అంతర్వేది గూడెంలో పెద్దపులి
x
పశువులపై పులి దాడి చేసిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న డీఎఫ్ఓ

అంతర్వేది గూడెంలో పెద్దపులి

ఏలూరు జిల్లా అంతర్వేది గూడెంలో పెద్దపులి ఐదు ఆవులపై దాడి చేసి చంపేసింది. పులి తిరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు హెచ్చరించారు.


పెద్దపులి తెలంగాణ నుంచి తప్పించుకుని ఆంధ్రలోని ఏలూరు అటవీ ప్రాంతంలోకి వచ్చింది. ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలంలోని నాగులగూడెం, అంతర్వేది గూడెం గ్రామాల్లో పశువులపై దాడులు చేసింది. అంతర్వేది గూడెంలోని మల్లం కాంతమ్మకు చెందిన 5 ఆవులను చంపేసింది. బుధవారం రాత్రి మూడు ఆవులను పులి చంపేసింది. ఆ తరువాత గురువారం రాత్రి (తెల్లవారితే శుక్రవారం) రెండు ఆవులను చంపింది. కాంతమ్మ ఆవుల దొడ్డిలో మొదటి రోజు మూడు ఆవులను చంపడంతో ఈ ప్రాంతంలోని పశువుల యజమానులు, ప్రజలు భయపడుతున్నారు.


గురువారం రాత్రి ఆవును వేటాడిన పులి (ట్రాప్ కెమెరాకు చిక్కిన ఫొటో)

ఏలూరు జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ పి వెంకట సందీప్ రెడ్డి పశువులపై పులి దాడిచేసిన పశువుల దొడ్డిని పరిశీలించారు. పశువుల మృత దేహాలను పరిశీలించి తగిన విధంగా పరిహారం ఇస్తామని ప్రకటించారు. పశువుల దొడ్డని ఇక్కడి నుంచి మార్చి వేరు చోట వేసుకోవాలని డీఎఫ్ఓ పశువుల యజమానికి సూచించారు. యజమాని కాంతమ్మ అక్కడికి కొంత దూరంలో వేరే చోట ఆమె స్థలంలో పశువులను కట్టవేసింది. అయినా అక్కడికి వచ్చి పులి మళ్లీ దాడిచేసి రెండు పశువులను చంపేసింది. పులి జాడ కనిపెట్టేందుకు వీలుగా పులి సంచరించిన ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. రెండవ రోజు పులి పశువులపై దాడిచేసిన దృశ్యాలు క్లియర్ గా ట్రాప్ కెమెరాల్లో నమోదయ్యాయి.


పులిని గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలు బిగిస్తున్న ఫారెస్ట్ సిబ్బంది

గతంలో వచ్చిన పులి అని అనుమానం...

2024లో పులి ఈ ప్రాంతంలో పశువులపై దాడిచేసి చంపేసింది. అప్పట్లో దానిని ఆ ప్రాంతం నుంచి అటవీ అధికారులు బయటకు పంపించారు. అదే పులి ఇప్పుడు తిరిగి వచ్చిందా? కొత్తగా వేరే పులి వచ్చిందా? అనే అనుమానం ఫారెస్ట్ వారు వ్యక్తం చేస్తున్నారు. అందుకే పులి అడుగు జాడలు తీసుకున్నారు. ఆ జాడలను టెస్టింగ్ కు పంపించారు. ఈ రోజు సాయంత్రానికి టెస్టింగ్ రిపోర్టు వచ్చే అవకాశం ఉందని, రిపోర్టు రాగానే కొత్తదా, పాతదేనా? అనే విషయం నిర్థారిస్తామని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ దుర్గాకుమార్ బాబు తెలిపారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు నాగ వేణు, బి రామారావు లు పశువులను స్వాధీనం చేసుకున్నారు.

ఈనెల 21 వ తేదీ బుధవారం ఏలూరు జిల్లాలోకి తెలంగాణ నుంచి కావడిగుండ్ల అటవీ ప్రాంతంలో పులి సంచరించిందని,తరుపరి అక్కడి నుంచి 22వ తేదీ గురువారం ములగలంపల్లి సెక్షన్, ములగలంపల్లి బీట్ బెడదూరు రిజర్వు ఫారెస్ట్ లో సంచరించినట్లు పగ్ మార్క్స్ ద్వారా గుర్తించినట్లు జిల్లా అటవీ శాఖ అధికారి వెంకట సందీప్ రెడ్డి మీడియాకు చెప్పారు. బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల రెవెన్యూ, పోలీస్ వారి సహకారంతో ఫారెస్ట్ వారు బృందాలు ఏర్పాటు చేశారు. బెడదనూరు పాకలగూడెం, అంకన్నగూడెం, రిజర్వు ఫారెస్ట్ కు సమీపంలో ఉండే గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. పశువుల పాకల వద్ద దీపాలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన పశువుల యజమానులకు చెప్పారు.


పెద్దపులి అడుగు

పోస్టుమార్టం

శుక్రవారం సాయంత్రం పశువులకు పోస్టుమార్టం చేయించనున్నట్లు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు వేణు, రామారావులు తెలిపారు. పశువుల వయసు, దాని వల్ల కుటుంబానికి అందే సాయం వంటి వాటిని పరిగణలోకి తీసుకుని పరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటారు. పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా పరిహారం ఇస్తామని ఫారెస్ట్ వారు చెబుతున్నారు.

అప్పుడప్పుడు పులి సంచారం

బుట్టాయగూడెం మండలంలోని నాగులగూడెం, అంతర్వేది గూడెం ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా అటవీ ప్రాంతంలోకి వెళ్లవద్దని ఫారెస్ట్ రేంజ్ అధికారి దుర్గాకుమార్ బాబు హెచ్చరించారు. తెలంగాణ ప్రాంతం నుంచి పులి తప్పించుకుని అడవిలో ఇటువైపుగా వచ్చినట్లు భావిస్తున్నమని, రాత్రుల్లో ఊళ్లలోకి కూడా పులి వచ్చే అవకాశం ఉందని చెప్పారు.


ఐదు ఆవులపై దాడి, వారికి ఆవులే జీవనం...

నాకుటుంబం ఆవులపైనే జీవిస్తోందని, ఆవులే ఆధారం, అడవులే జీవనంగా బతుకుతున్నామని మల్లం కాంతమ్మ ‘ది ఫెడరల్ ప్రతినిధి’ కి చెప్పారు. పులి దాడిలో చనిపోయిన ఐదు ఆవుల్లో రెండు సూడు ఆవులు ఉన్నాయని ఆమె చెప్పారు. నాకు ఫారెస్ట్ వారు తగిన న్యాయం చేయాలని కోరారు. ఒక్కో ఆవు ఖరీదు రూ. 30వేలు అని తెలిపారు.

Read More
Next Story