బీఎస్‌ఎన్‌ఎల్‌లో VIP కల్చర్‌పై వివాదం..
x

బీఎస్‌ఎన్‌ఎల్‌లో VIP కల్చర్‌పై వివాదం..

ప్రయాగ్‌రాజ్ టూర్‌ను రద్దు చేసుకున్న బీఎస్‌ఎన్‌ఎల్ డైరెక్టర్..


Click the Play button to hear this message in audio format

ప్రజాగ్రహం వెల్లువెత్తిన వెంటనే బీఎస్‌ఎన్‌ఎల్ డైరెక్టర్ ప్రయాగ్‌రాజ్ పర్యటన రద్దయింది. ఇంటర్నల్ నోట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడమే అందుకు కారణం. ఇదే సందర్భంలో నష్టాల్లో ఉన్న సంస్థలో వనరుల వినియోగంపై కూడా పెద్ద చర్చ మొదలైంది.


ఇంతకు ఏం జరిగింది?

బీఎస్‌ఎన్‌ఎల్ డైరెక్టర్ వివేక్‌ బంజల్ బంధు మిత్ర సమేతంగా ప్రయాగ్‌రాజ్‌ సందర్శనకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అధికార విధులతో ఏ మాత్రం సంబంధంలేని పర్యటన ఇది. అయితే తన హోదాను అడ్డుపెట్టుకుని అధికార యంత్రాంగానికి హుకుం జారీ చేశారు. ప్రయాగ్‌రాజ్‌లో అడుగుపెట్టింది మొదలు తాము వెళ్లే ప్రతిచోటా సమకూర్చాల్సిన సేవలను, సిద్ధం చేయాల్సిన ఏర్పాట్లతో కూడిన భారీ చిట్టాను పంపించారు. ఉన్నతాధికారి కావడంతో పదుల సంఖ్యలో సిబ్బందిని అధికారులు పురమాయించాల్సి వచ్చింది. ఈ వ్యవహారమంతా బహిర్గతం కావడంతో కేంద్రం సీరియస్‌ అయ్యింది. షోకాజ్‌ నోటీస్‌ జారీచేసి వివరణ కోరింది. దీంతో ఈ నెల 25, 26 తేదీల్లో జరగాల్సిన వివేక్‌ బంజల్‌ వ్యక్తిగత పర్యటన రద్దయ్యింది.


ఇంటర్నల్ నోట్‌లో ఏముంది?

వివేక్‌ బంజల్, ఆయన బంధుమిత్రులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవడానికి 50 మంది బీఎస్‌ఎన్‌ఎల్‌ సిబ్బందిని కేటాయించాలనే ఆదేశాలు వచ్చాయి. ‘రైల్వేస్టేషన్‌లో దిగగానే స్వాగతం పలకాలి. హోటల్‌ గదులు బుక్‌ చేయాలి. ఆలయ సందర్శనలు, బోట్‌ రైడ్స్‌ను సమన్వయం చేసుకోవాలి. టవల్స్, లోదుస్తులు సహా నూనె, దువ్వెన వంటి వాటితో ‘స్నాన్‌’ కిట్స్‌ సిద్ధం చేయాలి. పురుషులకు, మహిళలకు స్నాన్‌ కిట్స్‌ విడివిడిగా ఉంచాలి. ఆలయాల సందర్శనకు రవాణా సౌకర్యాలు చూసుకోవాలి. ఫొటోలు తీయాలి. వాహనాల్లో వాటర్‌ బాటిల్స్, స్నాక్స్‌ ఉండేలా చూడాలి’.. అంటూ ఓ లిస్టు ఆన్‌లైన్‌లో వెలుగులోకి రావడంతో నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్రం వెంటనే స్పందించింది.

ఈ అంశంపై “AI విత్ సంకేత్” కార్యక్రమంలో అంతర్జాతీయ వినియోగదారుల విధాన నిపుణుడు ప్రొఫెసర్ బెజోన్ కుమార్ మిశ్రా తన అభిప్రాయాలను పంచుకున్నారు.

ఇంత సీనియర్ అధికారి ఇలాంటి సదుపాయాలు ఎలా కోరగలరని మిశ్రా ప్రశ్నించారు. ఇది వ్యక్తిగత తప్పిదం మాత్రమే కాదని, సంస్థాగత సమస్య అని పేర్కొన్నారు. సీఏజీ వంటి సంస్థలు అనవసర ఖర్చులను పదేపదే ఎత్తిచూపుతున్నాయని ఆయన గుర్తుచేశారు. అయినా చర్యలు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. పారదర్శకత, జవాబుదారీతనం తగ్గాయని అన్నారు. ప్రజల సహనం వల్లే ఈ సంస్కృతి కొనసాగుతోందని అభిప్రాయపడ్డారు. పౌరులు తమ హక్కులను వినియోగించి ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్నారు. పైస్థాయిలో మార్పు లేకపోతే క్రింది స్థాయిలో మార్పు ఆశించడం తప్పవుతుందన్నారు.

పబ్లిక్ రిలేషన్స్ ఎక్స్‌పర్ట్ దిలీప్ చెరియన్ ఈ ఘటనను సామాజిక సమస్యగా అభివర్ణించారు. ప్రభుత్వ ఉద్యోగి డిఫాల్ట్‌గా VIP అన్న భావనను మార్చుకోవాలని సూచించారు.

ఇప్పటికే బీఎస్‌ఎన్‌ఎల్ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. 2022లో రూ.1.64 లక్షల కోట్లు, 2023లో రూ.89,047 కోట్లు కేంద్రం నుంచి సాయంగా అందింది. అయినప్పటికీ ఆదాయం, నెట్‌వర్క్ విస్తరణలో ప్రైవేట్ కంపెనీల కంటే వెనుకబడి ఉంది. 4G విస్తరణలో ఆలస్యం జరిగింది. 5Gలోకి పూర్తి స్థాయిలో ప్రవేశించలేదు.

Read More
Next Story