
‘‘మతమార్పిడి నిరోధక చట్టాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది’’
బీహార్ అసెంబ్లీ స్పీకర్ ప్రేమ్ కుమార్
బీహార్‌లో మతమార్పిడి, బలవంతపు, మతాంతర వివాహాల నిషేధ చట్టం అమలుకు సాధ్యాసాధ్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తు్ందని అసెంబ్లీ స్పీకర్ ప్రేమ్ కుమార్ వెల్లడించారు. ఈ చట్టాన్ని తీసుకురావాలని కొంతమంది బీజీపీ ఎమ్మెల్యేలు పట్టుబట్టడంతో ఆయన ఈ ప్రకటన చేశారు. "ఇతర రాష్ట్రాల మతమార్పిడి నిరోధక చట్టాలను సమీక్షించిన తర్వాత అవసరమైతే బీహార్ రాష్ట్రం కూడా అమలు చేస్తుంది" అని చెప్పారు.
"ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్, ఇతర రాష్ట్రాలు ఇప్పటికే చట్టవిరుద్ధ మత మార్పిడి బిల్లులను ఆమోదించాయి," అని బీజీపీ ఎమ్మెల్యే బీరేంద్ర కుమార్ గుర్తుచేశారు. మత మార్పిడి కారణంగా అనేక జిల్లాల్లో ముస్లిం జనాభా అసాధారణంగా పెరిగిపోయిందన్నారు. బీహార్‌లోని దాదాపు ప్రతి జిల్లాలో ముఖ్యంగా సీమాంచల్ ప్రాంతంలో బలవంతపు మతాంతర వివాహాలు జరుగుతున్నాయన్నారు. సమాజంలోని పేద, బలహీన వర్గాలు, ముఖ్యంగా SC, ST, EBC, OBC వర్గాలకు లక్ష్యంగా చేసుకుని ఇవి జరుగుతున్నాయని వివరించారు. గత కొన్ని సంవత్సరాలుగా చర్చిల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5,000 చర్చిలు ఉన్నాయని చెప్పారు. క్రైస్తవ సమాజం జాతీయ వృద్ధి రేటు 15.52 శాతం ఉండగా, బీహార్‌లో ఇది 14.23గా ఉందన్నారు.
మరో బీజేపీ ఎమ్మెల్యే మిథిలేష్ తివారీ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో బలవంతపు మత మార్పిడి జరుగుతున్నందున బీహార్‌కు ఈ చట్టం అవసరం అని పేర్కొన్నారు.

