బంగ్లాదేశ్‌లో షేక్ ముజిబుర్ రెహ్మాన్ మ్యూజియం కూల్చివేత..
x

షేక్ ముజిబుర్ రెహ్మాన్ మ్యూజియం

బంగ్లాదేశ్‌లో షేక్ ముజిబుర్ రెహ్మాన్ మ్యూజియం కూల్చివేత..

బంగ్లాదేశ్‌లో పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో..మాజీ అధ్యక్షురాలు షేక్ హసీనాకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందా? అన్న అనుమానం కలుగుతోంది.


షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ నాయకుల ఇళ్లను గురువారం నిరసనకారులు ధ్వంసం చేశారు. హసీనా తండ్రి, మాజీ అధ్యక్షుడు షేక్ ముజిబుర్ రెహ్మాన్(Sheikh Mujibur Rahman) చిత్రపటాలను పగులగొట్టారు. హసీనా ఆన్‌లైన్ ప్రసంగం తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది.

మ్యూజియం ధ్వంసం..

బుధవారం వేలాది మంది నిరసనకారులు రాజధాని ఢాకా ధన్మండి ప్రాంతంలో షేక్ ముజిబుర్ రెహ్మాన్ నివాసం (ప్రసుత్తం రెహ్మాన్ స్మారక మ్యూజియం) ముందు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎక్స్కవేటర్‌‌తో మ్యూజియంను కూల్చేయడం మొదలుపెట్టారు. ర్యాలీకి ముందు.."బుల్‌డోజర్ ప్రొసెషన్" పేరుతో నిరసనకారులు సోషల్ మీడియాలో ప్రచారం నిర్వహించారు. ఢాకా ధన్మండి రోడ్ నెంబర్ 5లో ఉన్న షేక్ హసీనా (Sheikh Hasina) నివాసం ‘సుధా సదన్’ ను కూడా బుధవారం రాత్రి నిరసనకారులు తగలబెట్టారని ‘ద డైలీ స్టార్’ పత్రిక పేర్కొంది. ఆగస్టు 5న హసీనా గద్దె దిగిన తర్వాతి నుంచి సుధా సదన్ ఖాళీగా ఉంది.

బంధువుల ఇళ్లు ధ్వంసం..

ఢాకాలోని పలు ప్రాంతాల్లోనూ నిరసనకారులు పలువురి ఇళ్ల విధ్వంసానికి పాల్పడ్డారు. ధన్మండి ప్రాంతంలో మరణించిన అణు శాస్త్రవేత్త వాజెద్ మియాన్ ఇంటికి నిరసనకారులు నిప్పుపెట్టారు. ఈ భవవాన్ని గతంలో హసీనా రాజకీయ కార్యాలయంగా వినియోగించారు. ఢాకాలో జరిగిన ఈ విధ్వంసాలతో రెచ్చిపోయిన నిరసనకారులు బంగ్లాదేశ్‌(Bangladesh)లోని ఇతర ప్రాంతాల్లోను విధ్యంసాలకు పాల్పడ్డారు. ఖుల్నాలో షేక్ హసీనా సోదరులైన షేక్ హెలాల్ ఉద్దీన్, షేక్ సలౌద్దీన్ జువెల్ నివాసాలను ధ్వంసం చేశారు. షేక్ హెలాల్ బాగెర్హాట్-1 మాజీ పార్లమెంటు సభ్యుడు కాగా, షేక్ సలాహుద్దీన్ జువెల్ ఖుల్నా-2 మాజీ ఎంపీ. ఖుల్నా మెట్రోపాలిటన్ పోలీస్ అదనపు డిప్యూటీ కమిషనర్ అహ్సాన్ హబీబ్ ‘ద డైలీ స్టార్’ పత్రికతో మాట్లాడుతూ.. “ఈ ఘటన గురించి ఫేస్‌బుక్‌లో చూశాను, కానీ పూర్తి సమాచారం లేదు” అని తెలిపారు.

ముజిబుర్ పేరు తొలగింపు..

ఢాకా విశ్వవిద్యాలయంలోని ‘బంగబంధు షేక్ ముజిబుర్ రెహ్మాన్ హాల్’ పై ఉన్న ముజిబ్ పేరును నిరసనకారులు తొలగించారు.

ఆవామీ లీగ్(Awami League) నేతల ఇళ్లపై దాడులు

కుష్టియా-3 మాజీ పార్లమెంటు సభ్యుడు, ఆవామీ లీగ్ జాయింట్ జనరల్ సెక్రటరీ మహబుబుల్ ఆలమ్ హనీఫ్ నివాసాన్ని నిరసనకారులు ధ్వంసం చేశారు. అలాగే కుష్టియా ఆవామీ లీగ్ అధ్యక్షుడు సదర్ ఖాన్ ఇంటిపైనా దాడులు జరిగాయి.

చట్టోగ్రామ్‌లో నిరసనలు..

చట్టోగ్రామ్‌లో బుధవారం రాత్రి నిరసనకారులు ‘టార్చ్ ప్రొసెషన్’ నిర్వహించి షేక్ హసీనా ప్రసంగానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఆమె ప్రసంగం బంగ్లాదేశ్ ఆవామీ లీగ్ సోషల్ మీడియా ఖాతాల్లో ప్రసారమైంది.

చిత్రపటాల ధ్వంసం..

చట్టోగ్రామ్ మెడికల్ కాలేజ్ వద్ద, నగరంలోని జమాల్ ఖాన్ ప్రాంతంలో షేక్ ముజిబ్ కుడ్య చిత్రాలను నిరసనకారులు ధ్వంసం చేశారు. సిల్హెట్ బందర్ బజార్‌లో ‘స్టూడెంట్స్ అగైనస్ట్ డిస్క్రిమినేషన్’ పేరిట విద్యార్థుల బృందం నిరసన ర్యాలీ నిర్వహించింది.

రంగ్‌పూర్‌లోని బేగమ్ రోకేయా యూనివర్శిటీలో ముజిబ్ మ్యూల్‌ను కూడా ధ్వంసం చేశారు. మొత్తం మీద ఈ నిరసనలు బంగ్లాదేశ్ వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి.

మయ్మెన్సింగ్ నగరంలోని సర్క్యూట్ హౌస్ గ్రౌండ్ వద్ద ఉన్న బంగబంధు చిత్రపటాన్ని బుధవారం రాత్రి 11:30కు నిరసనకారులు హామర్లు, క్రోబార్లతో ధ్వంసం చేశారు అని ప్రోథోమ్ అలో పత్రిక పేర్కొంది. ట్రిషాల్‌లోని కాజీ నజ్రుల్ ఇస్లాం విశ్వవిద్యాలయంలో ‘ముజిబ్ మ్యూల్’ ను కూడా నిరసనకారులు ధ్వంసం చేశారు. చువాడంగాలోని డిప్యూటీ కమిషనర్ కార్యాలయం వద్ద ఉన్న ముజిబ్, ఆయన భార్య ఫజిలతున్నేసా ముజిబ్ చిత్రపటాలను గురువారం రాత్రి 12:15 గంటలకు నేలమట్టం చేశారు. భైరాబ్, కిషోరేగంజ్‌లో అప్‌జిలా అవామీ లీగ్ కార్యాలయం మరియు అప్‌జిలా పరిషత్ వద్ద ముజిబ్ మ్యూల్ ధ్వంసానికి గురైంది.

హసీనా స్పందన..

విధ్వంసకర ఘటనల నేపథ్యంలో షేక్ హసీనా స్పందించారు. "జాతీయ జెండా, రాజ్యాంగాన్ని బుల్డోజర్‌తో మట్టుబెట్టే శక్తి ఇంకా రాలేదు. భవనాన్ని కూల్చగలరు. చరిత్రను కాదు. చరిత్ర ప్రతీకారాన్ని తీర్చుకుంటున్న విషయం మరిచిపోరాదు," అని హసీనా పేర్కొన్నారు.

భారత్‌లో హసీనా ప్రవాస జీవితం..

తీవ్ర నిరసనల నేపథ్యంలో 2024 ఆగస్టు 5న షేక్ హసీనా బంగ్లాదేశ్‌ను వీడి భారత్‌ చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడే ఉంటున్నారు. హసీనా‌పై పెరిగిన అసంతృప్తి ఆమె తండ్రి షేక్ ముజిబుర్ రెహ్మాన్ ప్రతిష్టను దిగజార్చింది. షేక్ ముజిబుర్ రెహ్మాన్, అతని కుటుంబసభ్యులను 1975 ఆగస్టు 15న కొంతమంది సైనిక అధికారులు హత్య చేశారు. అప్పటికే హసీనా, ఆమె చెల్లెలు రెహనా జర్మనీలో ఉన్నారు.

మొత్తంమీద బంగ్లాదేశ్‌లో తాజా పరిణామాలు ఉద్రిక్తంగా ఉన్నాయి.

.

Read More
Next Story