నంద్యాల జిల్లాలో మృత్యుఘోష.. ముగ్గురు సజీవ దహనం
x

నంద్యాల జిల్లాలో మృత్యుఘోష.. ముగ్గురు సజీవ దహనం

ఓ డీసీఎం డ్రైవర్ వెంటనే స్పందించి తన వాహనాన్ని ఆపి, బస్సు అద్దాలను పగులగొట్టాడు. దీంతో ప్రయాణికులు కిటికీల గుండా బయటకు దూకేయడంతో పెను ప్రాణనష్టం తప్పింది.


గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులను మృత్యువు కబళించబోయింది.. ఒక్కసారిగా టైరు పేలిన శబ్దం, ఆ వెంటనే వాహనాల రాపిడితో చెలరేగిన అగ్నిప్రళయం ఆ ప్రాంతాన్ని భీతావహంగా మార్చింది. నంద్యాల జిల్లా శిరివెళ్లమెట్ట వద్ద బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అగ్ని కీలలు ముగ్గురిని సజీవ దహనం చేశాయి. నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు టైరు పేలి, నియంత్రణ కోల్పోయి డివైడర్‌ను దాటుకుంటూ వెళ్లి ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న మరుక్షణమే రెండు వాహనాలు అగ్నిగుండాలుగా మారగా.. బస్సు డ్రైవర్ తో పాటు లారీలో ఉన్న డ్రైవర్, క్లీనర్ మంటల్లో చిక్కుకుని గుర్తుపట్టలేనంతగా కాలిపోయారు. సరిగ్గా అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ డీసీఎం డ్రైవర్ సాహసం చేయడంతో 36 మంది ప్రయాణికులు మృత్యు ముఖం నుంచి తృటిలో బయటపడ్డారు.

టైరు పేలడంతో మొదలైన మృత్యుఘోష

పోలీసుల కథనం ప్రకారం.. నెల్లూరు నుంచి 36 మంది ప్రయాణికులతో హైదరాబాద్‌కు వెళ్తున్న ఏఆర్‌బీసీవీఆర్‌ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బుధవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో శిరివెళ్ల మండలం శిరివెళ్లమెట్ట వద్దకు చేరుకుంది. ఒక్కసారిగా బస్సు టైరు పేలడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో బస్సు వేగంగా డివైడర్‌ను దాటి రోడ్డు అవతలి వైపు ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని బలంగా ఢీకొట్టింది.

మంటల్లో ముగ్గురి ప్రాణాలు బలి

ఢీకొన్న వెంటనే వాహనాల్లో మంటలు చెలరేగి వేగంగా విస్తరించాయి. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, లారీ డ్రైవర్, క్లీనర్ మంటల్లో చిక్కుకుని గుర్తుపట్టలేని విధంగా కాలిపోయి అక్కడికక్కడే మృతి చెందారు. మంటల ధాటికి బస్సుతో పాటు లారీ కూడా పూర్తిగా దగ్ధమైంది. ప్రయాణికుల లగేజీ మొత్తం బూడిదైంది.

దేవుడిలా వచ్చిన డీసీఎం డ్రైవర్

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులు ప్రాణభయంతో కేకలు వేశారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ డీసీఎం డ్రైవర్ వెంటనే స్పందించి తన వాహనాన్ని ఆపి, బస్సు అద్దాలను పగులగొట్టాడు. దీంతో ప్రయాణికులు కిటికీల గుండా బయటకు దూకేయడంతో పెను ప్రాణనష్టం తప్పింది. ఈ క్రమంలో పదిమందికి పైగా ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.

సహాయక చర్యలు

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నంద్యాల సర్వజన ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం పంపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read More
Next Story