అయోధ్య రామమందిర గర్భగుడిలోకి వర్షం నీళ్లు..
x

అయోధ్య రామమందిర గర్భగుడిలోకి వర్షం నీళ్లు..

శనివారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి ఆలయ పైకప్పు నుంచి వర్షం నీళ్లు గర్భగుడిలోకి చేరాయి. దీనిపై ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ ఏమన్నారు?


అయోధ్య రామాలయానికి చిల్లులు పడ్డాయి. శనివారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి ఆలయ పైకప్పు నుంచి వర్షం నీరు గర్భగుడిలోకి ప్రవేశించాయి. ఈ విషయాన్నిస్వయంగా ఆలయ ప్రధాని పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ తెలిపారు. ఆలయ నిర్మాణంలో ఇంజనీర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. వర్షం నీరు ఆలయం లోపలికి రాకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆలయ అధికారులను దాస్ కోరారు.

సమాచారం తెలుసుకున్న ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా ఆలయానికి చేరుకుని పరిశీలించారు. పైకప్పునకు మరమ్మతులు చేసి వాటర్‌ప్రూఫ్‌గా మార్చాలని ఆదేశాలు జారీ చేశారు.

ఆలయ నిర్మాణ పురోగతి గురించి మిశ్రా విలేకరులతో మాట్లాడారు. మొదటి అంతస్తు పనులు కొనసాగుతున్నాయని, ఈ ఏడాది జూలై నాటికి పూర్తవుతాయని చెప్పారు. డిసెంబర్ నాటికి ఆలయ నిర్మాణం మొత్తం పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

'ఇంత పెద్ద ఇంజినీర్లు ఉన్నా..’

ఆచార్య సత్యేంద్ర దాస్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘శనివారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి ఆలయ పైకప్పు నుండి గర్భగుడిలోకి నీళ్లు చేరాయి. రామ్‌లల్లా విగ్రహం ముందు పూజారి కూర్చునే చోట, దర్శనం కోసం విఐపిలు కూర్చునే ప్రదేశంలో వర్షం నీళ్లు వచ్చి చేరాయి. దేశం నలుమూలల నుంచి వచ్చిన ఇంజనీర్లు రామమందిరాన్ని నిర్మించారు. వర్షం కురిస్తే పైకప్పు నుంచి లీక్ కావడం ఆశ్చర్యంగా ఉంది. ఇంత పెద్ద ఇంజనీర్ల దగ్గరుండి నిర్మించిన ఆలయంలో ఇలా జరగకూడదు.’’ అని చెప్పారు.

ఇళ్లలోకి వర్షం నీరు..

వర్షానికి అయోధ్యలోని రాంపథ్ రోడ్డు దాని పరిసరాలు చిత్తడిగా మారాయి. మురుగునీరు ఆలయ సమీపంలోని ఇళ్లలోకి ప్రవేశించాయి. జల్వాన్‌పురా నుంచి హనుమాన్‌గర్హి భక్తిపథ్‌ వరకు మురుగు నీరు ఇళ్లలోకి చేరాయి.

‘సిబ్బంది తొలగిస్తున్నారు’

రాంపథ్‌ వీధుల్లో మురుగు నీరు ఇళ్లలోకి చేరడంపై అయోధ్య మేయర్ గిరీష్ పతి త్రిపాఠి స్పందించారు. మున్సిపాలిటీ సిబ్బంది ఇళ్లలోంచి నీటిని తొలగిస్తున్నారని చెప్పారు.

‘బీజేపీ అవినీతికి పాల్పడింది’

వర్షం నీళ్లు గర్భగుడిలోకి ప్రవేశించడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుబట్టింది. ఆలయ నిర్మాణంలో అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అవినీతికి పాల్పడిందని ఆరోపించింది.

"అది అమరవీరుల శవపేటికలు కావచ్చు లేదా ఆలయమూ కావచ్చు. బిజెపి అవినీతికి అవకాశాలుగా మారాయి." అని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ ఒక ప్రకటనలో ఆరోపించారు.

‘‘కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన రామమందిరం గర్భగుడిలో తొలి వర్షానికే పైకప్పు లీకవుతుంది. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదని ప్రధాన అర్చకుడు సత్యేంద్ర దాస్‌ ప్రకటనతో స్పష్టమైంది. ఇది మాత్రమే కాదు..రాంపాత్‌ రహదారి కూడా దెబ్బతింది. కేవలం ఎన్నికల ప్రయోజనాల కోసమే హడావుడిగా నిర్మాణాలు చేపట్టింది. అయోధ్యను బీజేపీ అవినీతికి కేంద్రంగా మార్చింది.స్థానికులకు సరైన పరిహారం ఇవ్వకుండా అన్యాయం చేశారు. ’’ అని అజయ్ రాయ్ పేర్కొన్నారు.

Read More
Next Story