
’సీమకు చంద్రగ్రహణం'
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు చీకటి ఒప్పందం కుదుర్చకున్నారని వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు గుప్పించారు.
"రాష్ట్ర ప్రయోజనాలను, రాయలసీమ ప్రజల గొంతును సీఎం చంద్రబాబు నాయుడు తన స్వార్థ రాజకీయాల కోసం తాకట్టు పెట్టారు. సీమ ప్రాజెక్టులను ఖూనీ చేసిన చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోతారు" అని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. గురువారం తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, భోగాపురం ఎయిర్‌పోర్ట్ అంశాలపై కూటమి ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు.
రేవంత్ రెడ్డితో చీకటి ఒప్పందం
తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను జగన్ ఉటంకించారు. "రాయలసీమ లిఫ్ట్‌ను ఆపించామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గర్వంగా చెబుతుంటే, ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం దీనిపై నోరు మెదపకపోవడం వెనుక ఉన్న రహస్యమేంటి? అని నిలదీశారు. వీరిద్దరి మధ్య ఏదో 'క్లోజ్ డోర్' ఒప్పందం కుదిరిందని, ఓటుకు కోట్లు కేసు భయంతోనే సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు అని జగన్ ఆరోపించారు.
సీమకు సంజీవిని 'రాయలసీమ లిఫ్ట్'
శ్రీశైలంలో 881 అడుగులు ఉంటే తప్ప పోతిరెడ్డిపాడుకు నీళ్లు రాని పరిస్థితి ఉందని, అందుకే 800 అడుగుల నుంచే నీటిని తోడుకునేలా తాము లిఫ్ట్ డిజైన్ చేశామని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ఎడమ గట్టున 770 అడుగుల నుంచే రోజుకు 8 టీఎంసీలు తోడుకుంటుంటే, ఏపీ రైతులకు మాత్రం 834 అడుగుల వద్ద కూడా నీళ్లు రాని దుస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మా ప్రభుత్వం రాకపోవడం రాయలసీమ ప్రజల దురదృష్టం. రూ. వెయ్యి కోట్లు ఖర్చు చేసి పనులు పరుగులు పెట్టించాం. కానీ చంద్రబాబు వచ్చాక ఆ పనులన్నింటినీ సమాధి చేశారు అని జగన్ ధ్వజమెత్తారు.
భోగాపురం 'క్రెడిట్ చోరీ'
భోగాపురం ఎయిర్‌పోర్ట్ పనులపై సీఎం చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని జగన్ మండిపడ్డారు. భూసేకరణ పూర్తి చేసి, ఆర్‌ఆర్ ప్యాకేజీ ఇచ్చి, పనులు ప్రారంభించింది తమ ప్రభుత్వమేనని.. ఇప్పుడు చంద్రబాబు ఆ క్రెడిట్ దొంగిలించడానికి చూస్తున్నారని విమర్శించారు. గండికోట, బ్రహ్మంసాగర్, సోమశిల, కండలేరు ప్రాజెక్టుల్లో రికార్డు స్థాయిలో నీటిని నిల్వ చేసిన ఘనత తమదేనని జగన్ గుర్తు చేశారు. వెలిగొండ ప్రాజెక్టును తామే పూర్తి చేశామని, అయితే తమకు పేరు వస్తుందనే కుతంత్రంతో సీఎం చంద్రబాబు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

