డబ్బులివ్వలేదని తల్లిదండ్రులను హత్య చేసిన కొడుకు
x

డబ్బులివ్వలేదని తల్లిదండ్రులను హత్య చేసిన కొడుకు

బెంగళూరులో దారుణం


Click the Play button to hear this message in audio format

బెంగళూర్ లోని విజ్ఞాన నగర్‌లో 33 ఏళ్ల టెక్నీషియన్ కన్నవారిని హత్య చేశాడు. ఆర్థిక విషయాల నేపథ్యంలో జరిగిన వాగ్వాదం.. చివరకు హత్యకు దారితీసిందని పోలీసులు తెలిపారు. గాయపడిన వృద్ధ దంపతులను ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటన హెచ్‌ఏఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం (ఫిబ్రవరి 11) జరిగింది. నిందితుడిని రోహన్ చంద్ర భట్ (33)గా, మృతులను రిటైర్డ్ నేవీ కెప్టెన్ నవీన్ చంద్ర భట్ (60), ఆయన భార్య డాక్టర్ శ్యామల భట్ (55)గా పోలీసులు గుర్తించారు. శ్యామల భట్ వృత్తిరీత్యా దంతవైద్యురాలు.

పోలీసుల కథనం ప్రకారం...రోహన్ తన తల్లిదండ్రులతో ఇంట్లో గొడవపడి ఆగ్రహంతో కత్తితో దాడి చేశాడని పోలీసులు వెల్లడించారు. గొడవ పడడం చూసిన చుట్టుపక్కల వాళ్లు ఇంట్లోకి వచ్చారు. తీవ్రంగా గాయపడిన చంద్ర భట్ దంపతులను ఓల్డ్ ఎయిర్‌పోర్ట్ రోడ్‌లోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే వారు చనిపోయారని వైద్యులు చెప్పారు.

ఆర్థిక ఒత్తిళ్లే కారణమా?

రోహన్ గతంలో అమెరికాలో ఉద్యోగం చేసి మూడేళ్ల క్రితం బెంగళూరుకు తిరిగి వచ్చినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. స్వతంత్రంగా ప్రాజెక్టు వర్క్‌లు చేస్తూ వ్యాపారాన్ని విస్తరించాలకున్నారు. కాని డబ్బుల కొరత కారణంగా తల్లిదండ్రులతో గొడవపడ్డారని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. తన ప్రాజెక్టులకు ఆర్థిక సాయం చేయాలని తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకువచ్చినట్టు చెప్పారు. వారు సాయం చేయలేమని ఖరాఖండిగా చెప్పడంతో గొడవ మొదలైంది. రోహన్ కొంతకాలంగా వర్తుర్ ప్రాంతంలో ఇంటికి అద్దెకు తీసుకుని వేరుగా ఉంటున్నట్టు పోలీసులు తెలిపారు. రోహన్ సోమవారం రాత్రి మళ్లీ తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లాడు. డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో గొడవ మొదలైంది.

అరెస్ట్‌, దర్యాప్తు..

ఘటన అనంతరం పోలీసులు రోహన్‌ను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. ఇంకా అతన్ని పూర్తిగా ప్రశ్నించాల్సి ఉందని తెలిపారు. ఈ ఘటనపై నిందితుడి సోదరికి సమాచారం ఇచ్చినట్టు చెప్పారు. ఆమె ప్రస్తుతం అమెరికాలో ఉన్నారని, బెంగళూరుకు చేరుకున్న తర్వాత శవపరీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు.

Read More
Next Story