
అమరావతి నిర్మాణానికి బూస్ట్..2,316 కోట్లకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
రూ. 119 కోట్లతో తెలుగు కల్చరల్ సెంటర్ నిర్మాణానికి ఆమోదముద్ర వేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతి మళ్ళీ నిర్మాణ కోలాహలంతో కళకళలాడబోతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం రాజధాని అభివృద్ధిపై అత్యంత కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా, ఆగిపోయిన సచివాలయం, హెచ్‌ఓడీ (HOD) టవర్ల నిర్మాణాన్ని పూర్తి చేసే దిశగా అడుగులు వేసింది. ఈ భవన సముదాయాలలో మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ వంటి కీలక పనుల కోసం ఏకంగా రూ. 2,316 కోట్ల భారీ మొత్తానికి పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఉపాధి కల్పన.. 17వేల మందికి కొత్త వెలుగులు
రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి, ఉపాధి కల్పనకు కేబినెట్ పెద్దపీట వేసింది. దాదాపు 17,000 మంది యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా చిన్న తరహా పరిశ్రమలకు ఊతమిచ్చే నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా 3,500 సూక్ష్మ పరిశ్రమలకు (MSMEs) రూ. 300 కోట్ల ఆర్థిక వనరులను కల్పించే ప్రతిపాదనకు ఆమోదం లభించింది. అలాగే, రాజధాని ప్రాంతంలో వివిధ సంస్థలకు భూకేటాయింపులు చేయడంతో పాటు, రూ. 119 కోట్లతో తెలుగు కల్చరల్ సెంటర్ నిర్మాణానికి ఆమోదముద్ర వేశారు.
మహిళా భద్రత, పోలీసు అప్‌గ్రేడేషన్
పరిపాలన, భద్రతా విభాగాల్లో ప్రభుత్వం కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. పనిచేసే మహిళల కోసం ‘మిషన్ శక్తి కింద క్రెచ్ (శిశు సంరక్షణ) సౌకర్యాలతో కూడిన సఖీ నివాస్ హాస్టళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 300 మంది హెడ్ కానిస్టేబుల్ పోస్టులను రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ (RSI) పోస్టులుగా అప్‌గ్రేడ్ చేస్తూ తీసుకున్న నిర్ణయం పోలీస్ వ్యవస్థను మరింత బలోపేతం చేయనుంది. పోలవరం పనుల కోసం దాదాపు రూ. 50 కోట్ల అదనపు నిధులను కేటాయించడంతో పాటు, కొత్త జిల్లాలను పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ ఆర్డర్‌లో చేర్చే ప్రతిపాదనను కేంద్రానికి పంపాలని కేబినెట్ నిశ్చయించింది.
జలధార.. చివరి ఎకరాకూ సాగునీరు
సాగునీటి రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చేలా ఏప్రిల్ 2 నుండి 90 రోజుల పాటు జలధార అనే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. కాలువలు, డ్రెయిన్లను శుభ్రం చేయించి భూగర్భ జలమట్టాలను పెంచడం దీని ముఖ్య ఉద్దేశ్యం. మే 15 నాటికి సాగునీరు విడుదల చేయాలని, చివరి ఎకరాకు కూడా నీరందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. అలాగే, ఏప్రిల్ 2న వివిధ శాఖల పనితీరుపై తాను నివేదికలు ఇస్తానని, దాని ఆధారంగా ప్రగతి సాధించాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు.
విద్యుత్ డిమాండ్‌పై ప్రత్యేక పర్యవేక్షణ
సమావేశం ముగింపులో గ్యాస్ కొరత, విద్యుత్ వినియోగంపై ఆసక్తికర చర్చ జరిగింది. వంట గ్యాస్ కొరత రాకుండా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను సీఎం ఆదేశించారు. గ్యాస్‌కు బదులుగా ప్రజలు ఎలక్ట్రిక్ స్టవ్‌లు వాడుతుండటంతో విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరుగుతోందని మంత్రి పయ్యావుల కేశవ్ ప్రస్తావించగా, దీనిపై అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు.
Next Story

