
అప్పుల భారంతో కుటుంబం ఆత్మహత్యాయత్నం
తల్లి, కూతురు మృతి, మరో ఇద్దరు కొన ఊపిరితో ఆసుపత్రిలో..
బెంగళూరులో విషాదం చోటుచేసుకుంది. అప్పుల భారంతో బెంగళూరులో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ ఘటనలో ఆశా (55), ఆమె కుమార్తె వర్షిత (34) మృతి చెందగా, వర్షిత కుమారుడు మయాంక్ (11), ఆమె సోదరుడు మోహన్ గౌడ (32) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇంతకు ఏం జరిగిందంటే..
మోహన్ చిట్‌ఫండ్ వ్యాపారి. వ్యాపారంలో నష్టాలు రావడంతో కుటుంబం అప్పుల్లో కూరుకుపోయింది. విలాసవంత జీవనానికి అలవాటుపడ్డ మోహన్ తీరుతో కుటుంబంపై మరింత ఆర్థిక భారం పడింది. ఇటు బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతోన్న వర్షిత వైద్యానికి అయ్యే భారీ ఖర్చు ఆ కుటుంబాన్ని కుంగదీసింది.
ఈ నేపథ్యంలో ఆశా కుటుంబం ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఒక వీడియో రికార్డ్ చేసి తమ నిర్ణయానికి ఆర్థిక సమస్యలే కారణమని అందులో పేర్కొన్నారు.
వీడియో చూసిన బంధువులు వెంటనే ఇంటికి చేరుకున్నారు. అయితే ఇల్లు లోపల నుంచి లాక్ చేసి ఉండటంతో, వెనుక తలుపు ద్వారా లోపలికి ప్రవేశించారు. ఓ గదిలో ఆశా, ఆమె కుమార్తె అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. కొన ఊపిరితో ఉన్న మయాంక్, మోహన్ గౌడను ఆసుపత్రికి తరలించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే మోహన్ తన తల్లి, సోదరి, మేనల్లుడిపై దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

