ప్రేమజంటలే లక్ష్యంగా బ్లాక్‌మెయిలింగ్
x

ప్రేమజంటలే లక్ష్యంగా బ్లాక్‌మెయిలింగ్

మాచర్ల ఏఎస్సై పై లైంగిక వేధింపుల ఆరోపణలు


రక్షక భటుడే భక్షకుడిగా మారి, రక్షణ ఇవ్వాల్సిన చేతులే వేధింపులకు దిగిన ఘటన పల్నాడు జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించింది. మాచర్లలో పనిచేస్తున్న ఓ ఏఎస్సై (ASI), ఏకాంతంగా గడుపుతున్న జంటలను లక్ష్యంగా చేసుకుని బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నట్లు వెలుగులోకి వచ్చిన ఆరోపణలు పోలీసు శాఖ పరువును బజారున పడేశాయి.

ఆటో డ్రైవర్‌తో కలిసి రహస్య వీడియోల దందా
మాచర్ల నియోజకవర్గ పరిధిలోని పర్యాటక ప్రాంతాలకు వచ్చే ప్రేమికులు, కళాశాల విద్యార్థులే లక్ష్యంగా ఈ ఏఎస్సై తన దందాను సాగిస్తున్నట్లు సమాచారం. జమ్మలమడుగుకు చెందిన ఓ ఆటో డ్రైవర్ సాయంతో జంటలు సన్నిహితంగా ఉన్నప్పుడు రహస్యంగా వీడియోలు తీయిస్తున్నాడు. అనంతరం ఆ వీడియోలను చూపిస్తూ, పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తానంటూ వారిని బెదిరించి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలుకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
లైంగిక వేధింపుల ఆరోపణలు
కేవలం డబ్బులు వసూలు చేయడమే కాకుండా, డబ్బులు ఇవ్వలేని యువతులను ఆ ఏఎస్సై లైంగికంగా వేధిస్తున్నట్లు ఆరోపణలు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. తన కోరిక తీర్చాలంటూ బాధితులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఇటీవల మాచర్లకు చెందిన ఓ వ్యాపారిని సైతం ఇలాగే బెదిరించి పలుమార్లు నగదు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ దందాలో అదే స్టేషన్‌కు చెందిన మరో ఎస్సై, కానిస్టేబుల్‌కు కూడా ప్రమేయం ఉందన్న ఆరోపణలు స్థానికంగా బలంగా వినిపిస్తున్నాయి.
మహిళా కమిషన్ సీరియస్.. ఎస్పీ విచారణకు ఆదేశం
ఈ దందాకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఏపీ మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. మహిళల భద్రతకు ముప్పుగా మారిన ఇలాంటి చర్యలను సహించేది లేదని కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ స్పష్టం చేశారు. ఈ ఘటనపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు.
మరోవైపు పల్నాడు జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు స్పందిస్తూ.. పోలీసు అధికారి ప్రవర్తనపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న వీడియోల ఆధారంగా పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టి, తప్పు చేసిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టబోమని, కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
Read More
Next Story