బాబు-పవన్ ’వ్యూహ‘ భేటీ
x

బాబు-పవన్ ’వ్యూహ‘ భేటీ

చాలా కాలం తర్వాత చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు ఏకాంతంగా భేటీ కావడం ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచుతోంది.


రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య భేటీ ముగిసింది. సుమారు రెండున్నర గంటల పాటు సాగిన ఈ ఏకాంత చర్చల్లో.. తిరుమల తిరుపతి లడ్డూ వ్యవహారంలో వైసీపీ విష ప్రచారం చేస్తోందని, దానిని ఎలా అడ్డుకోవాలనే అంశంపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టినట్లు తెలిసింది. అటు లడ్డూ కల్తీ నివేదికపై తదుపరి యాక్షన్, ఇటు రాజ్యసభ సీట్ల కేటాయింపు.. రాష్ట్రంలో పాలన, రాజకీయ అంశాల మేళవింపుతో సాగిన ఈ భేటీ, రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతంగా కనిపిస్తోంది. సుమారు రెండున్నర గంటల పాటు సాగిన ఈ సుదీర్ఘ సమావేశంలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ వ్యూహాలపై ఇద్దరు నేతలు లోతుగా చర్చించారు.

తుత్తునీయులు చేయాలని..
రాష్ట్ర రాజకీయాల్లో చిచ్చు పెట్టేందుకు వైసీపీ పన్నుతున్న కుల రాజకీయాల వ్యూహాన్ని తుత్తునియలు చేయాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దృఢ నిశ్చయానికి వచ్చినట్లు తెలిసింది. కేవలం విమర్శలకే పరిమితం కాకుండా, విపక్షం విసిరే కులపరమైన ట్రాప్‌లో పడకుండా అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని నిర్ణయించారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అసహనం పెంచేందుకు వైసీపీ చేస్తున్న ప్రతి కుట్రను క్షేత్రస్థాయిలో ఎండగట్టాలని, ఆ పార్టీ విష ప్రచారాన్ని దీటుగా తిప్పికొట్టేలా పక్కా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. ముఖ్యంగా, కింది స్థాయిలో తెలుగుదేశం, జనసేన కార్యకర్తల మధ్య చిన్నపాటి విభేదాలు సృష్టించి లబ్ధి పొందాలని చూస్తున్న వైసీపీ ఎత్తుగడలకు క్యాడర్ సమన్వయంతో చెక్ పెట్టబోతున్నారు. మనం విడిపోతే వాళ్లకు బలం.. మనం కలిసుంటేనే రాష్ట్రానికి బలం అనే సందేశాన్ని రెండు పార్టీల శ్రేణుల్లోకి బలంగా తీసుకెళ్లాలని, ఇరు పార్టీల మధ్య ఇనుప కవచంలాంటి ఐక్యతను చాటాలని ఈ భేటీలో దిశానిర్దేశం చేసుకున్నట్టు తెలిసింది.
సూత్రధారులను వదిలిపెట్టకూడదని..
తిరుమల శ్రీవారి లడ్డూ పవిత్రతను దెబ్బతీసిన కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్ (SIT) ఇచ్చిన నివేదిక ఇప్పుడు సంచలనంగా మారింది. బుధవారం జరిగిన కీలక భేటీలో ఈ నివేదికపై సుదీర్ఘంగా చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. కల్తీ జరగడం అక్షరాలా వాస్తవమని తేలడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో దాదాపు 68 లక్షల కిలోల నకిలీ నెయ్యి సరఫరా అయిందని, కేవలం రసాయనాలు, పామాయిల్ కలిపి దీనిని సృష్టించారని తేలడంపై నేతలిద్దరూ దిగ్భ్రాంతి చెందారు. దీనికి కారణమైన
సూత్రధారులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదని, పాత్రధారులతో పాటు తెరవెనుక ఉండి నడిపించిన పెద్దలపై కూడా చట్టపరంగా ఉక్కుపాదం మోపాలని నిర్ణయించారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం కావడంతో, కేవలం శాఖాపరమైన చర్యలకే పరిమితం కాకుండా.. బాధ్యులందరినీ కటకటాల్లోకి నెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం తదుపరి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.
కలిసి కట్టుగానే పదవులు
పాలనతో పాటు రాజకీయ వ్యూహాల్లోనూ స్పీడ్ పెంచిన చంద్రబాబు-పవన్ భేటీలో రాజ్యసభ ఎన్నికలు, నామినేటెడ్ పదవుల భర్తీ ప్రధాన అంశాలుగా నిలిచాయి. రాష్ట్రం నుంచి ఖాళీ కానున్న ఆ నాలుగు రాజ్యసభ స్థానాలను కూటమి పక్షాలు ఎలా పంచుకోవాలి, ఏయే అభ్యర్థులను బరిలోకి దించాలనే అంశంపై ఇరువురు నేతలు ప్రాథమిక ఏకాభిప్రాయానికి వచ్చారు. కేవలం రాజ్యసభ సీట్లే కాకుండా, కేడర్‌లో ఎంతో ఉత్కంఠ రేపుతున్న నామినేటెడ్ పదవుల రెండో జాబితాపై కూడా కసరత్తు దాదాపు పూర్తయినట్లు సమాచారం. మొదటి జాబితాలో చోటు దక్కని సీనియర్లకు, కష్టపడిన కార్యకర్తలకు ఈసారి ప్రాధాన్యత ఇస్తూ సమతుల్యత పాటించాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. కూటమిలోని మూడు పార్టీల మధ్య ఎక్కడా అసంతృప్తికి తావులేకుండా, సమన్వయంతో పదవుల పంపిణీ జరగాలని, తద్వారా రాబోయే ఎన్నికల నాటికి క్షేత్రస్థాయిలో యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేయాలని ఈ భేటీలో పక్కా రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకున్నట్టు సమాచారం.
Read More
Next Story