నోరు జారా, క్షమించమని నటి త్రిషను వేడుకున్న బీజేపీ నేత
x

నోరు జారా, క్షమించమని నటి త్రిషను వేడుకున్న బీజేపీ నేత

ఇంతకీ ఆ బీజేపీ నాయకుడు ఎందుకు క్షమాపణలు చెప్పారంటే..


సినీనటి త్రిషకు బీజేపీ నాయకుడు నాగేంద్రన్ బహిరంగ క్షమాపణలు చెప్పారు. తాను నోరు జారానన్నారు. ఇంతకీ ఆయన ఎందుకు క్షమాపణలు చెప్పారంటే..

తమిళనాట రాజకీయాకు సినీరంగానికి దగ్గర సంబంధం ఉందనేది బహిరంగ రహస్యం. స్టార్ హీరో విజయ్ రాజకీయ రంగప్రవేశం చేసిన తర్వాత ఆయనపై విమర్శల దాడి మొదలైంది. ఆ విమర్శల్లో నటి త్రిష పేరు లాగడంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది.
తమిళనాడు BJP రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ విజయ్‌ను టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యల్లో త్రిష ప్రస్తావన తీసుకురావడం తీవ్ర చర్చకు దారి తీసింది. “ముందుగా త్రిష ఇంటి నుంచి బయటకు రావాలి” అన్న వ్యాఖ్య రాజకీయ విమర్శ కంటే వ్యక్తిగత వ్యాఖ్యలా వినిపించిందన్న అభిప్రాయాలు వెల్లువెత్తాయి.
రాజకీయాల్లో పోటీ పడే నాయకుడిని విమర్శించవచ్చు. కానీ ఒక మహిళా నటిని ఈ వివాదంలోకి లాగడం అవసరమా? అనే ప్రశ్నలు వినిపించాయి. సోషల్ మీడియాలో తీవ్ర స్పందనలు వచ్చాయి. పలువురు ఇది బాధ్యతా రాహిత్య వ్యాఖ్య అని పేర్కొన్నారు.
త్రిష లాయర్ ఏమన్నారంటే..
ఈ నేపథ్యంలో త్రిష లాయర్ నిత్యేష్ నటరాజ్ విడుదల చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో మరింత చర్చకు దారి తీసింది. “ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తి నుంచి ఇటువంటి వ్యాఖ్యలు రావడం ఆశ్చర్యకరం. నా క్లయింట్‌కు రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదు. ఆమె ఎప్పుడూ తటస్థంగానే ఉన్నారు. నటిగా తన ప్రతిభ ద్వారానే గుర్తింపు పొందాలనుకుంటున్నారు. సంబంధం లేని విషయాల్లో ఆమె పేరును లాగొద్దు” అని స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో త్రిష తన గౌరవాన్ని కాపాడుకునే ప్రయత్నం చేసినట్లు సినీ వర్గాలు అభిప్రాయపడ్డాయి.
వెనక్కి తగ్గిన నాగేంద్రన్
వివాదం చెలరేగిన కొద్ది గంటల్లోనే నాగేంద్రన్ స్పందించారు.“ఎవరి మనసును బాధపెట్టే ఉద్దేశం లేదు. పొరపాటున ఆ వ్యాఖ్యలు చేశాను. చింతిస్తున్నాను” అంటూ క్షమాపణ చెప్పారు. వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు.
అయితే ఈ క్షమాపణతో వివాదం పూర్తిగా చల్లారిందా? అనే సందేహం మాత్రం మిగిలింది. ఈ ఘటన మరోసారి ఒక ముఖ్యమైన అంశాన్ని గుర్తుచేసింది. రాజకీయ విమర్శల కోసం మహిళా నటుల వ్యక్తిగత జీవితాలను ప్రస్తావించడం ఎంతవరకు సమంజసం? తమిళనాట సినిమా, రాజకీయాలు దగ్గరగా ఉన్నప్పటికీ వ్యక్తిగత గౌరవానికి గీతలు వేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై మరింతగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
“నోరు జారాను” అనే మాటతో వివాదం ముగిసిపోదు. బహిరంగంగా ఏది పడితే అది మాట్లాడి చివరకు క్షమాపణ చెబితే సరిపోతుందా అనే ప్రశ్నా తెరపైకి వచ్చింది.
Read More
Next Story