
ఉద్రిక్తంగా మారిన ‘బీసీ ధర్మదీక్ష’
గుంటూరు-విజయవాడ జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభన
మూడో రోజు ఆరోగ్యం విషమించిన బోడె రామచంద్రయాదవ్.. ‘డిమాండ్లు తీరే వరకు దీక్ష విరమించేది లేదని తేల్చి చెప్పిన యాదవ్.
బీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ హక్కుల సాధన కోసం బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ చేపట్టిన ‘బీసీ ధర్మదీక్ష’ మూడో రోజు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మంగళగిరి వద్ద గుంటూరు-విజయవాడ జాతీయ రహదారిపై వందలాది బీసీవై కార్యకర్తలు రోడ్డుపై దిగ్బంధం చేయడంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయి, ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
దీక్ష మూడో రోజు కొనసాగుతుండటంతో బోడె రామచంద్రయాదవ్ ఆరోగ్యం విషమించిందని వైద్యులు స్పష్టం చేశారు. ఈ విషయం తెలియగానే ఆందోళనతో ఉన్న బీసీవై శ్రేణులను కొందరు అనుచరులు రెచ్చగొట్టేలా ప్రవర్తించడంతో పరిస్థితి అదుపు తప్పింది. సోమవారం సాయంత్రం దీక్షా శిబిరం వద్దకు చేరుకున్న ఆ బృందం శాంతియుతంగా ఉన్న కార్యకర్తలతో వాగ్వాదానికి దిగి హల్‌చల్ సృష్టించింది. దీంతో ఆగ్రహం చెందిన బీసీవై కార్యకర్తలు ఒక్కసారిగా రహదారిపైకి దూసుకొచ్చి ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేశారు. ఫలితంగా రెండు వైపులా కిలోమీటర్ల మేర వాహనాలు లైన్‌లు పడి ఉన్నాయి.
దీక్షా శిబిరం వద్ద రామచంద్ర యాదవ్ ను పరామర్శిస్తున్న లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జిఎస్ఆర్కేఆర్ విజయకుమార్
దీక్షా శిబిరం నుంచి మాట్లాడిన బోడె రామచంద్రయాదవ్ తన స్థితిని వివరిస్తూ “బీసీల ఐదు న్యాయమైన డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు ఈ ధర్మదీక్షను విరమించే ప్రసక్తే లేదు” అని పునరుద్ఘాటించారు. ఆరోగ్యం క్షీణిస్తున్నా తాను దీక్షను కొనసాగించనున్నట్లు స్పష్టం చేశారు. “దీక్షను భగ్నం చేయాలని ప్రయత్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే” అని హెచ్చరించారు. ప్రభుత్వం స్పందించకపోతే స్పష్టమైన పరిష్కారాలు ప్రకటించే వరకు ధర్మదీక్ష కొనసాగుతుందని తేల్చి చెప్పారు.
ఈ ధర్మదీక్షకు రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రముఖులు మద్దతు వెల్లువెత్తుతున్నారు. సోమవారం దీక్షా శిబిరానికి విచ్చేసి బోడె రామచంద్రయాదవ్‌కు సంఘీభావం తెలిపిన వారిలో వంగవీటి మోహనరంగా కుమార్తె ఆశా వంగవీటి, ప్రముఖ పారిశ్రామికవేత్త కోగంటి సత్యనారాయణ, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు మాజీ ఐఏఎస్ అధికారి విజయకుమార్, ముస్లిం సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముక్తర్ అలీ, మాజీ హిస్టరీ బోర్డు డైరెక్టర్ వాజీద్ ఖాన్, శాలివాహన సంఘం స్టేట్ ప్రెసిడెంట్ ఇలాపురం శ్రీనివాస్, బీసీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఎన్.వి. రావు తదితరులు ఉన్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం మరియు టీడీపీ నేతల దురుసు ప్రవర్తనకు నిరసనగా ఈ ధర్మదీక్ష చేపట్టినట్లు బీసీవై పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సంఘటనలు రాష్ట్ర రాజకీయాల్లో మరింత ఉత్తేజం నింపుతున్నాయి. ప్రస్తుతం హైవేలో ట్రాఫిక్ పునరుద్ధరణకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. పరిస్థితి మరింత విషమించకుండా ప్రభుత్వం తక్షణం స్పందించాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

