
'కర్తవ్య ద్వార్' పేరుపై తమిళనాడు సీఎం ఫైర్
హిందీ భాషను బలవంతంగా రుద్దాలని చూస్తే ఆగ్రహం చవిచూడక తప్పదు - స్టాలిన్
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బుధవారం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు. తిరుచిరాపల్లి రైల్వే డివిజనల్ కార్యాలయ ప్రవేశ ద్వారానికి హిందీ భాషలో పేరు పెట్టడాన్ని ఖండించారు. తిరుచిరాపల్లిలోని రైల్వే డివిజనల్ కార్యాలయ ప్రవేశ ద్వారానికి ఇటీవల 'కర్తవ్య ద్వార్' (గేట్ ఆఫ్ డ్యూటీ) అని పేరు పెట్టారు. దీనిపై రాజకీయ వివాదం రాజుకుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం "ఒక భాష, మూడు లిపిలను" ప్రోత్సహించే నెపంతో హిందీ పేరును తమిళం, ఆంగ్లంలో రాయాలనే "నీచమైన" చర్యకు దిగిందని ముఖ్యమంత్రి ఆరోపించారు.
"రైల్వే తిరుచిరాపల్లి డివిజన్ కార్యాలయం ప్రవేశ ద్వారం వద్ద వారు కర్తవ్య ద్వార్ అని రాశారు. తమిళం, ఆంగ్ల పేర్లపై హిందీని విధించే ప్రయత్నాన్ని విరమించుకోవాలి. సరైన తమిళ పేర్లను వెంటనే చేర్చాలి," అని స్టాలిన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'X'లో పోస్ట్‌లో అన్నారు. లేకుంటే బీజేపీ ప్రభుత్వం తమిళుల కోపాన్ని చూడాల్సి వస్తుందని హెచ్చరించారు.
కేంద్రం ఇప్పటికే ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయాలకు (EPFO) 'భవిష్య నిధి భవన్' అనే పేరు పెట్టింది. "కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ పేరు 'జల్ శక్తి'గా మారిందని, మహాత్మా గాంధీ పేరు మీద ఉన్న 100 రోజుల ఉపాధి హామీ పథకం పేరు మార్చారని, ద్వేషం, అహంకారం పెరుగుతున్నాయని ఆయన ఎత్తి చూపారు.
"తమిళుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్న ఈ వ్యక్తులకు మనం సరైన గుణపాఠం నేర్పించాలి" అని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ అన్నారు.

