భారత్ బంద్‌కు మిశ్రమ స్పందన
x

భారత్ బంద్‌కు మిశ్రమ స్పందన

కొన్ని చోట్ల ప్రజా సేవలకు అంతరాయం - మరికొన్ని రాష్ట్రాల్లో సాధారణ పరిస్థితులు


Click the Play button to hear this message in audio format

దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు సంయుక్తంగా చేపట్టిన భారత్ బంద్‌కు గురువారం మిశ్రమ స్పందన లభించింది. కొన్ని రాష్ట్రాల్లో రవాణా, బ్యాంకింగ్, పారిశ్రామిక కార్యకలాపాలు స్తంభించాయి. మరికొన్ని ప్రాంతాల్లో జనజీవనం యథావిధిగా కొనసాగింది. కొత్త కార్మిక చట్టాలను రద్దుచేయాలని, రైతు విధానాల్లో మార్పులు చేయాలని సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

రాష్ట్రాల వారీ పరిస్థితి..

తమిళనాడు: చెన్నై, తూత్తుకుడి ఓడరేవుల్లో కార్యకలాపాలు కొంత మందగించాయి. శ్రీపెరంబుదూర్ పరిశ్రమల ప్రాంతంలో కార్మికులు గేట్ మీటింగ్‌లు నిర్వహించారు. కొన్ని ఫ్యాక్టరీల్లో తక్కువ సిబ్బందితో ఉత్పత్తి కొనసాగింది.

కేరళ: బంద్ ప్రభావం ఎక్కువగా కనిపించింది. KSRTC, ప్రైవేట్ బస్సులు రోడ్లపైకి రాకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. దుకాణాలు, కార్యాలయాలు అనేక చోట్ల మూతపడ్డాయి. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ “ఇది భారత్ బంద్ కంటే కేరళ బంద్‌లా మారింది” అంటూ విమర్శించారు.

కర్ణాటక: రాష్ట్రంలో బంద్ ప్రభావం తక్కువ. బస్సులు, క్యాబ్‌లు, ఆటోలు సాధారణంగా నడిచాయి. పాఠశాలలు, దుకాణాలు తెరిచి ఉన్నాయి.

ఒడిశా: కొన్ని పట్టణాల్లో రహదారి దిగ్బంధాలు జరిగాయి. భువనేశ్వర్, కటక్, బాలసోర్ వంటి ప్రాంతాల్లో రవాణా, మార్కెట్లు ప్రభావితమయ్యాయి.

తెలంగాణ: హైదరాబాద్‌తో పాటు గోదావరిఖని వంటి ప్రాంతాల్లో కార్మిక సంఘాలు నిరసనలు చేపట్టాయి. సింగరేణి కార్మికులు విధులకు దూరంగా ఉండి ర్యాలీలు నిర్వహించారు.

జార్ఖండ్: బ్యాంకింగ్, బీమా, బొగ్గు రంగాలు ప్రభావితమయ్యాయని ఉద్యోగ సంఘాలు తెలిపాయి. వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ మద్దతు ప్రకటించాయి.

ఛత్తీస్‌గఢ్: కొన్ని జాతీయ బ్యాంకులు మూతపడ్డాయి. మైనింగ్ కార్యకలాపాలు పాక్షికంగా జరిగాయి. అయితే రవాణా, మార్కెట్లు సాధారణంగా కొనసాగాయి.

పంజాబ్: ఆప్ పార్టీ బంద్‌కు మద్దతు ప్రకటించింది. కార్మికులు, రైతులతో కలిసి నిరసనలు నిర్వహించారు.

గోవా: బ్యాంకింగ్ సేవలు కొంతవరకు ప్రభావితమయ్యాయి. అత్యవసర సేవలు మాత్రం యథావిధిగా కొనసాగాయి.

మధ్యప్రదేశ్: రక్షణ సంస్థల్లో పనిచేసే పౌర ఉద్యోగులు గంట ఆలస్యంగా విధుల్లో చేరారు. మార్కెట్లు, విద్యాసంస్థలు తెరిచి ఉన్నాయి.

పశ్చిమ బెంగాల్, త్రిపుర, గుజరాత్: ఈ రాష్ట్రాల్లో బంద్ ప్రభావం పెద్దగా కనిపించలేదు. రవాణా, కార్యాలయాలు, దుకాణాలు సాధారణంగా పనిచేశాయి.


కార్మిక సంఘాల వాదనలు

AITUC సహా కార్మిక సంఘాలు “నాలుగు కార్మిక కోడ్‌ల రద్దు, ముసాయిదా విత్తన బిల్లు ఉపసంహరణ, విద్యుత్ సవరణ బిల్లు రద్దు” వంటి డిమాండ్లు ఉంచాయి. సుమారు 30 కోట్ల కార్మికులు సమ్మెలో పాల్గొన్నట్లు సంఘాలు పేర్కొన్నాయి. బ్యాంకింగ్, బీమా, పోస్టల్, రవాణా, గనులు వంటి రంగాలు ప్రభావితమయ్యాయని నాయకులు తెలిపారు.


రాజకీయ నేతల స్పందనలు..

రాహుల్ గాంధీ: కార్మికులు, రైతుల హక్కుల కోసం జరుగుతున్న ఈ నిరసనకు మద్దతు ప్రకటించారు.

శశి థరూర్: బంద్ విధానం ప్రజల స్వేచ్ఛను అడ్డుకుంటుందని విమర్శించారు.

మొత్తంగా చూస్తే.. భారత్ బంద్ దేశవ్యాప్తంగా ఒకే విధమైన ప్రభావం చూపలేదు. కేరళ, ఒడిశా, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో ప్రభావం స్పష్టంగా కనిపించగా, కర్ణాటక, గుజరాత్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో సాధారణ పరిస్థితులు కనిపించాయి. కార్మిక సంఘాల డిమాండ్లు, రాజకీయ నాయకుల మద్దతు, విమర్శల మధ్య బంద్ మిశ్రమ స్పందనతో ముగిసింది.

Read More
Next Story