బీహార్ సీఎం నితీష్‌కు భారతరత్న? JD(U) నేతలు ఎందుకు వద్దంటున్నారు?
x

బీహార్ సీఎం నితీష్‌కు భారతరత్న? JD(U) నేతలు ఎందుకు వద్దంటున్నారు?

జనతా దళ్ (యునైటెడ్) జాతీయ అధ్యక్షుడిని ప్రత్యక్ష రాజకీయాల నుంచి దూరం చేయడానికేనా?


Click the Play button to hear this message in audio format

బీహార్(Bihar) ముఖ్యమంత్రి, జనతా దళ్ (యునైటెడ్) జాతీయ అధ్యక్షుడు నితీశ్ కుమార్‌(Nitish Kumar)కు ప్రతిష్టాత్మక ‘‘భారత్ రత్న’’ అవార్డు ఇవ్వాలన్న డిమాండ్‌ను పార్టీ వ్యతిరేకిస్తోంది. గతంలోనూ ఇలాంటి ప్రతిపాదనలే వచ్చాయి. అయితే పార్టీ వాటిని పట్టించుకునేది కాదు. లైట్‌గా తీసుకునేది. నితీశ్‌కు భారత రత్న అవార్డు వద్దంటూ కొంతమంది పార్టీ నేతలు బహిరంగంగానే అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

దేశంలోని అత్యున్నత పౌర పురస్కారం ఇవ్వాలన్న డిమాండ్‌ను JD(U) ఎందుకు అంగీకరించడం లేదు? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ప్రశ్నలకు JD(U) వర్గాల నుంచే సమాధానం వస్తోంది. నితీశ్ కుమార్ ఇంకా రాజకీయాల్లో కొనసాగాలని, బీహార్ ముఖ్యమంత్రిగా ఎంతకాలమైనా కొనసాగడమే పార్టీ ఆకాంక్ష అని నేతలు స్పష్టం చేస్తున్నారు. నితీష్‌ను ప్రత్యక్ష రాజకీయాల నుంచి దూరం చేసే నిర్ణయాలను అంగీకరించబోమని చెబుతున్నారు.

JD(U) ప్రస్తుతం బీహార్‌లోనూ, కేంద్రంలోనూ బీజేపీతో కలిసి పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో బీజేపీకి తనదైన వ్యూహం ఉండటం బహిరంగ రహస్యమేనని JD(U) నేతలు భావిస్తున్నారు. పరిస్థితులు తమకు అనుకూలంగా వచ్చినపుడు నితీశ్ స్థానంలో మరో నేతను ముఖ్యమంత్రి పదవిలోకి తీసుకురావాలని బీజేపీ యోచిస్తోందన్న జేడీయూ వర్గాల అనుమానం.


భారత్ రత్న ఇవ్వడం అంటే రాజకీయ విరమణేనా?

‘‘భారత్ రత్న అందుకున్న రాజకీయ నాయకులు సాధారణంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరమవుతారు. ఆ అవార్డు నితీశ్‌కు ఇప్పుడే ఇస్తే.. ఆయనను రాజకీయ విరమణ దిశగా నెట్టేసినట్లే’’నని పార్టీ భావిస్తోంది.


ప్రధాని మోదీకి లేఖ..

గత వారం ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు భారత రత్న ఇవ్వాలని సీనియర్ జేడీయూ నేత కేఏసీ త్యాగి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. అయితే ఈ విషయంలో పార్టీ వెంటనే స్పందించింది. అది త్యాగి వ్యక్తిగత అభిప్రాయమేనని పేర్కొంది. మాజీ ఎంపీగా, పార్టీ జాతీయ ప్రతినిధిగా పనిచేసిన త్యాగితో నితీశ్‌కు దీర్ఘకాల అనుబంధం ఉన్నా.. ఇలాంటి ప్రతిపాదన తెచ్చిన త్యాగిపై పార్టీ ఏ మాత్రం చర్చ తీసుకోలేదు.


గతంలోనూ ఇదే ప్రతిపాదన..

నితీశ్ కుమార్‌కు భారత రత్న ఇవ్వాలన్న డిమాండ్ 2024లోనూ వినిపించింది. ప్రస్తుతం జేడీయూ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న సంజయ్ ఝా అప్పట్లో ఈ ప్రతిపాదన చేశారు. అలాగే మరో క్రియాశీల పార్టీ నేత చోటు సింగ్, షియోహార్ నుంచి జేడీయూ ఎంపీగా ఉన్న లవ్లీ ఆనంద్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. లవ్లీ ఆనంద్, దళిత ఐఏఎస్ అధికారిని హత్య చేసిన కేసులో జైలుకు వెళ్లిన మాజీ ఎంపీ.


నితీశ్‌ను తొలగించే కుట్ర?

నితీశ్ కుమార్‌ను ప్రత్యక్ష రాజకీయాల నుంచి దూరం చేయాలని బీజేపీ భావిస్తుందని పలువురు జేడీయూ నేతలు ది ఫెడరల్‌తో అన్నారు. “నితీశ్ రాజకీయాల నుంచి తప్పుకుంటే బిహార్‌లో అధికార రాజకీయాలపై బీజేపీ పూర్తిగా ఆధిపత్యం సాధిస్తుంది” అని పార్టీకి చెందిన ఓ సభ్యుడు వ్యాఖ్యానించారు.

పట్నాకు చెందిన ఓ రాజకీయ పరిశీలకుడు కూడా త్యాగి బీజేపీ అజెండాకు అనుగుణంగా పనిచేస్తున్నట్లు కనిపిస్తోందని, అందుకే పార్టీ ఆయనను పక్కకు నెట్టిందని అభిప్రాయపడ్డారు. మరో బిహార్‌కు చెందిన రాజకీయ విశ్లేషకుడు సొరూర్ అహ్మద్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తూ, జేడీయూ లోని ఒక వర్గం బీజేపీ చేతుల్లో ఆడుతోందని, సాధారణంగా మరణానంతరం లేదా రాజకీయాల నుంచి విరమించిన నేతలకు ఇచ్చే భారత రత్నను నితీశ్ కుమార్‌కు ప్రదానం చేయడం ద్వారా ఆయనను పక్కన పెట్టాలని బీజేపీ యత్నిస్తోందన్నారు.

గత వారాంతంలో జేడీయూ జాతీయ ప్రతినిధి రాజీవ్ రంజన్ ప్రసాద్, ప్రధాన ప్రతినిధి నీరజ్ కుమార్‌లు — త్యాగి చేస్తున్న ప్రకటనలన్నీ ఆయన వ్యక్తిగత అభిప్రాయాలేనని, వాటితో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. బిహార్ మంత్రి, జేడీయూలో అత్యంత సీనియర్ నేత అయిన బిజేంద్ర ప్రసాద్ యాదవ్ కూడా ఇది త్యాగి వ్యక్తిగత అభిప్రాయమేనని, అందులో తప్పేమీ లేదని భావిస్తున్నప్పటికీ, ఈ అంశంపై తాను వ్యాఖ్యానించలేనని తెలిపారు.

Read More
Next Story