకపోయినప్పటికీ, ఈసారి గైర్హాజరు వెనుక ఒక బలమైన స్ట్రాటజీ ఉందన్నది పార్టీ వర్గాల మాట. ఇది ఇద్దరు నేతల మధ్య గ్యాప్ కాదు.. రాష్ట్రం కోసం చేసుకున్న పక్కా పని విభజన అని కూటమి వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో పాలనా యంత్రాంగాన్ని పరుగెత్తిస్తుంటే, పవన్ కల్యాణ్ ఢిల్లీ వేదికగా కేంద్రం నుంచి నిధులు, ప్రాజెక్టులను రాబట్టే మిషన్‌లో బిజీగా ఉన్నారని, పాలనాపరమైన ప్రాధాన్యతలే తప్ప, ఈ గైర్హాజరు వెనుక మరే ఇతర కారణం లేదని, ఇద్దరు నేతల మధ్య సమన్వయం ఫెవికాల్ బంధంలా పటిష్టంగా ఉందని పార్టీ శ్రేణులు నొక్కి చెబుతున్నాయి.
Next Story

